మార్గదర్శి కేసు ముగించాలంటే.. ఆస్తులు అటాచ్‌ చేసి బాధితులకు పంచుతాం | Supreme Court Of India strong comments On Margadarsi Case | Sakshi
Sakshi News home page

మార్గదర్శి కేసు ముగించాలంటే.. ఆస్తులు అటాచ్‌ చేసి బాధితులకు పంచుతాం

May 5 2026 4:44 AM | Updated on May 5 2026 4:46 AM

Supreme Court Of India strong comments On Margadarsi Case

సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు

రామోజీ మృతితో మార్గదర్శిపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ముగియవు  

ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు.. ప్రజాధనానికి సంబంధించి చట్టాల ఉల్లంఘన 

ఆర్బీఐ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, మార్గదర్శికి నోటీసులు జారీ.. కేసు మూసివేయాలన్న మార్గదర్శి న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనకు ‘సుప్రీం’ బ్రేక్‌ 

దర్యాప్తు దశలో కేసును హైకోర్టు కొట్టివేయడంపై సుప్రీంకోర్టులో ఉండవల్లి పిటిషన్‌

ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన.. కొనసాగుతున్న ఆర్థిక సంస్థపై నమోదైన క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ముగిసిపోవు. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు.. ప్రజా ధనానికి సంబంధించి చట్టాల ఉల్లంఘన. కేసును ఇక్కడితో ముగించాలంటే.. మార్గదర్శి ఆస్తులను అటాచ్‌ చేసి ఆ మొత్తాన్ని బాధితులకు పంచుతాం..! 
– సుప్రీంకోర్టు  

సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి రూ.వేల కోట్ల డిపాజిట్లు సేకరించిన వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు సుప్రీంకోర్టులో తాజాగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన నిందితుడు రామోజీరావు మరణించినందున ఈ కేసును కొట్టివేయాలన్న మార్గదర్శి తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. రామోజీరావు మరణించినా.. సంస్థ కార్యకలాపాలు ఇంకా కొనసాగిస్తున్నందున క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ ఆగిపోవని తేల్చి చెప్పింది. ‘ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యవహారం కాదు.. ప్రజాధనానికి సంబంధించిన చట్టాల ఉల్లంఘన. కేసును ఇక్కడితో ముగించాలంటే.. మార్గదర్శి ఆస్తులను అటాచ్‌ చేసి, ఆ మొత్తాన్ని బాధితులకు పంచుతాం..’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. 

మార్గదర్శిపై నమోదైన క్రిమినల్‌ కేసును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్‌ ఎన్‌.కె.సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ఉండవల్లి దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఆర్బీఐ, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఈనాడు ఎండీ చెరుకూరి కిరణ్, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు నోటీసులు జారీ చేసింది. బాధితులందరికీ చెల్లింపులపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని మార్గదర్శిని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 15కి వాయిదా వేసింది.  

నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు..  
ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘించి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ఏకంగా రూ.2,600 కోట్ల మేర డిపాజిట్లు సేకరించడంపై గతంలో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వ్యవహారంలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. రామోజీరావు చనిపోయిన నేపథ్యంలో కేసు మెయింటెనబుల్‌ కాదన్న మార్గదర్శి వాదనలతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించటాన్ని సవాల్‌ చేస్తూ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. సుప్రీంకోర్టులో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పరమేశ్వర్, న్యాయవాదు­లు అల్లంకి రమేష్‌, మమత వాదనలు వినిపించారు. 

వ్యక్తి మరణిస్తే.. సంస్థపై కేసు ఆగిపోదు  
విచారణ ప్రారంభం కాగానే మార్గదర్శి తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ప్రధాన నిందితుడు మరణించిన నేపథ్యంలో ఈ కేసును ఇకపై కొనసాగించాల్సిన అవసరం లేదని ధర్మాసనాన్ని కోరారు. దీన్ని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.పరమేశ్వర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక వ్యక్తి మరణించినంత మాత్రాన కేసు ముగియదని, జరిమానా చెల్లించే బాధ్యత హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌)పై ఉంటుందని నివేదించారు. దర్యాప్తు పెండింగ్‌లో ఉండగానే.. రామోజీ మరణించారన్న కారణంతో ఆయనతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై గతంలో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసిందన్నారు. భారీ ఆర్థిక అవకతవకలను, ప్రజా ప్రయోజనాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా రూ.వేల కోట్లు వసూలు చేసిన విషయం స్పష్టంగా రుజువవుతున్నా హైకోర్టు సాంకేతిక కారణాలతో కేసును కొట్టేసిందన్నారు. అటు ఐటీ శాఖ, ఇటు ఆర్‌బీఐ వద్ద మార్గదర్శి అక్రమాల వివరాలు ఉన్నాయని నివేదించారు. మార్గదర్శిపై క్రిమినల్‌ చర్యలను పునరుద్ధరించాలని ధర్మాసనాన్ని కోరారు. 

