
అశ్వవాహనంపై హరిహరులు
వల్లూరు : పుష్పగిరిలోని శ్రీ కామాక్షీవైద్యనాఽథేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి, శ్రీ కామాక్షీ వైద్యనాథస్వాములు అశ్వ వాహనాలపై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. మొదట పుష్పగిరి గ్రామంలోని శ్రీ కామాక్షీ వైద్యనాథస్వామి అశ్వ వాహనంపై కొలువు దీరగా.. మంగళ వాయిద్యాలు, దివిటీల వెలుగులతో మాడ వీధుల్లో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి అశ్వ వాహనంపై కొలువు దీరి విహరించారు. కొండపై నుంచి స్వామి వారిని పెన్నానది మీదుగా పల్లకీలో మోస్తూ గ్రామంలోని మాడ వీధులలో ఘనంగా ఊరేగించారు. ఉదయం శ్రీ వైద్యనాథస్వామి ఆలయంలో స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీ చక్ర సహిత కామాక్షీ అమ్మవారికి కుంకు మార్చనలు చేశారు. శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో యాగశాల పూజలు, వివిధ హోమాలు నిర్వహించారు. బలి హరణ కార్యక్రమం చేపట్టారు. స్వామి వారికి, లక్ష్మీదేవికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నేడు చక్రస్నానం
పుష్పగిరి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఉదయం వైద్యనాథస్వామి త్రిశూలం, చెన్నకేశవస్వామి సుదర్శన చక్రస్నానం జరుగుతుంది. అనంతరం రెండు ఆలయాల్లో పూర్ణాహుతి, ధ్వజ అవరోహణం కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం 4.30 గంటల నుంచి శ్రీ లక్ష్మీచెన్నకేశవ ఆలయంలో పుష్పయాగం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు శ్రీ కామాక్షీ వైద్యనాథస్వామి ఆలయంలో రావణేశ్వర వాహన సేవ ఉంటుంది. అనంతరం శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామికి తిరుచ్చి వాహన సేవ జరుగుతుంది.
వైభవంగా గ్రామోత్సవాలు
కనుల పండువగా బ్రహ్మోత్సవాలు

అశ్వవాహనంపై హరిహరులు