
రోడ్డు ప్రమాద దృశ్యం (ఫైల్)
భయం భయంతో రక్షించా...
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని రక్షించాను. అయితే పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్, కోర్టు చుట్టూ తిప్పుతారేమోనని భయం వేసింది. అయినా ప్రాణాపాయంలో వున్న వ్యక్తిని కాపాడాలన్న ఉద్దేశంతో భయం పక్కన పెట్టి ఆ వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించా. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకోవడం సంతోషంగా ఉంది. రక్షించిన వారిని ఇబ్బందులకు గురిచేయకూడదనే చట్టం ఉన్నట్లు అప్పుడు తెలియదు. ఈ చట్టంపై అధికారులు అవగాహన కల్పించాలి.
– మువ్వల ప్రసన్నకుమార్
కాపాడిన వారిని
ఇబ్బంది పెట్టం
ఎక్కడైనా, ఎప్పుడైనా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించడం ద్వారా బాధితుడు కోలుకుంటాడు. కాపాడితే పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయోనని భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. క్షతగాత్రుడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వివరాలు, చిరునామా చెప్పి వెళ్లిపోవచ్చు. గుడ్ సమారిటన్ చట్టంపై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి, పోలీస్ సిబ్బంది, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
– శేషగిరిరావు, తాడేపల్లి సీఐ
అశోక్ తన స్నేహితుడితో కలిసి మంగళగిరి నుంచి గుంటూరుకు బైక్‌పై వెళుతున్నాడు.. నంబూరు దగ్గర్లో రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు రక్తపు మడుగుల్లో పడి ఉండడం గమనించాడు.. వెంటనే తన బైక్ ఒక పక్కన ఆపుకొని, వారి దగ్గరకు వెళ్లాడు.. తీవ్ర గాయాలపాలైన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేద్దామని ఫోన్ తీయగా, అరే మనకెందుకురా లేనిపోని రిస్క్.. తర్వాత పోలీసు కేసులు, కోర్టులు చుట్టూ తిరగడం మనకు అవసరమా.. అంటూ స్నేహితుడు నివారింపజూశాడు.. అయినా మనసొప్పని అశోక్ 108కి ఫోన్ చేసి, వారితోపాటు వెళ్లి క్షతగాత్రులను ఆస్పత్రిలో జాయిన్ చేసి వచ్చాడు. మారిన నిబంధనల దృష్ట్యా గతంలో వలే కేసులు, కోర్టుల చుట్టూ తిరిగేది లేదని తెలుసుకుని హమ్మయ్యా.. అనుకుని బాధితులను కాపాడాననే తృప్తితో ఇంటిబాట పట్టాడు.
– తాడేపల్లి రూరల్
రోడ్డు ప్రమాదాల్లో క్షతగ్రాతులకు సాయం అందించేందుకు ఇప్పటివరకు ప్రభుత్వ నిబంధనలు గుదిబండగా ఉండేవి. ఈ తలనొప్పి మాకెందుకులే అంటూ బాధితులను ఆదుకునేందుకు ప్రజలు వెనకడుగు వేసేవారు. ఇకపై ప్రమాద బాధితులకు సాయం చేసేవారిని ఎలాంటి వేధింపులకు గురిచేసేందుకు వీల్లేదు. వివరాలు సైతం గోప్యంగా ఉంచుతారని అధికారులు చెబుతున్నారు. రోజూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరగడం సర్వసాధారణమైంది. ఎంతోమంది తీవ్ర గాయాల పాలై అత్యవసర సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదం జరిగిన గంటలోపు క్షతగాత్రులకు వైద్యసేవలు అందిస్తే వారిని బతికించేందుకు వీలుంటుంది. బాధితుల అత్యవసర పరిస్థితి చూసి ఎవరైనా ఆసుపత్రిలో చేర్పిస్తే నిబంధనల మేరకు పోలీసులు వివరాలు సేకరించేందుకు గంటల తరబడి నిలిపివేసేవారు. ఇది చాలదన్నట్లు కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిప్పేవారు. దీంతో ఈ తలనొప్పి మాకెందుకులే అని ప్రజలు వెనకడుగు వేసేవారు. అయితే గుడ్ సమారిటన్ పేరిట తెచ్చిన చట్టం ప్రకారం ఇటువంటి చిక్కులు లేకుండా స్వేచ్ఛగా సాయం చేయొచ్చు. అంతేకాకుండా గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులను తీసుకొస్తే వారికి రూ.5వేలు పారితోషికం అందించాలని చట్టం చెబుతోంది.
గెజిట్ నోటిఫికేషన్ ద్వారా...
రోడ్డు ప్రమాదంలో బాధితులకు తక్షణ సాయం అందించి, సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలతో సుప్రీంకోర్టు 2016 జనవరి 21వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన సేవ్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రమాద బాధితులకు సాయం అందించేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనికి ‘గుడ్ సమారిటన్’ అని నామకరణం చేసి ప్రభుత్వం చట్టం చేసింది. దీని ప్రకారం ప్రమాద బాధితులను ఆస్పత్రిలో చేర్పించిన వారి వివరాలను తప్పనిసరిగా తెలపాల్సిన అవసరం లేదు. వారు స్వచ్ఛందంగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతామంటేనే పోలీసులు వారి వివరాలను నమోదు చేసుకోవాలి. లేనిపక్షంలో క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి రక్షకులు వెళ్లిపోవచ్చు.
అందరూ ‘గుడ్ సమారిటన్’లు అవ్వొచ్చు రోడ్డు ప్రమాద క్షతగ్రాతులకు సాయంచేస్తే వేధింపులు ఉండవు సుప్రీంకోర్టు సరికొత్త మార్గదర్శకాలు గోల్డెన్ అవర్‌లో రక్షిస్తే అవార్డులు, రివార్డులు
గుడ్ సమారిటన్ చట్టం ఏం చెబుతోంది..
పోలీసులు గుడ్ సమారిటన్ (సాయం చేసేవారు)లను విచారణ కోసం పిలవకూడదు.
ఆస్పత్రులు ప్రమాద బాధితులకు చికిత్స చేయడానికి నిరాకరించకూడదు. ప్రథమ చికిత్స కోసం రుసుము వసూలు చేయకూడదు.
గుడ్ సమారిటన్‌లకు సివిల్, క్రిమినల్ కేసుల నుంచి రక్షణ ఉండాలి.
గుడ్ సమారిటన్‌లు తమ గుర్తింపును
వెల్లండించాల్సిన అవసరం లేదు
సాయం చేసేవారు ప్రత్యక్ష సాక్షిగా
ఉండడాన్ని ఎంచుకోవచ్చు.
అది బలవంతమై ఉండకూడదు.

