
మాట్లాడుతున్న కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
గుంటూరు వెస్ట్: గ్రామ స్థాయి నుంచి మహిళలు, చిన్నారుల ఆరోగ్యంపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో అధికారుల సమావేశం శనివారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు, బాలికల్లో రక్తహీనతను గుర్తించి పౌష్టికాహారం, మందులు అందించాలని చెప్పారు. ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు ఎత్తు, బరువును గుర్తించాలని కోరారు. బడిమానేసిన 566 పిల్లలను ఇప్పటికే చేర్పించారని మిగిలిన వారినీ గుర్తించి చేర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న పోషణ ఆహారాన్ని తీసుకునేందుకు 5694 మంది అంగీకరించారన్నారు. వీరిలో 3,600 తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయని చెప్పారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ ద్వారా లక్ష్యాలు అధిగమించని అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ శ్రావణ్ బాబు, డీఈఓ శైలజ, సీపీఓ ఉషశ్రీ, ఐసీడీఎస్ పీడీ మనోరంజని పాల్గొన్నారు.
28న కలెక్టర్స్ క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదేశాల మేరకు ఈనెల 28 తేదీ నుంచి కలెక్టర్స్ క్రికెట్ ట్రోఫీ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సీఈఓ ఎస్.పల్లవి, డీఎస్‌ఏ స్టేడియం చీఫ్‌కోచ్ సి.హెచ్.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి ఏడు టీంలను ఎంపిక చేసి టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఇందులో భాగంగా నరసరావుపేట నియోజకవర్గ స్థాయి టీం ఎంపికలు ఈనెల 26వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తి గల క్రికెట్ క్రీడాకారులు ఎంపిక పోటీలో పాల్గొనాలని కోరారు.
ఇంటర్ పరీక్షల్లో
ముగ్గురు డీబార్
బాపట్ల అర్బన్: ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫిజిక్స్ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డీబార్ అయ్యారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన వీరిని అధికారులు గుర్తించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాల్లో ఇంటర్ ఫిజిక్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషన్ అధికారి కె.ఆంజనేయులు తెలిపారు. మొత్తం 10,321 మంది విద్యార్థులకుగాను 9,786 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. 535 మంది గైర్హాజరవడంతో 94.82 హాజరు నమోదైనట్లు తెలిపారు. ఆర్జేడీ, డీవీఈవో, డీఈసీ, హెచ్‌పీసీ అధికారులు ఎనిమిది సెంటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు 9 కేంద్రాలు, సిట్టింగ్ స్క్వాడ్ అధికారులు నాలుగు సెంటర్లను తనిఖీ చేశారు. తాము వేటపాలెం, చీరాలలోని నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయగా ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. చెరుకుపల్లి మండలం పొన్నపల్లిలోని గీతం జూనియర్ కాలేజీలో ముగ్గురు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతుండగా పట్టుకున్నామని, వారిని డీబార్ చేశామని వెల్లడించారు.