
ఢిల్లీలో కొత్తగా అమల్లోకి వచ్చిన కఠినమైన ఇంధన నిషేధం ఖరీదైన కార్ల యజమానులకు శాపంగా మారింది. చాలా మంది తమ ఖరీదైన పాత ప్రీమియం కార్లను కారు చౌకగా అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం పోయకూడదు. రాజధానిలో నెలకొన్న తీవ్రమైన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (సీఏక్యూఎం) ఆదేశాల మేరకు నిషేధాన్ని అమలు చేస్తున్నారు.
మనీ కంట్రోల్ కథనం ప్రకారం.. వరుణ్ విజ్ అనే వ్యక్తి తన లగ్జరీ ఎస్‌యూవీ 2015 మెర్సిడెస్ బెంజ్ ఎంఎల్ 350ని తప్పని పరిస్థతిలో చాలా చౌకగా అమ్ముకోవాల్సి వచ్చింది. పదేళ్ల కిందట ఈ వాహనాన్ని ఆయన రూ.84 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ ఢిల్లీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పాత వాహనాలకు ఇంధన నిషేధం కారణంగా కేవలం రూ.2.5 లక్షలకే అమ్ముడుపోయింది.
దశాబ్ద కాలంగా తమ కుటుంబ జీవితంలో అంతర్భాగంగా ఉన్న కారును ఇప్పుడు వదిలించుకోవాల్సి రావడం వల్ల కలిగే భావోద్వేగాన్ని విజ్ వివరించారు. తన కుమారుడిని హాస్టల్ నుండి తీసుకురావడానికి వారానికి కేవలం 7-8 గంటల ప్రయాణానికి మాత్రమే ఈ కారును వినియోగించానని ఆయన గుర్తు చేసుకున్నారు. మొత్తంగా 1.35 లక్షల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిన ఈ కారుకు రొటీన్ సర్వీసింగ్, టైర్ రీప్లేస్మెంట్లకు మించి మరే ఖర్చులు చేయాల్సిన అవసరం లేదని, కానీ ఇంత చౌకగా అమ్ముడుపోయిందని విజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూ.62 లక్షలతో ఎలక్ట్రిక్ వాహనం కొన్నట్లు విజ్ తెలిపారు. ప్రభుత్వం ఇలా మరోసారి విధానం మార్చుకోకపోతే 20 ఏళ్ల పాటు దీన్ని వాడుకోవాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు.
రితేష్ గండోత్రా అనే వ్యక్తి కూడా తాను రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారును చౌకగా అమ్మాల్సి వస్తోందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇది డీజిల్ వేరియంట్. చాలా జాగ్రత్తగా ఉపయోగించాను. ఇప్పటివరకు కారులో కేవలం 74,000 కిలోమీటర్లే తిరిగాను. కొవిడ్ సమయంలో లాక్‌డౌన్ కారణంగా రెండేళ్ల పాటు ఏమీ వాడలేదు. ఇంట్లో పార్క్ చేసే ఉంచాను. ఇంకా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా కారుకు లైఫ్ ఉంది. ఎన్‌సీఆర్‌లో 10 సంవత్సరాల డీజిల్ వాహనాల నిషేధ నియమాల కారణంగా నా కారును విక్రయించవలసి వస్తోంది. అది కూడా ఎన్‌సీఆర్ వెలుపల కొనుగోలుదారులకు తక్కువ రేటుకే. మళ్లీ కొత్త వాహనం కొనుగోలు చేస్తే 45 శాతం జీఎస్టీ+ సెస్ విధిస్తారు. ఇది మంచి విధానం కాదు. బాధ్యతాయుతమైన యాజమాన్యానికి విధించే శిక్ష’ అని రాసుకొచ్చారు.