న్యూస్‌రీల్‌

- - Sakshi

1,09,245 బస్తాల

మిర్చి విక్రయం

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్‌ యార్డుకు గురువారం 1,06,781 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్‌ విధానం ద్వారా 1,09,245 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్‌ ఏసీ కామన్‌ రకం 334, నెంబర్‌–5, 273, 341, 4884, సూపర్‌–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.25,500 వరకు పలికింది. నాన్‌ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్‌ రకాల మిర్చి సగటు ధర రూ.10,000 నుంచి రూ.27,000 వరకు పలికింది. తాలు రకం మిర్చికి రూ.6,000 నుంచి రూ.13,000 వరకు ధర లభించింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 85,497 బస్తాలు మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

శతాధిక వృద్ధురాలు మృతి

అద్దంకి రూరల్‌: అద్దంకిలోని దామావారిపాలెం బ్రహ్మంగారి దేవస్థానం వద్ద నివాసం ఉంటున్న శతాధిక వృద్ధురాలు అద్దంకి అంజమ్మ (109) గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మనమళ్లు, మనమరాళ్లు, మునిమనవళ్లు, మునిమనవరాళ్లు కలిపి మొత్తం 40 మంది వరకు సంతానం ఉన్నారు. ఆమె భర్త నారాయణ 30 సంవత్సరాల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు అన్ని నెరవేర్చింది. ఎప్పుడూ ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని, రెండురోజుల క్రితం వరకు తన పనులు తానే చేసుకునేదని కుటుంబ సభ్యులు తెలిపారు.

భూమిని స్వాధీనం చేస్తూ కోర్టు తీర్పు

ఫిరంగిపురం: 72 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత ప్రభుత్వ భూమిని పంచాయతీకి స్వాధీనం చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి ఏకే బాబు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వేములూరిపాడు గ్రామానికి చెందిన చెరువు కింద ఉన్న భూమి తమదేనంటు గ్రామానికి చెందిన వ్యక్తులు కోర్టులో 1951లో కేసు వేశారు. దీనిపై 2011న దావా వేశారు. వేములూరిపాడు(హ్యామలేట్‌) అమీనాబాద్‌ పంచాయతీ పరిధిలోని చెరువుభూమి సర్వేనెం 473లో 10.56సెంట్లు, 474లో 36.65సెంట్లు మొత్తం 47.21సెంట్లు భూమికి సంబంధించి వాదిగా ఎన్‌.వెంకటపార్థసారధికాగా, ప్రతివాదులుగా జిల్లా కలెక్టర్‌తోపాటు గ్రామానికి చెందినవారు ఉన్నారు. ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ షేక్‌ బాలిషైద్‌ తన వాదనలు వినిపించడంతో భూమిని పంచాయతీకి స్వాధీనం చేస్తూ సత్తెనపల్లి సీనియర్‌ సివిల్‌ జడ్జి తీర్పు ఇచ్చారు. దీంతో ప్రభుత్వ భూమి 47.21 సెంట్ల చెరువు భూమి ద్వారా రెండు గ్రామాలకు నీరు అందుతాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నిమ్మకాయల ధరలు

తెనాలిటౌన్‌: తెనాలి మార్కెట్‌యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,000, గరిష్ట ధర రూ.9,200, మోడల్‌ ధర రూ.8,000 వరకు పలికింది.

వీఆర్‌ఓకు మూడేళ్ల జైలు

నరసరావుపేట టౌన్‌: చీటింగ్‌ కేసులో వీఆర్‌ఓకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ 13వ అదనపు జిల్లా జడ్జి ఒ.వెంకట నాగేశ్వరరావు గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ వీఆర్‌ఓ విధులు నిర్వహిస్తున్న కావూరు ముత్తయ్య తనకు రెండెకరాల ప్రభుత్వ భూమి ఇప్పిస్తానని నమ్మబలికి రూ.2 లక్షలు తీసుకొని మోసం చేసినట్లు గుంటూరుకు చెందిన చంద్రమ్మ 2014 సంవత్సరంలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన యడ్లపాడు పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. నేరం రుజువు కావటంతో 5 నవంబర్‌ 2015న చిలకలూరిపేట కోర్టు నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. తీర్పుపై నిందితుడు జిల్లా కోర్టుకు అప్పీల్‌ చేసుకోవటంతో దిగువ కోర్టు విధించిన తీర్పును యథావిధిగా ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు.

Read latest Bapatla News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top