
పోలీసు ఆంక్షలతో పలాసలో ‘యూటీఎఫ్ రణభేరి’ ఉద్రిక్తం
సమస్యలు పరిష్కరించని కూటమి సర్కారుపై గురువుల ఆగ్రహం
పలాస: ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్ చేపట్టిన రణభేరి ప్రచార జాత పోలీసుల ఆంక్షలతో ఉద్రిక్తంగా మారింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సోమవారం ర్యాలీ ప్రారంభమైంది. అప్పటికే కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు తన సిబ్బందితో అక్కడకు చేరుకొని ర్యాలీకి, నిరసన తెలపడానికి అనుమతి లేదని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. ఉపాధ్యాయులు ఆందోళన కొనసాగించడంతో పోలీసులు అరెస్టులకు తెగబడ్డారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిశోర్‌కుమార్, కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా అధ్యక్షులు బాబూరావు, బి.శ్రీరామమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజాన దమయంతి, జిల్లా అద్యక్షులు గిరిధర్, జిల్లా నాయకులు రవికుమార్, కోదండరావు, బల్ల చిట్టిబాబు, కంచరాన రమేష్, ఎల్‌వీ.చలం, గున్న రమేష్ తదితర ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు మొత్తం 38 మందిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
మిగతా ఉపాధ్యాయులు కాశీబుగ్గ జెడ్పీ ఉన్నత పాఠశాల వద్దకు చేరుకొని అక్కడ నిరసన తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో చేపట్టిన రణభేరి జాతాను పోలీసులు అడ్డుకుని విఘాతం కలిగించడం సరికాదన్నారు. సోమవారం ప్రారంభమైన ఈ రణభేరి ప్రచార జాత కొనసాగుతోందని, సెపె్టంబరు 25న గుంటూరులో ముగుస్తుందని స్పష్టం చేశారు.