ట్యాక్స్‌ లేదన్నారు.. 8 లక్షలకే పన్ను కట్టమంటున్నారే.. | Compare and convince old and new tax regimes | Sakshi
Sakshi News home page

ట్యాక్స్‌ లేదన్నారు.. 8 లక్షలకే పన్ను కట్టమంటున్నారే..

Aug 25 2025 4:41 PM | Updated on Aug 25 2025 4:49 PM

Compare and convince old and new tax regimes

‘‘పన్నెండు లక్షలు దాటకపోతే ట్యాక్స్‌ లేదన్నారు. రూ. 8 లక్షల ఆదాయానికే పన్ను కట్టమంటున్నారు’’ అని విసుక్కున్నాడు వీరభద్రం తన కన్సల్టెంటు మీద. ‘‘మనం కడుతున్నది 2025 మార్చి 31 నాటికి సంబంధించినది సార్‌’’ అని కన్సల్టెంట్‌ చెప్పారు. ‘‘అంటే?’’  .. ఎదురు ప్రశ్న వేశాడు వీరభద్రం.

పార్లమెంటులో ఆర్థిక మంత్రి ప్రసంగం, బిల్లు పాస్‌ అయిన వైనం 2026 మార్చి 31తో పూర్తయ్యే సంవత్సరానికి వర్తిస్తుందని ఎన్నో ఉదాహరణలతో చూపించిన తర్వాత, అశక్తుడై, ప్రతిఘటనతోనే ఒప్పుకున్నాడు వీరభద్రం.

నికర ఆదాయంలో నుంచి బేసిక్‌ లిమిట్‌ తీసివేసి, మిగతా మొత్తంలో నుంచి మొదటి రూ. 3 లక్షలకు నిల్‌ అని లెక్క కట్టారు గోవిందరావుగారు. నా చేత ఎక్కువ పన్ను కట్టిస్తున్నారని వాపోయారు. ఎన్నో ఉదాహరణలను చూసిన తర్వాత కూడా ‘‘ఇదంతా మాకు ఏం అర్థం అవుతుంది లెండి. మీరెంత అంటే అంతే’’ అని మర్యాదగా వత్తాసు పలికారు.

‘‘లాస్ట్‌ ఇయర్‌ ఇంత పన్ను కట్టలేదు. ఈసారి ఎక్కువ కడుతున్నాం’’ అని హెచ్చరిక చేశాడు హరనాధం. ఆయన ఇచ్చిన ఫీజు రూ. 2,000కు మరో రెండు గంటలు వెచ్చించక తప్పదని నిర్ణయించుకున్నాడు కన్సల్టెంటు కామేశం గారు.

గత ఆర్థిక సంవత్సరం, అంతక్రితం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీతం, ఇంటద్దె, ఫిక్సిడ్‌ డిపాజిట్లపై వడ్డీ, సేవింగ్స్‌ అకౌంట్‌పై వడ్డీ, మ్యుచువల్‌ ఫండ్‌ వ్యవహారాలు, 80సీ సేవింగ్స్, 80డీ మెడిక్లెయిం, 80జీ డొనేషన్లు.. అన్నీ చెక్‌ చేసి, నికర ఆదాయం, పన్ను శ్లాబులు, పన్ను రేట్లు, పన్ను భారం, సెస్సు, సర్‌చార్జీ.. ఏదీ వదిలిపెట్టకుండా వివరించారు. చివరికి కన్విన్స్‌ అయ్యాడు హరనాధం.

‘‘నాకు నమ్మకం ఉంది. మీరెందుకు తప్పు చేస్తారు’’ అని ఓ కితాబిచ్చి కదిలాడు. వెళ్తూ.. వెళ్తూ.. ‘‘మా బావమరిదికి నాకు ఆదాయం ఇంచు మించు సమానమే. వాడేమీ కట్టలేదన్నాడు. అందుకనే అడిగాను’’ అంటూ సాగదీశాడు. ‘‘కొత్త పద్ధతో, పాత పద్ధతో.. ఏది తక్కువైతే అది తగలెట్టండి’’ అని వ్యంగ్యంగా అన్నాడు వామనరావు. ‘‘అయ్యా ఏది తక్కువైతే అదే కట్టించండి’’ అని వేడుకున్నాడు వెంకటేశం.

