
పిట్టా..పిట్టా మా ఊరికొచ్చావా?
● ఆవాసం మార్చిన విదేశీ పక్షులు ● వెలమవారిపాలెంలో సహకరించని ప్రకృతి ● మైలవరం గ్రామానికి రాక ● పక్షులను ఆత్మబంధువులుగా భావిస్తున్న గ్రామస్తులు ● ఖండాంతరాలు దాటి వస్తున్న పిట్టలు
పొడవు ముక్కు.. సొగసైన కాళ్లు .. తీక్షణ చూపు.. మెరిసే ఛాయ.. ప్రకృతి ఒడిలో పక్షులు.. ఊరొచ్చిన విహంగాలు
అవే గ్రామీణుల ఆత్మ బంధువులు.. విదేశాల నుంచి వచ్చిన అతిథులు
అద్దంకి: జీవ వైవిధ్యం లేకుంటే ప్రకృతి మనుగడ అసాధ్యమే.. మనుషులు.. జంతు జాలాలను ప్రేమించి సంరక్షించకుంటే పర్యావరణ పరిరక్షణ కష్టమే. ఇలాంటి ప్రకృతి సత్యాన్ని బాపట్ల జిల్లా వాసులు ఎన్నో తరాలుగా అనుసరిస్తున్నారు. నైజీరియా.. కొరియా ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతమైన చలి వాతావరణం నెలకొంటుంది. అందుకే ఆయా దేశాల్లో సంచరించే పక్షులు ప్రతి ఏటా బల్లికురవ మండలం వెలమవారిపాలేనికి తరలివస్తుంటాయి. ఇక్కడ సంతానోత్పత్తి అయిన తర్వాత తిరిగి తమ దేశాలకు ఎగిరి పోతుంటాయి. కానీ ఈ ఏడాది వెలమవారిపాలెంలో పక్షులు నివసించేందుకు గత మూడేళ్లుగా సరైన వాతావరణం లేకుండా పోయింది. ముఖ్యంగా అవి నివసించే చెట్లు నేలమట్టం కావడంతో తల్లడిల్లిపోయాయి. అందుకే ఈ పక్షులు రూటు మర్చాయి. తమకు అనువుగా ఉండే చుట్టు పక్కల ప్రాంతాలను అన్వేషించి విజయం సాధించాయి.
500 విహంగాల సందడి
బల్లికురవ మండలం వెలమావారిపాలేనికి పక్కనే.. అద్దంకి మండలం మైలవరం వాటికి అనువైన ప్రదేశంగా మారింది. మొదట్లో తక్కువ సంఖ్యలోనే ఇక్కడకు చేరుకున్న పక్షులు.. ఈ ఏడాది తమ మందీ మార్బలంతో.. అక్క చెల్లెళ్లు, బంధుమిత్రులతో కొలువుదీరాయి. ప్రస్తుతం 500కు పైగా పక్షులు గ్రామానికి చేరుకోవడంతో స్థానికులంతా వాటిని అతిథులుగా.. పక్షి రాజులుగా భావించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాటి రాక శుభ సూచికంగా భావిస్తున్నారు. సాధారణంగా ఈ పిట్టలు డిసెంబర్ నెలాఖరులో వచ్చి జూలై నెల నాటికి తాము పొదిగిన పిల్లలకు రెక్కలు రాగానే తిరిగి తమ దేశాలకు పయనమై వెళ్లేవి. అయితే ఈ సంవత్సరం మే నెలలో రావడంతో నవంబరు నెల వరకు ఇక్కడే ఉండే అవకాశం ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు.
సమృద్ధిగా నీరు–నీడ..
మైలవరం గ్రామంలో నిండు కుండలా ఉండే పెద్ద చెరువుపై ఈ పక్షులు మనసు పారేసుకున్నాయి. సమీపంలో గుండ్లకమ్మ నది, మరి కొంత దూరంలో శింగరకొండ క్షేత్రానికి సమీపంలో భవనాశి చెరువు కూడా ఉండటం విశేషం. గ్రామంలోని చెట్లపై తమ గూళ్లు నిర్మించుకొని.. ఆహారం కోసం నిత్యం సుమారు యాభై కిలో మీటర్ల మేర ప్రయాణించి సాయంత్రానికి తమ నివాసాలకు చేరుకుంటాయి. అలాగే స్థానిక చెరువులో కూడా చేపల వేట సాగిస్తుంటాయి.
ముందుకాడ కొన్నే వచ్చేయి
మూడేళ్ల మించి మా ఊరికి ఈ పిట్లలొత్తన్నాయి. అయ్యి భలే గోల చేత్తాయి. మునుపు వెలమవారిపాలెంలో కనిపించేయి. ఇప్పుడేమో మా ఊళ్లోకే వత్తన్నాయి. మా పిల్లోళ్లు.. ఆటిని చూసి కుశాల పడతున్నారు.
–సత్యనారాయణ
గవర్నమెంటోళ్లు కాపాడాల
ఈ పిట్టలు మా పిల్లోళ్లతో సమానమే. ఏడ నుంచే ఈడ కొత్తన్నాయంటే పాపం.. వాటికేం కట్టమొత్తాదో. ఆటి జోలికెవురైనా ఎలితే ఊరుకోం. ఈడ చెరువులో నీళ్లు బాగుండాయి. మేత కూడా ఉంది. గవర్నమెంటోళ్లు ఈటిని కాపాడాల.
– చావలి శ్రీనివాసరావు

పిట్టా..పిట్టా మా ఊరికొచ్చావా?

పిట్టా..పిట్టా మా ఊరికొచ్చావా?