అమరవీరుల త్యాగాలే స్ఫూర్తి
బాపట్ల టౌన్: అమరవీరుల త్యాగాలే స్ఫూర్తిగా ప్రజలకు సేవ చేయాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం 5 కి.మీ. మారథాన్ నిర్వహించడం జరిగింది. సుమారు 200 మంది విద్యార్థినులు, విద్యార్థులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమై చీలురోడ్డు, పాత బస్టాండ్ మీదుగా గడియార స్తంభం సెంటర్, రథంబజార్, ఎంజీరోడ్, తహసీల్దారు కార్యాలయం మీదుగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి మారథాన్ చేరింది. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఈ నెల ఆఖరు వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించే పోలీస్ సిబ్బంది త్యాగాలు ఎప్పటికీ మరువరానివని తెలిపారు. విజేతలకు ఈ నెల 31వ తేదీన బహుమతులు అందిస్తామని పేర్కొన్నారు. త్వరలో వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తామని చెప్పారు.
విజేతలు వీరే...
ఓవరాల్ విజేతలుగా తొలి మూడు స్థానాల్లో బాపట్ల అగ్రికల్చర్ కళాశాల మూడవ ఏడాది విద్యార్థి డి. మనోహర్, పీజీఆర్‌ఎస్ సెల్‌లో విధులు నిర్వహించే సివిల్ కానిస్టేబుల్ పి.నాగ బ్రహ్మారెడ్డి, అగ్రికల్చర్ కళాశాలలో మూడవ ఏడాది విద్యార్థి బసల్ బోబాన్‌లు నిలిచారు. పోలీసుల కేటగిరీలో జి.పి.నాగ బ్రహ్మారెడ్డి, ఏఆర్ విభాగంలో విధులు నిర్వహించే జి. కృష్ణ, చిన్నగంజాం పోలీస్ స్టేషననులో విధులు నిర్వహించే సీహెచ్ దుర్గాప్రసాద్, విద్యార్థుల కేటగిరీలో అగ్రికల్చర్ కళాశాలకు చెందిన డి.మహేంద్ర, బసల్ బోబాన్, పి.వినయ్ కుమార్‌లు, విద్యార్థినుల విభాగంలో బాపట్ల అగ్రికల్చర్ కళాశాలకు చెందిన డి.దీపిక, జి.భార్గవి, షేక్ ఫిరోజా కౌశర్బీలు వరుసగా మొదటి మూడు స్థానాలలో నిలిచారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి.విజయసారథి, బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ జి.నారాయణ, బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆర్.రాంబాబు, ఆర్‌ఐలు షేక్ మౌలాలుద్దీన్, టి.శ్రీకాంత్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
మారథాన్ ప్రారంభోత్సవంలో జిల్లా ఎస్పీ