ఎఫ్‌ఐఆర్‌ అనేది ’ఎన్‌సైక్లోపీడియా’ కాదు  
దర్యాప్తు ఇంకా పూర్తికాని దశలో హైకోర్టు కేసును కొట్టివేయడం చట్టవిరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఎఫ్‌ఐఆర్‌ అనేది నేరాలకు సంబంధించిన ‘పూర్తి ఎన్‌సైక్లోపీడియా’ కాదని ఉదహరించారు. డిపాజిట్ల సేకరణపై దశాబ్దాలుగా నియంత్రణ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. మార్గదర్శి రూ.వేల కోట్లు వసూలు చేస్తూ కార్యకలాపాలు సాగించిందని తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, రెగ్యులేటరీ సంస్థ ఆర్బీఐ వాదనలను సైతం హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని నివేదించారు. ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించిన కేసులో దర్యాప్తును పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. 

మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందన్న రంగాచారి... 
ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అక్రమాలను, అవకతవకలను నిగ్గు తేల్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్‌) ఎన్‌.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్‌ 19న జీవో 800 జారీ చేసింది. అలాగే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్‌ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమిస్తూ అదే రోజున జీవో 800 జారీ చేసింది. రామోజీరావుకు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. రంగాచారి విచారణను పూర్తి చేసి 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌)కు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ప్రజల వద్ద నుంచి రూ.వేల కోట్ల మేర డిపాజిట్లు సేకరించడం నిజమేనని తేల్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాక మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన నివేదికలో పేర్కొన్నారు. 

అధీకృత అధికారి ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టు 
అధీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్‌యూఎఫ్‌ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్‌ చేయాలని కోరుతూ 2008 జనవరి 23న హైదరాబాద్‌ నాంపల్లి మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్‌ 540) చేశారు. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45(ఎస్‌)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 58 కింద శిక్షార్హమని తెలిపారు. దీంతో రామోజీరావు ఈ ఫిర్యాదు విషయంలో మళ్లీ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. హైకోర్టు 2018 డిసెంబర్‌ 31న రామోజీరావుపై అ«దీకృత అధికారి చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. 

అందరి వాదనలు వినాలన్న సుప్రీంకోర్టు 
తెలంగాణ హైకోర్టు తీర్పుపై ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పాటు అప్పటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు..  హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ చేసిన అభ్యర్థనను సైతం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. కేసు లోతుల్లోకి వెళ్లి, అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు విచారణ మొదలుపెట్టిన తెలంగాణ హైకోర్టు గత ఏడాది ఆగస్టు 4న తీర్పు వెలువరించింది. రామోజీరావు మరణించిన నేపథ్యంలో ఆయనతో పాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై కేసును కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ గత ఏడాది సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తాజాగా సోమవారం జస్టిస్‌ సుందరేష్‌ ధర్మాసనం విచారణ జరిపింది.  

రూ.వేల కోట్లు కొల్లగొట్టిన రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌
రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం ప్రకారం.. హెచ్‌యూఎఫ్‌ లాంటి అన్‌ ఇన్‌ కార్పొరేటెడ్‌ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్‌ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యాలయాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయినప్పటికీ రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ఆర్‌బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. 

ఇలా చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్‌ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ 2006 నవంబర్‌ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించిన వివరాలను ఆర్‌బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్‌బీఐ స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని కూడా చెప్పడంతో డిపాజిటర్ల ప్రయోజనాల కోసం మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులపై అప్పటి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.  

Advertisement
 
Advertisement
Advertisement