
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం
చీరాల అర్బన్: మహిళలందరికీ ఆగస్టు 15న మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలు చేసేందుకు సన్నద్ధం చేస్తున్నట్లు నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం చీరాల ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించారు. ఆర్టీసీ డిపో మేనేజర్ జంజనం శ్యామల, బీజేపీ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించారు. బస్సులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్‌లో పైకప్పు పెచ్చులూడిపోయి ప్రమాదభరితంగా ఉండటాన్ని గుర్తించి వాకబు చేశారు. మరమ్మతులు చేయించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. బస్టాండ్‌లో ప్రయాణికులకు తాగునీటి వసతి లేకపోవడాన్ని గుర్తించారు. మరుగుదొడ్లలో అధికంగా వసూలు చేయవద్దని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రైవేటు బస్సులకు దీటుగా ఆర్టీసీ బస్సులను తీర్చిదిద్దాలన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఉచిత ఆర్టీసీ పథకానికంటే భిన్నంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్టీసీ యూనియన్ల ప్రతినిధులు, రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు జోనల్ చైర్మన్‌ను సత్కరించారు. ఏఎంసీ చైర్మన్ కౌత్రపు జనార్దన్, బీజేపీ సీనియర్ నాయకులు మువ్వల వెంకటరమణారావు పాల్గొన్నారు.
నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి