డైరెక్టర్ సాయిలు కాంపాటి,
గేయ రచయిత నంద కిశోర్‌లకు..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలుగు చలన చిత్ర రంగంలో విశేష సేవలందించిన వారికి 2025 ఏడాదికిగాను రాష్ట్ర ప్రభుత్వం శనివారం గద్దర్ అవార్డులు ప్రకటించగా, వాటిలో జిల్లాకు రెండు దక్కాయి. రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఇల్లెందు మండలం కొమరారం గ్రామానికి చెందిన సాయిలు కాంపాటి ఉరఫ్ జగదీశ్ చంద్రబోస్‌కు గద్దర్ అవార్డు వచ్చింది. దీంతోపాటు అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన కుబేర చిత్రంలో ‘ నా కొడుకా’ పాట కు ఉత్తమ గేయ రచయితగా నంద కిశోర్ అవార్డు అందుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురానికి చెందిన కిశోర్ ఏడాది కాలంగా ఇక్కడి జిల్లా విద్యా విభాగంలో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నాడు. తొలిపాటకే అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపాడు.
మహిళలు
ఆదర్శంగా నిలవాలి
కలెక్టర్ అంకిత్
సూపర్‌బజార్(కొత్తగూడెం): సమాజంలో మహిళలు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముందస్తుగా వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ అంకిత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళల అభివృద్ధికి విద్య ఎంతో కీలకమని అన్నారు. కొత్తగూడెం ము న్సిపల్ కార్పొరేషన్ మేయర్ గణేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి స్వర్ణలత లెనీనా కూడా మాట్లాడారు.అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలు, మహిళా కార్పొరేటర్లు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను ఘనంగా సత్కరించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ పి. వీరబాబు పాల్గొన్నారు.
నేటి నుంచి
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్
చుంచుపల్లి: జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్లు డీఎంహెచ్‌ఓ తుకారామ్ రాథోడ్ శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగూడెం జనరల్ హాస్పిటల్, పాల్వంచ, ఇల్లెందు, అశ్వారావుపేట, బూర్గంపాడు, మణుగూరు, భద్రాచలం, చర్ల ఆస్పత్రుల్లో ఈ కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. 3 నెలలపాటు వ్యాక్సినేషన్ నిర్వహిస్తామని, పద్నాలుగేళ్లు నిండి, 15 ఏళ్లలోపు ఉన్న బాలికలకు వ్యాక్సిన్ ఇస్తామని, జిల్లా వ్యాప్తంగా మొత్తం 10,393 మంది బాలికలను గుర్తించామని వివరించారు.


