గిరిజనులకు ఆర్థిక వికాసం

Tribal farmers as small traders in Andhra Pradesh - Sakshi

చిరువ్యాపారులుగా గిరిజన రైతులు

గిట్టుబాటు ధర సాధనకు స్వీయ ప్రయత్నాలు 

వీడీవీకేల ద్వారా ప్రభుత్వ ఆర్థిక సహకారం 

263 వీడీవీకేల్లో 78,900 మంది సభ్యులకు లబ్ధి 

దళారులు, ప్రైవేట్‌ వ్యాపారుల ప్రమేయానికి అడ్డుకట్ట 

సాక్షి, విశాఖపట్నం: గిరిజనుల ఆర్థిక వికాసానికి ప్రభుత్వం చేయూత ఇస్తోంది. వారు దళారుల చేతుల్లో మోసపోకుండా.. కష్టానికి తగిన ఫలితం లభించేలా చూస్తోంది. అటవీ ప్రాంతంలో చెట్ల నుంచి గిరిజనులు సేకరించి తెచ్చిన చింతపండుకు దళారులు, వ్యాపారులు నిర్ణయించిన ధర కిలోకు రూ.35 మించలేదు. దాన్ని పిక్కతీసి, కాస్త శుభ్రం (ప్రాసెసింగ్‌) చేసి దుకాణాల్లో వ్యాపారులు విక్రయించే కిలో ప్యాకెట్‌ ధర రూ.150 వరకు ఉంటోంది. ఇక సూపర్‌ మార్కెట్లలో, మాల్స్‌లో రూ.200 ఉంటోంది. ఈ వ్యత్యాసం తగ్గించడానికి, గిరిజనులే స్వయంగా గిట్టుబాటు ధర సాధించుకునేలా చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రాల (వీడీవీకేల) ద్వారా ఆర్థిక సహకారం అందిస్తోంది. రాష్ట్రంలోని 8 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో సుమారు 3.63 లక్షల గిరిజన కుటుంబాలున్నాయి. వీరు అటవీ ప్రాంతంలో తేనె, సీకాయ, కుంకుడుకాయలు, చింతపండు, ఉసిరికాయలు, కరక్కాయలు, కొండచీపుళ్లు తదితర అటవీ ఉత్పత్తులను సేకరించి స్థానిక సంతల్లో విక్రయిస్తుంటారు.

ప్రైవేట్‌ వ్యాపారులు, దళారుల ప్రమేయం వల్ల ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించటంలేదు. గిరిజన రైతులు పండిస్తున్న పసుపు, రాజ్‌మా, బొబ్బర్లు, సజ్జలు, రాగులు, కంది, మిరప, జీడిపిక్కలు తదితర వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రభుత్వం మద్దతు ధర కల్పించినవి మినహా మిగతా పంటల పరిస్థితి అలాగే ఉంది. ఈ నేపథ్యంలో వీడీవీకేల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గత ఏడాది రాష్ట్రంలో 75 వీడీవీకేలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి పరిధిలోని 8 ఐటీడీఏలు, గిరిజన సహకారసంస్థ (జీసీసీ), ట్రైఫెడ్‌ నోడల్‌ ఏజెన్సీలుగా వ్యవహరిస్తున్నాయి. వీటిద్వారా ప్రభుత్వం వీడీవీకేలకు రూ.10.64 కోట్లు మంజూరు చేసింది. ప్రాసెసింగ్‌కు ఉపయోగపడే పరికరాలు, ఇతరత్రా సరంజామా కొనుగోలుకు ఈ నిధులను గిరిజనులు ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం మరో 188 వీడీవీకేలను మంజూరు చేసింది. వాటికి అడ్వాన్స్‌గా రూ.14 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం వీడీవీకేల సంఖ్య 263కు చేరింది. వీటన్నింటికీ మొత్తం రూ.38.83 కోట్ల వరకు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటివరకు రూ.24.64 కోట్లు నిధులు విడుదల చేసింది. 

ఉత్పత్తులకు అదనపు విలువ 
దాదాపుగా ఒకటి లేదా పక్కపక్కనుండే రెండు, మూడు గ్రామాల గిరిజనులే సభ్యులుగా వీడీవీకేలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 20 మంది సభ్యులతో ఒక గ్రూపు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి 15 గ్రూపులను ఒక వీడీవీకే పరిధిలోకి చేరుస్తున్నారు. ఇలా ఒక్కో వీడీవీకేలో మొత్తం 300 మంది చొప్పున 263 వీడీవీకేల్లో 78,900 మంది సభ్యులు కానున్నారు. వీడీవీకేకి రూ.15 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో ప్రాసెసింగ్, ప్యాకింగ్‌కు ఉపయోగపడే పరికరాలను ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. గిరిజనులు తాము సేకరించిన అటవీ ఉత్పత్తులను, పండించిన పంటలను గ్రామాల్లోనే సొంతంగా వ్యాపార తరహాలో శుద్ధి (ప్రాసెసింగ్‌) చేస్తున్నారు. తద్వారా ఆయా ఉత్పత్తులకు అదనపు విలువ (వాల్యూ ఎడిషన్‌) సమకూరుతోంది. ఆ ఉత్పత్తులను జీసీసీకి విక్రయిస్తున్నారు. జీసీసీకే కాకుండా లాభం ఉంటే ఇతర వ్యాపారులకు అమ్ముకునే వెసులుబాటు కూడా ఉంది. 

సొంత వ్యాపారంతో మంచి ధర.. 
ఇప్పటివరకు వీడీవీకేల ద్వారా గిరిజనులు రూ.21.19 లక్షల విలువైన ఉత్పత్తులను విక్రయించారు. ఇది ప్రారంభం మాత్రమే. అన్ని అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాసెసింగ్‌ ప్రక్రియ ద్వారా విలువను జోడించేలా ప్రణాళికను రూపొందించాం. దీనివల్ల ఆయా ఉత్పత్తులకు మంచి ధర వస్తుంది. ట్రైఫెడ్, జీసీసీ మార్కెట్‌ సపోర్టు కల్పిస్తున్నాయి. ఈ విధానం వల్ల మరికొంతమంది గిరిజనులకు ఉపాధి కలుగుతుంది.  
– సురేంద్రకుమార్, జనరల్‌ మేనేజరు (మార్కెటింగ్‌), జీసీసీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top