రేపల్లె: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ అన్నారు. పట్టణంలోని 3వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఆదివారం సాయంత్రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైఎస్సార్ ఎప్పుడూ ప్రజాసంక్షేమాన్ని కోరుకుందని, ఆ దిశగానే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు పడ్డాయని గుర్తుచేశారు. కూటమి కుయుక్తులపై వైఎస్సార్ సీపీ బలంగా పోరాడుతుందని, ఎక్కడా తగ్గేదిలేదన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
నియోజకర్గంలో ప్రజలకు నిరంతరం తోడుగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికై పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రేపల్లె పట్టణ, మండలాల కన్వీనర్‌లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, డుండి వెంకట రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చదలవాడ శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నిజాంపట్నం కోటేశ్వరరావు, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు వీసం నాగలక్ష్మి, నాయకులు యార్లగడ్డ మదన్‌మోహన్, చిమటా బాలాజీ, అబ్దుల్ ఖుద్దూష్, గౌస్, నీలా నాంచారయ్య, పట్టెం శ్రీనివాసరావు, కొలుసు బాలకృష్ణ, సజ్జా పద్మావతి, కాటూరి శారద, లియాఖత్ భాషా, ఆలా రాజ్‌పాల్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
భారీగా రేషన్ బియ్యం స్వాధీనం
ప్రత్తిపాడు: రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపిన ప్రకారం... వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడుకు చెందిన ఓ రైస్ మిల్లులో అక్రమంగా రేషన్ బియ్యం పెద్ద ఎత్తున నిల్వ చేశారన్న సమాచారం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు అందింది. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు గుంటూరు సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ జి. భానూదయ, సీఐ రమానాయక్, సిబ్బందితో కలిసి మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మిల్లులో రేషన్ బియ్యం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారాన్ని రెవెన్యూ, సివిల్ సప్లైస్ అధికారులకు తెలియజేశారు. వట్టిచెరుకూరు తహసీల్దార్ క్షమారాణి, సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్‌లు మిల్లు వద్దకు చేరుకున్నారు. బస్తాల్లో నిల్వ చేసిన సుమారు 60 టన్నులకు పైగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
తొలి ఏకాదశి పూజలు
మంగళగిరి: మంగళగిరి తాడేపల్లి సంస్థ పరిధిలోని ఆరవ బెటాలియన్‌లో ఆదివారం ఆషాఢ తొలి ఏకాదశి సందర్భంగా మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. బెటాలియన్ కమాండెంట్ మాట్లాడుతూ భక్తులు అమ్మవారికి సారె చీరెలు సమర్పించడం ఆనవాయితీ అని, అమ్మవారి దయతో కుటుంబాలు సంతోషంగా ఉంటాయని నమ్మకం అని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాడెంట్ ఆశ్వీరాదం, అధికారులు, స్థానిక మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.
దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పణ
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం శివాలయం వీధికి చెందిన మహిళలు ఆదివారం విజయవాడ కనక దుర్గమ్మ వారికి ఆషాఢ సారె సమర్పించారు. శ్రీ సోమేశ్వరస్వామి వారి దేవాలయంలోని పార్వతీ దేవికి తొలుత సారె సమర్పించి, మేళతాళాలతో కాలినడకన విజయవాడ దుర్గమ్మ వారికి సారె తీసుకెళ్లారు. స్థానిక మహిళలు అమ్మాజి, అనూష, సరళ, స్రవంతి, కౌసల్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి