ఏవియేషన్‌కు కొలువుల కళ!

Additional recruitments for Aviation industry - Sakshi

ఉద్యోగులకు మళ్లీ పూర్వవైభవ

30 శాతం అదనపు నియామకాలు

వచ్చే రెండు త్రైమాసికాల్లో ఉంటాయన్న అంచనా

న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా ఇన్ఫెక్షన్‌ కేసులు గణనీయంగా తగ్గిపోవడం, ప్రయాణాలపై అన్ని ఆంక్షలు తొలగిపోవడం ఏవియేషన్‌ పరిశ్రమకు కలసి వస్తోంది. దీంతో గత రెండేళ్ల నుంచి విహార యాత్రలకు దూరమైన వారు.. ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకుని విమానం ఎక్కేస్తున్నారు. ఈ పరిస్థితులు ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. మరోవైపు రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా నుంచి ఆకాశ ఎయిర్‌లైన్స్‌ కొత్తగా సేవలు ఆరంభిస్తుండడం, మరోవైపు చాలా కాలంగా నిలిచిన జెట్‌ ఎయిర్‌వేస్‌ సేవల పునరుద్ధరణతో ఈ రంగంలో ఉద్యోగాలకు డిమాండ్‌ ఏర్పడింది.

దీంతో వచ్చే రెండు త్రైమాసికాల్లో ఎయిర్‌లైన్స్‌ సంస్థలు సుమారు 30 శాతం మేర అదనంగా ఉద్యోగులను నియమించుకోవచ్చని పరిశ్రమ నిపుణుల అంచనా. ఆటోమేషన్‌ చుట్టూ చర్చ నడుస్తున్నప్పటికీ.. ఏవియేషన్‌ పరిశ్రమ ఎక్కువగా మానవవనరులపైనే ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ బిజినెస్‌ హెడ్‌ (రిటైల్, ఈ కామర్స్, లాజిస్టిక్స్, ట్రాన్స్‌పోర్టేషన్‌) జోయ్‌ థామస్‌ తెలిపారు. ఏవియేషన్‌ పరిశ్రమలో నెలకొన్న ధోరణులను పరిశీలిస్తే వచ్చే రెండు క్వార్టర్లలో నియామకాలు 30 శాతం పెరగొచ్చని చెప్పారు. మాన్‌స్టర్‌ డాట్‌ కామ్‌ డేటాను పరిశీలిస్తే.. 2022 ఏప్రిల్‌ నెలలో ఏవియేషన్‌ రంగంలో నియామకాలు రెండంకెల స్థాయిలో పెరిగాయని తెలుస్తోంది.  

మారిన పరిస్థితులు..
కరోనా కారణంగా ప్రయాణాలపై విధించిన ఆంక్షల వల్ల ఏవియేషన్‌ రంగం గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులను చూసిన మాట వాస్తవం. ఏవియేషన్, దీని అనుబంధ రంగాలు ప్రపంచవ్యాప్తంగా 2020 నుంచి భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫ్రయిట్‌ ఫార్వార్డర్స్, కార్గో ఎయిర్‌లైన్స్‌ ఒక్కటే ఇందుకు భిన్నం. దీంతో ఏవియేషన్‌ రంగంలో భారీగా ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. వేతనాల్లో కోత పడింది. ఎయిర్‌లైన్స్‌ సంస్థలు 2020 ఏప్రిల్, మే నెలల్లో అసలు సర్వీసులే నడపలేని పరిస్థితి.

ఆ తర్వాత నుంచి రెండేళ్లపాటు దేశీయ సర్వీసులకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో  నష్టాలను తట్టుకోలేక ఉద్యోగుల వేతనాలకు కోతలు పెట్టిన పరిస్థితులు చూశాం. కరోనా రెండేళ్ల కాలంలో ఈ పరిశ్రమలో సుమారు 20,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని పార్లమెంటరీ డేటానే చెబుతోంది. రూ.25,000 కోట్లకు పైగా పరిశ్రమ నష్టాలను ఎదుర్కొన్నది. ఇండిగో అయితే తన మొత్తం సిబ్బందిలో 10 మందిని తగ్గించింది. విస్తారా సైతం తన సిబ్బంది వేతనాలకు కోత పెట్టింది. స్పైస్‌జెట్, గోఫస్ట్‌ వేరియబుల్‌ పేను ఆఫర్‌ చేశాయి.  

కొత్త సంస్థలు..
వచ్చే రెండు త్రైమాసికాల్లో ఆకాశ ఎయిర్‌లైన్స్, జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు మొదలవన్నాయి. ఎయిర్‌ ఇండియా యాజమాన్యం మారిపోవడం, టాటా గ్రూపులో ఎయిర్‌లైన్స్‌ సంస్థల స్థిరీకరణ, కరోనా కేసులు తగ్గిపోవడం, విదేశీ సర్వీసులకు ద్వారాలు తెరవడం డిమాండ్‌కు మద్దతుగా నిలుస్తాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కమర్షియల్‌ పైలట్ల నియామకాలు వచ్చే కొన్నేళ్లపాటు వృద్ధి దశలోనే ఉంటాయని క్వెస్‌కార్ప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కపిల్‌ జోషి చెప్పారు. కొత్త సంస్థల రాక, ఉన్న సంస్థలు అదనపు సర్వీసులను ప్రారంభించడం వల్ల నిర్వహణ సిబ్బందికి డిమాండ్‌ పెంచుతుందని జోషి వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top