చిత్ర పరిశ్రమలో సరికొత్త శకానికి నాంది పలికిన హాలీవుడ్‌..!

Actress Yulia Peresild Beats Tom Cruise To Reach Space First - Sakshi

అప్పుడప్పుడు మనం సినిమాల్లో అంతరిక్షం, వ్యోమగాములకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూస్తూ ఉంటాం. అయితే, అలాంటి చిత్రాల కోసం ప్రత్యేకంగా సెట్స్‌ డిజైన్‌ చేయడమో లేదా గ్రాఫిక్స్‌ రూపంలోనో వాటిని డైరెక్టర్లు చూపిస్తారు. ఆ చిత్రాలు కూడా నిజంగానే అంతరిక్షానికి వెళ్లి తీశారో ఏమో అన్న అనుభూతిని కలిగిస్తాయి. తాజాగా, అంతరిక్షం, వ్యోమగాములకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ కోసం రష్యాకు చెందిన ఓ చిత్ర బృందం ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లారు. షూటింగ్‌ కోసం ఆ సినిమా డైరెక్టర్‌, హీరోయిన్‌ ప్రత్యేక వ్యోమనౌకలో నేడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఐస్‌)కు బయల్దేరి వెళ్లారు.

‘ది ఛాలెంజ్‌’ అనే సినిమా షూటింగ్‌ కోసం ఆ చిత్ర దర్శకుడు క్లిమ్‌ షిపెంకో, హీరోయిన్‌ యులియా పెరెసిల్డ్‌ నేడు అంతరిక్షానికి బయల్దేరారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన సోయుజ్‌ ఎంఎస్‌19 వ్యోమనౌకలో మరో వ్యోమగామి ఆంటన్‌ ష్కాప్లెరోవ్‌తో కలిసి ఐఎస్‌ఎస్‌ వెళ్లారు. మన దేశ కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2.25 గంటల ప్రాంతంలో కజకిస్థాన్‌లోని బైకోనుర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. 12 రోజుల పాటు వీళ్లు స్పేస్ స్టేష‌న్‌లోనే ఉండ‌నున్నారు. ఆ త‌ర్వాత వీళ్ల‌ను మ‌రో ర‌ష్య‌న్ కాస్మోనాట్ భూమి మీదికి తీసుకు వస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం నాలుగు నెలల ప్రత్యేక శిక్షణ తీసుకుంది.

అంతరిక్షంలో మూవీ షూటింగ్‌ను ర‌ష్య‌న్ మీడియాలో కొంద‌రు తీవ్రంగా విమ‌ర్శించినా లెక్క చేయ‌కుండా ర‌ష్య‌న్ స్పేస్ కార్పొరేష‌న్ రాస్‌కాస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ ఈ మిష‌న్‌లో కీల‌క పాత్ర పోషించారు. అక్కడి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయితే, అంతరిక్షంలో సినిమా తీసిన తొలి దేశం రష్యానే కానుంది. గతేడాది ప్రముఖ హాలీవుడ్‌ హీరో టామ్‌ క్రూజ్‌ కూడా స్పేస్‌లో షూటింగ్‌ చేయడం కోసం సిద్దమైన సంగతి తెలిసిందే. దానికోసం నాసా, స్పేస్‌-ఎక్స్‌ సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే ఆ తర్వాత దానిపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఈ మధ్య కాలంలో అంతరిక్ష పర్యటన అనేది చాలా ఒక బస్ జర్నీ లాగా మారింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top