
రంగస్థల కళాకారుడిని సన్మానిస్తున్న జానపద కళాపీఠం సభ్యులు
అద్దంకి రూరల్: జానపద కళాపీఠం 22వ వార్షికోత్సవాలు శనివారం రాత్రి స్థానిక బంగ్లా రోడ్‌లోని కె.విశ్వనాఽథ్ స్మారక కళావేదికపై ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా శనివారం ఉదయం జ్యోతి చంద్రమౌళి ఆధ్వర్యంలో రామసుశీల నిలయంలో బౌద్ధం– జానపదంపై నాగార్జున యూనివర్సిటీ ప్రిన్సిపాల్ చల్లపల్లి స్వరుపారాణితో ఉపన్యాస వేదిక నిర్వహించారు. సాయంత్రం డప్పుకళాకారుల వాయిద్యం, కోలాట బృందాలతో కోలాట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జానపద, రంగస్థల సాహిత్య కళాకారులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జానపద కళాపీఠం అధ్యక్షుడు ఉబ్బా దేవపాలన మాట్లాడుతూ మరుగున పడిపోతున్న జానపద కళలను, కళాకారులను గుర్తించి వారికి పురస్కారాలను అందిస్తున్నట్లు చెప్పారు. మనిషి జీవితం జానపదంతో ముడిపడి ఉందన్నారు. నేటి అస్కార్ అవార్డు జానపద పాట నాటునాటుకు దక్కడంతో ప్రపంచ దేశాల్లో తెలుగు జానపదానికి మంచి గుర్తింపు వచ్చిందన్నారు. కళాపీఠం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఎందరో గొప్పగొప్ప జానపద కళాకారులు మన దేశంలో ఉన్నారన్నారు. అనంతరం జ్యోతి శ్రీరాములు స్మారక సాహిత్య పురస్కారాన్ని కోండ్రు నాగమల్లేశ్వరికి, వీరవల్లి రంగయ్య, యశోదమ్మ స్మారక కళాపురస్కారాన్ని తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, గుర్రం జాషువా స్మారక కళాపురస్కారాన్ని జనాబ్ షేక్ కరిముల్లాకు, గోరంట్ల వీరయ్య రుక్మిణమ్మ స్మారకకళా పురస్కారం అవార్డును నిమ్మగడ్డ మీరయ్యకు, మారెడ్డి వెంకటరెడ్డి స్మారక కళాపురస్కారాన్ని చెన్ను నాగేశ్వరరావుకు అందజేశారు. అనంతరం అభినవ ఎన్టీఆర్ నిమ్మగడ్డ మీరయ్యతో చెంచులక్ష్మి వీధి భాగవతం ప్రదర్శించారు. కార్యక్రమంలో వీరవల్లి సుబ్బారావు (రుద్రయ్య), డి.శ్రావణ్‌కుమార్, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, పి.జయభాస్కర్, చెన్నుపల్లి వెంకటేశ్వర్లు, గాడేపల్లి దివాకరదత్తు, రాచపూడి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలు
జానపద, రంగస్థల, సాహిత్య కళాకారులకు సన్మానం