‘‘పాఠక మహాశయులైన మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. కంపేర్‌ చేసి, కన్విన్స్‌ కండి’’.. ఇది మా విన్నపం.  

నిజమే మాస్టారు!! మీరు నైబర్‌తో, ఓనర్‌తో, మీ ఇంట్లో అద్దెకున్న వారితో, అన్నతో, తమ్ముడితో, వియ్యంకుడితో, మార్నింగ్‌ వాక్‌ ఫ్రెండుతో, యోగా కొలీగ్‌తో, మీ డాక్టర్‌గారి దగ్గరకొచ్చే పేషంటు ఫ్రెండుతో కంపేర్‌ చేసుకోవద్దండి. అందరి లెక్కలు ఒకలాగా ఉండవు. తేడాలుంటాయి. కాబట్టి, ఎంచక్కా మీరు మీ ఇన్‌కంతో మాత్రమే కంపేర్‌ చేసుకోండి.

  • 2024 మార్చి 31కి సంబంధించిన ఆదాయం, అలాగే 2025 మార్చి 31కి వచ్చిన ఆదాయం

  • డిడక్షన్లు.. అంశాలవారీగా 

  • టీడీఎస్‌ వివరాలు 

  • టీసీఎస్‌ వివరాలు 

  • అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులు 

  • 2024 మార్చి 31కి ఏ పద్ధతిలో చెల్లించారు 

  • 2025 మార్చి 31కి ఏది ఫాలో అవుతున్నారు 

  • 2025 మార్చి 31 నాటికి రెండు పద్ధతుల్లోనూ పన్ను భారం లెక్కించి, కంపేర్‌ చేయండి. 

  • ఏ ఆదాయాన్నైనా మర్చిపోయారా 

  • గత సంవత్సరం వచ్చిన ఆదాయం ఏదైనా ఈ సంవత్సరంలో రాలేదా 

  • అలాగే డిడక్షన్లలో తేడాలు 

  • ఈ లెక్కలు కంపేర్‌ చేసి అప్పుడు కన్విన్స్‌ అవ్వండి.

ఇలా కంపేర్‌ చేయడానికి మీరు ఎవర్ని అడగనక్కర్లేదు. ఆధారపడక్కర్లేదు. మీరే చేసుకోవచ్చు. దాని ప్రకారం ఫాలో అవ్వండి. మీరే కన్విన్స్‌ అవుతారు. ఇంతలో పరుగెత్తుకుంటూ వచ్చాడు హరనాధం గారి బామ్మర్ది పరంధామయ్య, ‘‘మా బావగారు నన్ను దెప్పి పొడుస్తున్నారు. మనం తప్పు చేశామా అని’’ అంటూ. అప్పుడు కన్సల్టెంటు కామేశం తన వృత్తి రహస్యాలను చెప్పాడు.  

‘‘ఏమీ తప్పు చేయలేదండి. ఒక విషయం చెబుతా. ఇవన్నీ ప్రీఫిక్సిడ్‌ రిటర్నులు. మేము 26ఏఎస్‌ మొదలైన సమాచారాన్ని కరెక్టుగా ఎంటర్‌ చేస్తాం. ఆటోమేటిక్‌గా పోర్టల్‌ సమాచారాన్ని తీసుకుంటుంది. కొత్త పద్ధతా, పాత పద్ధతా అనేది చెబుతాం. పన్ను భారం లెక్కించబడుతుంది. ఎటువంటి తప్పులు జరగవు. ఆదాయం ఎంట్రీ, డిడక్షన్లు ఎంట్రీ, తప్పుగా రాస్తే తప్ప. లెక్కింపులో ఏ పొరపాటు జరగదు. చాలా కరెక్టుగా సాఫ్ట్‌వేర్‌ ఉంటుంది. అందుకుని తప్పులు జరగవు. అయితే, మీలాంటివాళ్లు ఎక్సెల్‌ షీటులో మాన్యువల్‌గా చేసి, కంపేర్‌ చేసి, కన్విన్స్‌ అవ్వొచ్చు’’ అని వివరించాడు. ఇది విని చిద్విలాసంగా బైల్దేరాడు పరంధామయ్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement