
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, వేదికపై జేసీ డాక్టర్ శ్రీనివాసులు
బాపట్ల: ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణ పనులు సత్వరమే పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.విజయకృష్ణన్ ఆదేశించారు. స్థానిక స్పందన సమావేశ మందిరంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం ఆమె సమీక్షించారు. ఉపాధి హామీ పథకం నిధుల అనుసంధానంతో చేపడుతున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణంలో పురోగతి కనిపించాలని కలెక్టర్ చెప్పారు. బాపట్ల జిల్లాకు 401 గ్రామ సచివాలయాల భవనాలు మంజూరు కాగా ఇప్పటికీ 13 భవనాల నిర్మాణం మొదలు కాలేదని పేర్కొన్నారు. మరో 15 పునాది స్థాయికి దిగువన ఉండగా, మిగిలిన 12 భవనాల నిర్మాణాలకు ఏజెన్సీలకు కేటాయించే ప్రక్రియలో ఉండడంతో అధికారులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. 315 రైతు భరోసా కేంద్రాలు మంజూరు కాగా 56 భవనాల నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉండడంపై ఆరా తీశారు. 343 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలు మంజూరు కాగా 75 పెండింగ్‌లో ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం ద్వారా అభివృద్ధి పనులు జరగడంతో పాటు నిరుపేదలకు ఉపాధి కల్పించే అంశాలను అధికారులు విస్మరించడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు.
గడప గడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన పనులు 497 మంజూరు కాగా, 49 పనులు నేటికీ ప్రారంభించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అద్దంకి, బాపట్ల రూరల్, పర్చూరు మండలాలలో పనుల పురోగతి కనిపించకపోవడంతో అధికారులను నిలదీశారు. ప్రజల అవసరాలను గుర్తించలేక పోతే అధికారులు ఎలా పనిచేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందన అర్జీలు పరిష్కారించాలి
పునరావృతమవుతున్న స్పందన అర్జీలను అధికారులు గడువులోగా పరిష్కరించకపోతే ప్రభుత్వం విధులను ఎలా నిర్వహిస్తారని కలెక్టర్ విజయకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలోనే 34 అర్జీలు పునరావృతమయ్యాయని చెప్పారు. ఇటీవల 1,474 అర్జీలు అధికారులు పరిష్కరించినప్పటికీ, 46 అర్జీలను క్రమ పద్ధతిలో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించలేదని చెప్పారు. 399 అర్జీలు స్పందన పోర్టల్, జగనన్నకు చెబుతాం వెబ్ సైట్లో వచ్చాయన్నారు. వీటిని సక్రమంగా పరిష్కరించలేక పోతే మీకిచ్చే వేతనాలు వ్యర్థమవుతున్నాయని పేర్కొన్నారు.
గృహాల నిర్మించుకోని జాబితా ఇవ్వండి..
జగనన్న కాలనీలలోని లబ్ధిదారులు తమ గృహాలను ఎందుకు నిర్మించుకోవడం లేదో అధికారులు సర్వే నిర్వహించి స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకొని చిత్తశుద్ధితో సర్వే నిర్వహించాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేమూరు నియోజకవర్గంలోని అధికారుల పనితీరు సరిగా లేదని మందలించారు. అధికారులు నిబద్ధతతో పనిచేస్తే గృహ నిర్మాణాలలో పురోగతి కనిపిస్తుందన్నారు.
రాజకీయ ఒత్తిడిలను పక్కనపెట్టి లబ్ధిదారులకు అన్ని విధాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూర్చడమే అధికారుల లక్ష్యమని చెప్పారు. ప్రధానంగా జగనన్న కాలనీలలో తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందకపోతే అధికారులే బాధ్యులవుతారని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 174 వలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తక్షణమే వాటిని భర్తీ చేసి ఆ ప్రాంతాలలో ప్రభుత్వ సేవలు అందేలా చూడాలని కోరారు. ముఖ్యంగా గర్భిణులకు పోషకాహారం అందిస్తూ.. వారిలో రక్తహీనత, పోషణ లోపం నివారించే ప్రక్రియను సమర్థంగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్