
రైతుల చితిమంటల పొగ
చినగంజాం: రైతుల ఆశల్ని కూటమి ప్రభుత్వం నీరు గారుస్తోంది. చెమటోడ్చి సేద్యం చేసిన పంటకు గిట్టుబాటు కల్పించడంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటంతో అన్నదాతల్లో ఆందోళన తీవ్రమవుతోంది. ముఖ్యంగా పొగాకు రైతుకు ఆత్మహత్యలే శరణ్యంగా కనిపిస్తోంది. గత సీజన్‌లో గిట్టుబాటు ధర కల్పించడంలో నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చొరవ చూపడంతో రైతులు లాభాలు గడించారు. అయితే, ఈ ఏడాది సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. ఖర్చులు కూడా ఎక్కువయ్యాయి. ప్రధానంగా కౌలు ధరలు పెరగడం అశనిపాతంగా మారింది. ఎన్నో ఆశలతో సాగు చేసినా.. గిట్టుబాటు ధర వెక్కిరింతగా మిగిలింది. గతేడాది రూ. 15 వేలకు పైగా పలికిన పొగాకు ధర ఈ ఏడాది రూ. 10 వేలు మించడం లేదు. బాపట్ల జిల్లా పరిధిలో పర్చూరు, అద్దంకి డివిజన్ల పరిధిలో రైతుల అధికంగా నల్లబర్లీ సాగు చేపట్టారు. అయితే, పొగాకు కంపెనీలు కొనుగోలు చేయకుండా ముఖం చాటేస్తున్నాయి.
రైతుల ఆందోళన బాట
పొగాకు రైతులకు పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఆందోళనలు తీవ్రమయ్యాయి. పర్చూరు వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ గాదె మధూసూదనరెడ్డి ఆధ్వర్యంలో ఇంకొల్లు కేంద్రంగా రాస్తారోకో, బైక్ ర్యాలీ, నిరసనల కార్యక్రమాలను నిర్వహించారు. రైతు, కౌలు రైతు సంఘాలు సదస్సులు, సమావేశాలు, అధికారులకు వినతి పత్రాలు వంటివి చేపట్టారు. దీంతో స్పందించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు, పర్చూరు శాసన సభ్యుడు ఏలూరి సాంబశివరావులు పొగాకు కొనుగోలు కంపెనీలు, బోర్డు అధికారులు, రైతు సంఘం నాయకులు, రైతులతో సమావేశం నిర్వహించారు. పొగాకు కొనుగోలు చేయాలని కంపెనీలకు సూచించారు. ఇందులో భాగంగా మే 6న రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి (వ్యవసాయ సహకారం) బుడితి రాజశేఖర్ పర్చూరు మండలంలోని ఉప్పుటూరులో స్థానిక శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావుతో కలిసి క్షేత్రస్థాయిలో పొలాల్లో పర్యటించారు. పొగాకు రైతులతో సమావేశం అయ్యారు. ప్రభుత్వం తక్షణమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని రైతులంతా కోరారు. వెంటనే స్పందించిన రాజశేఖర్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, పొగాకు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేలా పొగాకు వ్యాపారులను ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. రైతుల్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఇది ఉత్తుత్తి హామీగానే మిగిలింది.
పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు గత ప్రభుత్వ హయాంలో అధిక లాభాలు