ఆటోనగర్‌లో లంచాల దందా
అధికారుల తీరుతో వ్యాపారులు బెంబేలు ప్లాటు క్రయవిక్రయాలపైనా ఇవ్వాల్సిందే పేరు మార్పునకు కూడా అడ్డగోలుగా వసూలు చేస్తున్న యంత్రాంగం ఇవ్వకుంటే లేనిపోని సాకులతో కాలయాపన చేస్తూ వేధింపులు
ఆస్తి పన్ను విషయంలోనూ..
ఆటోనగర్‌లో అవినీతి రాజ్యమేలుతోందని.. అన్నింటికీ వసూళ్లు అధికం అయ్యాయని ప్లాట్ల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ప్లాటు కొనుగోలు చేసినా, అమ్మినా భారీ మొత్తంలో లంచాలు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. చెప్పిన మొత్తం చెల్లిస్తే సజావుగా పనిఅయిపోతోందని... లేకుంటే కొర్రీలు పెట్టి కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
తెనాలి: పంటకాల్వల నడుమనున్న తెనాలి పట్టణంలో ఆటోమొబైల్ సంస్థలు రోడ్డుపక్కన నడుస్తుండేవి. వీటి కారణంగా ట్రాఫిక్ రద్దీ అనివార్యమయ్యేది. ఈ సమస్య నివారణకని నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి పౌరసరఫరాల శాఖ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ ఆటోనగర్ ఆలోచన చేశారు. అందుకోసం తెనాలి – విజయవాడ రోడ్డులో మండల గ్రామం సోమసుందరపాలెం సమీపాన 54 ఎకరాలను సేకరించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆటోనగర్ ఏర్పాటైంది. మొత్తం 418 ప్లాట్లుగా విభజించారు. పట్టణంలోని చిన్నాచితకా సంస్థలు ఆటోనగర్‌కు రావటం మొదలైంది. క్రమంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటై, అభివృద్ధి చెందాయి. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) నిర్వహణ బాధ్యతలను చూస్తోంది.
పెరిగిన విలువ
ఇప్పుడు ఆటోనగర్ అంటే ప్రగతికి పర్యాయపదం. భూముల విలువ విపరీతంగా పెరిగింది. ఆటోమొబైల్ సంస్థలకన్నా ఇతర రంగాలకు చెందిన వ్యాపార సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇందులో మినపగుళ్లు సంస్థలు, ఫర్నిచర్ పరిశ్రమలు సహా రకరకాల వ్యాపారాలు ఇక్కడ సాగుతున్నాయి. కొత్తగా ఎలాంటి పరిశ్రమ ఆరంభించాలన్నా ఆటోనగర్‌కేసి చూస్తున్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలను ఏపీఐఐసీ, పారిశుద్ధ్యం, వీధిదీపాలు, వ్యర్థాల నిర్వహణను ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐఏఎల్‌ఏ) చూస్తోంది.
కాదంటే కొర్రీలు
ఇంతగా విస్తరించిన ఆటోనగర్‌లో ఇప్పటికీ పరిష్కారం కాని సమస్యలు చాలా ఉన్నాయి. వాటికి తోడు కొత్తగా అధికారుల అవినీతితో వ్యాపార సంస్థల యజమానులు బెంబేలెత్తుతున్నారు. ఆటోనగర్ అభివృద్ధితో అక్కడ భూముల విలువ భారీగా పెరిగిపోయింది. ఎవరైనా తమ ప్లాటును విక్రయించాలని భావిస్తే ఎలాంటి బకాయిలు లేరని నిర్ధారిస్తూ ఏపీఐఐసీ అధికారులు ‘నో డ్యూస్’ సర్టిఫికెట్‌ను యజమానికి ఇవ్వాల్సి ఉంది. ఆ సర్టిఫికెట్ లేకుంటే ప్లాటు రిజిస్ట్రేషను జరగదు. దీనిని ఆసరాగా చేసుకుని ప్లాటు అమ్మే యజమాని నుంచి రూ.20 వేల నుంచి రూ.25 వేలు వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. లేదంటే సదరు ప్లాటును ఏ యాక్టివిటీ నిమిత్తం తీసుకున్నారు? చేంజ్ ఆఫ్ యాక్టివిటీ తీసుకున్నారా? సేల్స్‌టాక్స్ బిల్లులు ఉన్నాయా? అంటూ నిబంధనల పేరిట కొర్రీలు పెడుతున్నారు. యజమానులు కూడా చేసేదిలేక అడిగినంత ఇచ్చేస్తున్నారు.
కొనుగోలు చేసినా కష్టాలే
ప్లాటు కొన్న యజమాని పేరు మార్పు చేసుకోవటం మరో ప్రక్రియ. ఇందుకోసం ప్రభుత్వం కొంత ఫీజును నిర్ణయించింది. ఆటోనగర్‌లో ఉండే ఏపీ ఐఐసీ కార్యాలయంలో బిల్ కలెక్టర్ సంబంధిత కార్యక్రమాన్ని ఆఫ్‌లైన్/ఆన్‌లైనులో పూర్తి చేస్తారు. ఇందుకుగాను ‘ఫీజు టు ఫీజు’ విధానాన్ని అమలు చేస్తున్నారని చెబుతున్నారు. అంటే కొనుగోలు చేసిన ప్లాటుకు పాత యజమాని పేరు మార్చి కొన్నవారి పేరిట మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు ఎంతుంటే, అంతే మొత్తాన్ని లంచం రూపంలో చెల్లించాల్సి వస్తోందని వ్యాపారులు వాపోతున్నారు.
వ్యాపార సంస్థలు చేపట్టే నిర్మాణాలకు ఏపీఐఐసీ నుంచి ప్లాను అనుమతి పొందాలి. నిబంధనల ప్రకారం ఆ నిర్మాణాలకు ఆస్తిపన్ను విధించాల్సి ఉంటుంది. అయితే అధికారులను ప్రసన్నం చేసుకున్నవారికి ఆస్తిపన్ను విధించకుండా కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే ప్లాట్లను తీసుకున్న యజమానులు నిర్దేశించిన వ్యాపారాలను ప్రారంభించాలి. ఏళ్ల తరబడి ఆరంభించని ఖాళీ ప్లాట్లు కూడా ఉన్నాయి. నిబంధనల ప్రకారం వాటి కేటాయింపును రద్దు చేసే అధికారం ఉంది. అయినా ‘మామూలు’గానే పట్టించుకోవటం లేదంటున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆటోనగర్ సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కావాల్సిన సౌకర్యాలను సిఫార్సు చేసేవారు. ఉన్నతాధికారులు కూడా వఎలాంటి అవినీతికి తావులేకుండా చూసేవారు. ఇప్పుడు సమస్యలు అలాగే ఉన్నాయి. ప్రోత్సాహకాలు ఎటూ లేవు. లంచాల భారాన్ని తగ్గించాలని వ్యాపారులు కోరుతున్నారు.


