
మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్
పర్చూరు (చినగంజాం): మిచాంగ్ తుఫాన్ కారణంగా రైతులకు పరామర్శ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పర్యటనపై మాజీ ఎమ్మెల్యే, పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన రాజకీయ లబ్ధి కోసమే యాత్ర చేశారని ఎద్దేవా చేశారు. ఆదివారం పర్చూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. చంద్రబాబుకి వ్యవసాయంపై చిత్తశుద్ధి లేదన్నారు. ఇలాంటి విపత్తులు వస్తే తాను ఏం చేసేవాడో చెప్పకుండా అకారణంగా ప్రభుత్వంపై బురద జల్లడం మంచిది కాదన్నారు. ఒకే ప్రాంతంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే వరదలు రాకుండా ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ సామర్థ్యం 39 వేల క్యూసెక్కులు వర్షపు నీటి ప్రవాహం వచ్చిందని వివరించారు. ఇలాంటి సమయంలో ఎవరైనా ఏంచేయగలరని ప్రశ్నించారు. ఇది ప్రకృతి విపత్తు తప్ప మరేది కాదన్నారు. వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు ఏమైనా ఆకాశంలో కట్టలేశాడా అని ఎద్దేవా చేశారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే
అధిక పరిహారం చెల్లింపు..
చంద్రబాబు హయాంలో పంటల బీమా ఐదు సంవత్సరాలకు రూ.కోటి ఇస్తే జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రూ.30 కోట్లు ఇచ్చిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రైతులకు మూడు సంవత్సరాల తర్వాత నష్టపరిహారం చెల్లిస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రెండు నెలల్లోనే పరిహారం అందించేటట్లు చర్యలు తీసుకుంటుందన్నారు. శవాలపై పేలాలు ఏరుకున్నట్లు తుఫాన్ రైతులను పరామర్శించకుండా చంద్రబాబు రాజకీయ ప్రసంగాలు చేశారని ఎద్దేవా చేశారు. పర్చూరు నియోజకవర్గంలో ఉన్న 80 వేల ఎకరాల్లో 75 వేల ఎకరాలు చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారేనని అన్నారు. సదరు భూమిని చిన్న, సన్నకారు రైతులు తలా కొంచెం కౌలుకు సాగు చేసుకుంటున్నారన్నారు. వారు సాగుచేయక పోతే ఆ భూమంతా బీడుపడి పోయేదని తెలిపారు. ఇప్పుడు వచ్చిన వరదలకు సామాన్య రైతులు బలయ్యారు తప్ప భూస్వాములకు ఏమీ కాలేదన్నారు. సామాన్య రైతులపై జాలి చూపి కౌలు తగ్గించుకోండని మీరు భూస్వాములకు చెప్పగలరా అని ఆమంచి ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి మాకు నష్టం జరిగిందని చంద్రబాబుకి రైతులెవ్వరైనా ఫిర్యాదు చేశారా అని అన్నారు. గతంలో కాకుండా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేరుగా కౌలు రైతుల అకౌంట్‌లోనే డబ్బులు జమ చేస్తోందన్నారు. ప్రభుత్వం రైతులకు 80 శాతం సబ్సిడీకి విత్తనాలు సరఫరా చేయబోతున్నట్లు తెలిపారు. నాయకులు షేక్ బాబుల్లా, ముప్పాళ్ల రాఘవయ్య, నూతలపాటి బలరాం, కోట శ్రీనివాసరావు, జువ్వా శివరాంప్రసాద్, గోరంట్ల శివకుమారి, తులసి నాగమణి, బిరుదు నాగేంద్రం, నాగేశ్వరరెడ్డి, కంచెనపల్లి రమేష్, ఆకుల హేమంత్, జంగా అనీల్, గాదె సురేష్, భాగ్యరావు, పాలేరు వీరయ్య, కూరాకుల ఇస్సాకు, కట్టే ప్రభుదాసు పాల్గొన్నారు.
రైతులపై చంద్రబాబుది కపట ప్రేమ వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆమంచి ధ్వజం