
లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ
బాపట్ల: రైతుల నుంచి లక్ష్యం మేరకు ధాన్యం సేకరించాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశించారు. ధాన్యం సేకరణపై అనుబంధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో ధాన్యం అధికంగా సాగవుతున్న నేపథ్యంలో 30 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యం విధించిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 4,038 మంది రైతుల నుంచి 25,300 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. అకాల వర్షం హెచ్చరికల నేపథ్యంలో రైతులకు నష్టం జరగకుండా వెంటనే ధాన్యం సేకరించాలని ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని ఆరు గోదాముల్లో నింపాలన్నారు.
ప్రతిరోజూ 3వేల మెట్రిక్ టన్నుల సేకరణ
జిల్లా వ్యాప్తంగా 70 రైస్ మిల్లులు ఉన్నాయని, అయితే ప్రస్తుతం 30 మిల్లుల్లో పోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో వాటి నుంచి మాత్రమే సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమ్మవరంలో 15 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాము ఖాళీగా ఉందన్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాలనుంచి సేకరించి ధాన్యాన్ని తమ్మవరం గోదాముకు తరలించాలన్నారు. ప్రతిరోజు 3000 మెట్రిక్ టన్నులకు తగ్గకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని అధికారులు, మిల్లర్ల యజమానులను ఆయన ఆదేశించారు. పీడీఎఫ్ బియ్యం సేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని ఆయన సూచించారు. పౌర సరఫరాల సంస్థ జీఎం పి.శ్రీనివాసరావు, పౌర సరఫరాల శాఖ అధికారి విలియమ్స్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రామకృష్ణ, డీసీఓ శ్యాంసన్, రైస్ మిల్లర్ల యజమానులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి