వేమూరు: పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు బాపట్ల జిల్లా వైద్యశాలల కో–ఆర్డినేటర్, వైద్యాధికారి శేషుకుమార్ పేర్కొన్నారు. వేమూరు మండల కేంద్రంలోని 30 పడకల వైద్యశాలను ఆయన శనివారం తనిఖీ చేశారు. వైద్యుల పనితీరును అడిగితెలుసుకున్నారు. రోగుల బెడ్‌లు, ఆపరేషన్ థియేటర్, రికార్డులను పరిశీలించారు. నూతనంగా నిర్మాణం జరుగుతున్న 30 పడకల వైద్యశాల భవనాన్ని పరిశీలించి మాట్లాడారు. కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యుల కొరత లేదన్నారు. వైద్యశాలల్లో అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. బాపట్ల జిల్లాలో 10 ప్రభుత్వం ప్రాథమిక వైద్యశాలలు, రెండు ఏరియా వైద్యశాలలు, 8 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయన్నారు. ఈ వైద్యశాలల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం జరుగుతోందని తెలిపారు. వైద్య సేవల పట్ల డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ మధుప్రభాకర్, వైద్యులు సీహెచ్ సింహాచలం, డి.అశోక్, డి.ఇందిరా ప్రియదర్శిని, షేక్ ఫాతిమ, మురళీకృష్ణ, రాధిక, సునీత పాల్గొన్నారు.
జిల్లా వైద్యశాలల కో–ఆర్డినేటర్ డాక్టర్ శేషుకుమార్