
నంద్యాల (అర్బన్): హత్యాచారానికి గురైన తన కుమార్తె సుగాలి ప్రీతి అంశాన్ని జనసేనాని పవన్‌కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రచారానికి వాడుకుని ఇప్పుడు గాలికి వదిలేశారని ఆమె తల్లి పార్వతి విమర్శించారు. నంద్యాలలో సోమవారం గిరిజన సంఘాలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఈ కేసును గాలికి వదిలేశారన్నారు. న్యాయం చేయాలంటూ అమరావతికి వెళితే జన సైనికులు, వీర మహిళలతో అవమానాలకు గురి చేస్తున్నారని.. ఎమ్మెల్యేలు, మంత్రులు వెటకారం మాటలతో ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లోకేశ్ రెడ్‌బుక్‌లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఎందుకు చేర్చలేదో సమాధానం చెప్పాలన్నారు. గవర్నర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తానన్నారు. ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్య శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడం పవన్‌కళ్యాణ్‌కు అటవాటుగా మారిందని, ప్రీతి తల్లి పార్వతి వీల్‌చైర్ యాత్రకు అన్ని గిరిజన ప్రజా సంఘాలు, సమాఖ్యల సంపూర్ణ మద్దతు కూడగడతామన్నారు. కార్యక్రమంలో జీపీఎస్ అధ్యక్షుడు రాజునాయక్, ఉపాధ్యక్షుడు రాంబాలాజీనాయక్, మాలమహానాడు అధ్యక్షుడు సాంబశివుడు, బిలావత్ శంకర్‌నాయక్, విక్రం సింహనాయక్ పాల్గొన్నారు.