
మాట్లాడుతున్న మోపిదేవి
రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు
రేపల్లె రూరల్: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అండ తో గెలుపొందిన పలువురు శాసన సభ్యులు ప్రలోభాలకుగురై అమ్ముడుపోవడంతోనే శాసనసభ కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఒక స్థానాన్ని దక్కించుకుందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. పేటేరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ విజయంతోనే బైక్ ర్యాలీలు నిర్వహించి టపాసులు పేల్చడం టీడీపీ అల్పానందానికి నిదర్శనమన్నారు. కుట్రలు, కుతంత్రాలతో రాజకీయం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యేనన్నారు. ఎవరూ ఎన్నికుట్రలు పన్నినా ప్రజలు జగనన్న ప్రభుత్వం వైపే ఉన్నారని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
రూ.32 కోట్లతో అభివృద్ధి, సంక్షేమం..
గతంలో ఎన్నడూ లేనివిధంగా మేజర్ పంచాయతీ పేటేరులో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులకు రూ.32.28 కోట్ల ఖర్చు చేశామని మోపిదేవి తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ గ్రామ ఇన్‌చార్జి కనపర్తి రవికిరణ్, మాజీ ఎంపీటీసీ రావు ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.