తల్లి కళ్ల ముందే ఇద్దరు బిడ్డలు జలసమాధి | Two people drowned: Andhra pradesh | Sakshi
Sakshi News home page

తల్లి కళ్ల ముందే ఇద్దరు బిడ్డలు జలసమాధి

May 5 2026 5:45 AM | Updated on May 5 2026 5:45 AM

Two people drowned: Andhra pradesh

అన్నదమ్ముల మృతితో సీతారామపురంలో తీవ్ర విషాదం  

సీతారామపురం: ఆ ఇల్లు నిన్నటి దాకా ఇద్దరు అన్నదమ్ముల అల్లరితో సందడిగా ఉండేది. అమ్మ పిలుపులు.. అన్నదమ్ముల నవ్వుల కేరింతలతో కళకళలాడింది. కానీ ఇప్పుడు గుండెలు పగిలే రోదనలు మిగిలాయి. విధి ఆటలో మృత్యువు ఆ పసి మొగ్గలను చెరువు రూపంలో కన్నతల్లి కళ్ల ముందే కబళించింది. వివరాల్లోకి వెళ్తే... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం బెస్త కాలనీకి చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ కిష్టా సుబ్బారావు, స్వర్ణలత దంపతుల కుమారులైన కిష్ణా రేవంత్‌ (14), కిష్ణా ఆది (13) నెల్లూరులో ఉంటూ 9వ, 8వ తరగతి  చదువుకుంటున్నారు.

వేసవి సెలవులకు తల్లితో కలిసి స్వగ్రామానికి వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంటికి సమీపంలో ఉన్న ఊర చెరువులో దుస్తులు ఉతుక్కునేందుకు తల్లి స్వర్ణలత, పిన్ని సుమలతతో కలిసి వెళ్లారు. ఒక వైపు తల్లి, పిన్ని దుస్తులు ఉతుక్కుంటుండగా మరో వైపు రేవంత్, ఆది సరదాగా ఈత కొట్టేందుకు చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తు ఇద్దరూ నీట మునిగి గిలగిలా కొట్టుకోవడాన్ని గమనించిన పిన్ని సుమలత కాపాడేందుకు ప్రయత్నించి ఆమె కూడా మునిగిపోయింది. ఇదంతా చూస్తున్న తల్లి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి సుమలతను ఒడ్డుకు చేర్చారు.

అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో 108లో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చెరువులో నీటి లోతు ఎక్కువగా ఉండడంతో కొన్ని గంటల వరకు ఆ అన్నదమ్ముల జాడ తెలియలేదు. బెస్త కాలనీకి చెందిన యువకులు చెరువులోకి దిగి రేవంత్, ఆదిలను బయటకు తీయగా అప్పటికే వారు చనిపోయారు. మృత్యువులోనూ అన్నదమ్ముల బంధం విడిపోలేదు. ఒకరినొకరు గట్టిగా పట్టుకున్న స్థితిలోనే వారి నిర్జీవ దేహాలు బయటపడ్డాయి. కళ్లముందే ఇద్దరు కొడుకులను కోల్పోయిన తల్లి రోదనలు మిన్నంటాయి. అన్నదమ్ములు ఇద్దరూ ఒకేసారి మృత్యువాత పడడంతో బెస్త కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement