
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆండ్రాయిడ్ ఫోన్‌లను వినియోగిస్తున్నారు. రు. అయితే ఈ ఫోన్‌లలో ఏ బ్రౌజర్ వాడాలి.. ఏది సురక్షితం అన్న అవగాహన చాలా మందికి ఉండటం లేదు. ఫోన్‌లలో డిఫాల్ట్ ఏ బ్రౌజర్ ఇస్తే అదే వాడుతున్నారు. చాలా ఫోన్‌లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ డీఫాల్ట్‌గా వస్తోంది. దీంతో ప్రైవసీకి ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఆన్‌లైన్ భద్రతలో ప్రత్యేకత కలిగిన సర్ఫ్ షార్క్ అనే సంస్థ ఇటీవల కొన్ని పరిశోధనలు చేసింది. ఇందులో క్రోమ్ దాని పోటీదారుల కంటే ఎంత ఎక్కువ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు గుర్తించింది. క్రోమ్‌కు ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెక్యూరిటీ ఫీచర్లను గూగుల్ జోడించినప్పటికీ ఇప్పటికీ చాలా డేటాను బ్యాక్ గ్రౌండ్‌లో ట్రాక్ చేయడం మాత్రం మానడం లేదని బీజీఆర్ నివేదిక తెలిపింది.
అన్నీ ట్రాక్ చేస్తోంది..
ఆటోఫిల్, వ్యక్తిగతీకరించిన వార్తలు వంటి క్రోమ్ ఫీచర్లు పైకి జీవితాన్ని సులభతరం చేసేవిగా ఉన్నా కానీ అవే ఫీచర్లను గూగుల్ అడ్వర్టైజింగ్, అనలిటిక్స్ నెట్‌వర్క్‌లు కూడా ఉపయోగిస్తున్నాయి. దీని అర్థం ఏమిటంటే మీరు ఆన్‌లైన్లో ఎలా ప్రవర్తిస్తారో వివరణాత్మక చిత్రాన్ని రూపొందించడానికి మీరు చేసే క్లిక్‌లు, సెర్చ్‌లు, వెబ్ పేజీలో మీరు గడిపే సమయం కూడా ఎల్లప్పుడూ ట్రాక్ అవుతుందన్న మాట.
ఇదేదో ఊహాజనితంగా చెబుతున్న విషయం కాదు. ఇన్‌కాగ్నిటో మోడ్‌ను ఉపగించినవారి సమాచారాన్ని కూడా ట్రాక్ చేసినందుకు 2020లో గూగుల్‌పై కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత ప్రైవేట్ బ్రౌజింగ్ సెషన్ల సమయంలో సేకరించిన కోట్లాది రికార్డులను తొలగించేందుకు గూగుల్ అంగీకరించింది.
సర్ఫ్ షార్క్ పరిశోధన ప్రకారం, బ్రౌజింగ్ హిస్టరీ, సేవ్ చేసిన చెల్లింపు సమాచారం, కాంటాక్ట్ జాబితాలు వంటి సమాచారాన్ని క్రోమ్ సేకరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ఆండ్రాయిడ్ వినియోగదారులు ఉన్నారు, కాబట్టి సేకరించే డేటా మొత్తం భారీగా ఉంటుంది. ఇదంతా యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచేందుకేనని పైకి చెబుతున్నా తెర వెనుక చాలా మందికి తెలియకుండానే వారి డేటా చోరీకి గురవుతోంది.
ప్రత్యామ్నాయాలు లేవా?
ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ముప్పుతో కూడిన గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కు ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. బ్రౌజర్లను మార్చడం సులభం. బ్రేవ్, డక్ డక్గో, ఫైర్‌ఫాక్స్, టోర్ ఇవన్నీ ట్రాకర్లను ఆపివేసే, బ్యాక్‌గ్రౌండ్‌లో సేకరించగల డేటా మొత్తాన్ని పరిమితం చేసే గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చే బ్రౌజర్లు. సెట్టింగ్ లలో మార్పులు చేసుకుని, ఈ బ్రౌజింగ్ యాప్‌లకు మారడం ద్వారా మీ ఫోన్ నుండి వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లకుండా పరిమితం చేయవచ్చు. క్రోమ్ కూడా ఇటీవల ట్రాకింగ్ తగ్గించడంలో సహాయపడటానికి ఐపీ అడ్రస్ మాస్కింగ్ వంటి సాధనాలను జోడించింది. కానీ ఇది ఇప్పటికీ డేటా-హెవీ బ్రౌజర్ అనే వాస్తవాన్ని మార్చదని నిపుణులు అంటున్నారు.