
దేవినేని అవినాష్
విజయవాడ: బుడమేరు వరదకు ఏడాది పూర్తైన నేపథ్యంలో బాధితులకు మద్దతుగా, ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ నిరసన చేపట్టింది. సింగ్‌నగర్‌లో ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు ,ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ,డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి ,వైఎస్ఆర్సిపి నేతలు, శ్రేణులు పాల్గొన్నాయి.
దీనిలో భాగంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ గత ఏడాది ఇదే ప్రాంతం వరదతో మునిగిపోయింది. ఆపరేషన్ బుడమేరు తక్షణమే చేపట్టాలి. వరద బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. కానీ పరిహారం సక్రమంగా అందలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కృష్ణానదికి వరద వచ్చి కృష్ణలంక ముంపునకు గురైంది. రిటైనింగ్ వాల్ కటి కృష్ణలంక ప్రజల కష్టాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీర్చారు. దేవుడి పాదాల సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమాకు అభివృద్ధి పట్టదు. ప్రజల కష్టాలు తెలియని అసమర్ధ ఎమ్మెల్యే బోండా ఉమా. బోండా ఉమాకు తెలిసింది ప్రజల పై రౌడీయిజం చేయడమే.
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ‘వరద వస్తుందని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బుడమేరు ప్రజలను ముంచేసింది. వరదలు వచ్చి ఏడాదైనా ప్రజల్లో భయం పోలేదు. వానపడితేనే ఈ ప్రాంత ప్రజలు భయపడిపోతున్నారు. ఏడాదైనా నేటికీ బుడమేరు వరద బాధితులకు పరిహారం అందలేదు. నష్టపరిహారం పేరుతో దొంగ సర్వేలు చేశారు. అబద్ధపు సాకులతో ఎంతోమందికి అన్యాయం చేశారు. సాయం కోరుతూ వెళ్లిన బాధితులను కలెక్టరేట్‌లోకి రానివ్వలేదు. సిగ్గులేకుండా కలెక్టరేట్ గేట్లకు తాళాలేశారు. దేశ చరిత్రలో వరద విరాళాల్లో అవినీతి చేసిన ఏకైక పార్టీ టీడీపీనే. బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం’ అని హెచ్చరించారు.
విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ.. ‘ విజయవాడ నగరం కనీవినీ ఎరుగని రీతిలో బుడమేరు ప్రజలను ముంచేసింది. ప్రజలు నిలువెల్లా వణికిపోయారు. ప్రపంచ రాజధాని అమరావతి కడుతున్నామని కబుర్లు చెబుతున్నారు. టెక్నాలజీ అంతా మాకే తెలుసంటారు. కానీ వరద వస్తున్న విషయాన్ని గుర్తించి ప్రజలను కాపాడలేకపోయారు. జగన్ రిటైనింగ్ వాల్ కట్టి కృష్ణలంక ప్రజలను ముంపు నుంచి తప్పించారు. చంద్రబాబు బుడమేరు ప్రక్షాళన చేస్తామని గొప్పలు చెప్పారు. కానీ నేటికీ ఆదిశగా అడుగులు వేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మరోమారు బుడమేరు ముంపుకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. బుడమేరు ఆక్రమణలు తొలగించే వరకూ మా పోరాటం ఆగదు’ అని స్పష్టం చేశారు.