
రీసర్వే చేస్తున్న సర్వేయర్లు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం దశాబ్దాల నాటి భూ సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా చారిత్రాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే జిల్లాలో అత్యంత వేగంగా సాగుతోంది. జిల్లాలోని 25 మండలాల పరిధిలో 277 రెవెన్యూ గ్రామాలు ఉండగా తొలుత 13 మండలాల్లోని 88 రెవెన్యూ గ్రామాల పరిధిలో రీ సర్వే ప్రారంభమైంది. ఇప్పటికే 88 గ్రామాల్లో రీసర్వేకు సంబంధించిన డ్రోన్ సర్వే నిర్వహించారు. మొదటి ఫేజ్‌లో 24 గ్రామాలు, రెండవ ఫేజ్‌లో 23, మూడవ ఫేజ్‌లో 8 గ్రామాల చొప్పున మొత్తం 55 గ్రామాల పరిధిలో డ్రోన్ సర్వే పూర్తిచేసి ఓఆర్‌ఐ (ఆర్ధో రెక్టిఫైడ్ ఇమేజ్) మ్యాప్‌లు సిద్ధమయ్యాయి. మొత్తం 24 గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యింది. మిగిలిన 23 గ్రామాల్లో.. 12 గ్రామాల్లో రీసర్వే పూర్తికాగా, మిగిలిన 11 గ్రామాల్లో ఏప్రియల్ 15 నాటికి సర్వే పూర్తికానుంది.
సర్వే పూర్తి చేసిన 24 గ్రామాల పరిధిలో 32,239 సర్వేరాళ్లు దిగుమతి చేసుకోగా 17 గ్రామాల పరిధిలో 22,818 సర్వేరాళ్లు నాటారు. మిగిలిన 7 గ్రామాల పరిధిలో ఏప్రిల్ మొదటివారం నాటికి సర్వేరాళ్లు నాటనున్నారు. ఇవన్నీ పూర్తికాగానే మిగిలిన 12 మండలాల్లో రీసర్వే మొదలుపెట్టనున్నారు. 12 మండలాల పరిధిలో 9 లక్షల సర్వేనెంబర్లు ఉండగా, ఇప్పటికీ 1.30 లక్షల సర్వేనెంబర్లు వెరిఫై చేశారు. త్వరలో ఆ మండలాల్లో సైతం రీ సర్వే ప్రారంభం కానుంది.
23 గ్రామాల పరిధిలో 13,897 భూ హక్కు పత్రాలు సిద్ధం కాగా, ఇప్పటివరకు 13,042 (94 శాతం) భూ హక్కుపత్రాలు పంపిణీ చేశారు. పందిళ్లపల్లి గ్రామం పరిధిలో అసైన్డ్ భూమి అధికంగా ఉండటంతో సదరు సర్వేనెంబర్ల రైతులకు నోటీసులు జారీ చేశారు. ఇవి క్లియర్ కాగానే మిగిలిన వారికి భూ హక్కు పత్రాలు పూర్తిగా పంపిణీ చేయనున్నారు.
రీసర్వేతో ఉపయోగాలు!
88 గ్రామాల పరిధిలో సర్వే 55 గ్రామాల్లో ఓఆర్‌ఐ మ్యాప్‌లు
23 గ్రామాల పరిధిలో
భూ హక్కు పత్రాలు పంపిణీ
ప్రభుత్వ ఖర్చులతోనే సబ్‌డివిజన్
అసైన్డ్ భూముల అక్రమణదారులకు
నోటీసులు
మిగిలిన గ్రామాల పరిధిలోనూ
త్వరలో రీ సర్వే
రెవెన్యూ సమస్యలకు పరిష్కారం
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వేతో రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభించనుంది. జిల్లాలో 277 రెవెన్యూ గ్రామాలుండగా 88 గ్రామాల పరిధిలో సర్వే చేపట్టాం. 55 గ్రామాల పరిధిలో డ్రోన్‌సర్వే పూర్తి అయ్యింది. 23 గ్రామాల పరిధిలో భూ హక్కుపత్రాలు పంపిణీ చేశాం. మిగిలిన గ్రామాల్లోనూ సర్వే వేగంగా జరుగుతోంది. రైతుల భూములను సబ్‌డివిజన్ చేయడంతో ఇతర సమస్యలకు పరిష్కారం లభించింది. ఆక్రమణదారుల చేతుల్లో ఉన్న అసైన్డ్‌భూములకు రీసర్వేతో విముక్తి లభించనుంది. ప్రభుత్వ ఖర్చులతోనే సబ్ డివిజన్లు చేస్తున్నాం.
– కె. శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్
ఇప్పటివరకు 23 గ్రామాల పరిధిలో సాగులో ఉన్న 1324 సర్వేనెంబర్లకు సంబందించి పలు రెవెన్యూ సమస్యలను క్లియర్ చేశారు. 293 సరిహద్దు వివాదాలను పరిష్కరించారు. పొలం సబ్ డివిజన్ చేసుకోవాలంటే ఒక్కో రైతు రూ. 550 చలానా చెల్లించాల్సి ఉంది. రీసర్వేలో భాగంగా ఇప్పటి వరకు 9831 మందికి సంబంధించి ఒక్క రూపాయి కూడా కట్టించుకోకుండా ప్రభుత్వమే సబ్‌డివిజన్ చేసింది. దీంతో రైతులకు 54,07,050 ఆదా అయ్యింది. 139 సర్వేనెంబర్ల పరిధిలో మ్యూటేషన్ చేయటం వలన రైతులకు రూ. 2,19,450 ఆదా అయ్యింది. ప్రస్తుతం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కనీసం ఆరు నెలలు సమయం పట్టేది. కానీ 45 రోజుల వ్యవధిలోనే సబ్‌డివిజన్, ఇతర రెవెన్యూ సమస్యలను పరిష్కరించారు. ఇప్పటి వరకు 600 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. రీసర్వేతో పలు రకాల రెవెన్యూ సమస్య లకు పరిష్కారం లభించడంతోపాటు ఆక్రమణలో ఉన్న అసైన్డ్ భూములకు విముక్తి లభించనుంది.
