
దమ్మక్కకు నీరాజనం
భద్రాచలం : భద్రగిరి రామయ్య మూలమూర్తులకు నీడనిచ్చి, పూజలందించిన అపర భక్తురాలు దమ్మక్కకు వైభవంగా నీరాజనం పలికారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి భక్తురాలిగా ఖ్యాతిగాంచిన పోకల దమ్మక్కకు.. ఆషాఢ పూర్ణిమ రోజున గిరిజనుల సమక్షంలో దమ్మక్క సేవా యాత్ర పేరిట దేవస్థానం ఆధ్వర్యంలో 2014 నుంచి వేడుకలు నిర్వహిస్తున్నారు. గురువారం ఆషాఢ పూర్ణిమ కావడంతో ఈ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరిపించారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని చెట్టు వద్ద గల దమ్మక్క విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, కోలాటాలు, గిరిజనుల సంప్రదాయ నృత్యాల నడుమ చప్టా దిగువన ఉన్న భక్త రామదాసు విగ్రహం వద్ద, సీతారామ ఆఫీసర్స్ క్లబ్ వద్ద నున్న శబరి విగ్రహం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేసి పూలు, పండ్లు సమర్పించారు. రామదాసు కీర్తనలతో నగర సంకీర్తన చేశారు. అనంతరం దేవస్థానంలో రామయ్యకు దమ్మక్క తరఫున పలు రకాల పండ్లు, పూలు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ భవాని రామకృష్ణ, ప్రధానార్చకులు విజయరాఘవన్ తదితరులు పాల్గొన్నారు.
వెంకటాపురంలో రామయ్య కల్యాణం..
కాగా, దమ్మక్క సేవా యాత్రను పురస్కరించుకుని ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో రామయ్య కల్యాణాన్ని జరిపించారు. ప్రచార రథంలో స్వామివారు వెళ్లగా భక్తులు ఘన స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి వారిని కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా తమ ముందుకు వచ్చిన భద్రాద్రి రామయ్యకు భక్తులు మొక్కులు సమర్పించారు.
కమనీయంగా గోవిందరాజ స్వామి కల్యాణం..
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అనుబంధ ఆలయం, తాతగుడి సెంటర్‌లో వేంచేసి ఉన్న గోవిందరాజ స్వామి వారి తిరుకల్యాణోత్సవాన్ని గురువారం వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీదేవి – భూదేవి సమేత గోవిందరాజ స్వామి వారికి దేవస్థానం తరఫున అధికారులు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
దేవస్థానం ఆధ్వర్యంలో గిరిప్రదక్షిణ
కమనీయంగా గోవిందరాజస్వామి కల్యాణం
కళ తప్పిన సేవాయాత్ర..
భద్రాచలంలో నిర్వహించిన దమ్మక్క సేవా యాత్ర పూర్తిగా కళ తప్పింది. గతంలో వివిధ గ్రామాలను ప్రత్యేక బస్సుల ద్వారా గిరిజనులను ఒకరోజు ముందుగానే భద్రాచలం తీసుకొచ్చి వారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పించేవారు. సంప్రదాయ నృత్యాలతో గిరిజనులు సైతం ఉత్సాహంగా పాల్గొని స్వామి వారికి పూలు, పండ్లు సమర్పించేవారు. వేడుక అనంతరం ఆలయం తరఫున గిరిజనులకు వస్త్రాలు అందించేవారు. కానీ ఈ ఏడాది అలాంటివేమీ లేకుండానే సాదాసీదాగా వేడుక నిర్వహించారు. కాగా, గురువారం జరిగిన సేవా యాత్రలో గిరి ప్రదక్షిణను ఆదివాసీ నాయకులు పూనెం కృష్ణ, వీరభద్రం అడ్డుకొని నిరసన తెలిపారు. గిరిజన సంఘాలను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బైఠాయించారు. దేవస్థానం అధికారులు గిరిజనులను అవమానించారని ఆరోపించారు.

దమ్మక్కకు నీరాజనం