వి'హంగామా'.. ఎక్కడమ్మా!

Siberian Cranes No Longer Visit In Srikakulam - Sakshi

సంక్రాంతి రాకుండానే వెనుదిరిగిన సైబీరియా పక్షులు 

బోసిపోతున్న తేలుకుంచి గ్రామం

పర్యాటకులను అమితంగా ఆకర్షించే విదేశీ విహంగాలు నెలరోజుల ముందే సొంతగూటికి పయనమయ్యాయి. పిల్లలతో కలిసి వేలాది కిలోమీటర్లు పయనమై వెళ్లిపోతున్నాయి. ఈ హఠాత్పరిణామం తేలుకుంచి వాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. తమకు తెలిసినంత వరకు ఇలా ఏ ఏడాదీ జరగలేదని, నెల రోజుల ముందుగానే సైబీరియా పక్షులు ఎందుకు వెళ్లిపోతున్నాయో అంతుపట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు. 

సాక్షి, ఇచ్ఛాపురం రూరల్‌: ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్‌ తర్వాత స్వదేశాలకు వెళ్లే సైబీరియా పక్షులు ఈ ఏడాది నెల రోజుల ముందే పుట్టింటికి పయనమైపోయాయి. జిల్లాలో తేలినీలాపురం తర్వాత సైబీరియన్‌ పక్షులు విడిది చేసేది ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామంలోనే. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తొలకరి జల్లులు కురిసే సమయంలో ఇక్కడికి వచ్చిన విదేశీ విహంగాలు సంక్రాంతి రాకముందే ఒక్కసారిగా వెళ్లిపోయాయి. కార్తీకమాసం తర్వాత సంతానోత్పత్తితో రెట్టింపు సంఖ్యలో స్వస్థలాలకు వెళ్లే ఈ పక్షులకు ఏమైందో ఏమోగాని అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఈ విధంగా పక్షులు దూరం కావడంతో గ్రామస్తులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు.  

విభిన్న పక్షులు.. 
ఏటా తొలకరి జల్లులు కురిసే జూన్‌లో సైబీరియా నుంచి వచ్చిన ఈ పక్షుల అసలు పేరు ఓపెన్‌ బిల్‌ స్టార్క్స్‌ (నత్తగొట్టు కొంగలు, చిల్లు ముక్కు కొంగలు). శాస్తీయ నామం ‘అనస్థోమస్‌’. ఈ పక్షులు తూర్పు–దక్షిణాసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక నుంచి మొదలుకొని తూర్పు ప్రాంతంలో విస్తారంగా సంచరిస్తుంటాయి. జీవిత కాలం సుమారు 30 ఏళ్లు. బాగా ఎదిగిన పక్షి 81 సెంటీమీటర్ల పొడవు, 11 కిలోల బరువు ఉంటుంది. రెక్కలు విప్పారినప్పుడు 149 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. దవడల మధ్య (ముక్కు మధ్యలో) ఖాళీ ఉండటం వల్ల వీటిని ఓపెన్‌ బిల్‌ స్టార్క్స్‌ అని పిలుస్తుంటారు. వందల కొద్దీ ఇక్కడికి వచ్చిన పక్షులు గ్రామంలోనే ఊర చెరువు, గ్రామదేవత ఆలయం వద్ద ఉన్న కంచి చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుని గుడ్లు పొదుగుతాయి. పగలంతా తంపర భూములు, వరి చేలల్లో తిరుగుతూ చేపలు, నత్తలు, కప్పలు, పురుగులు, ఆల్చిప్పలను ఆహారంగా తీసుకుంటాయి. ఆరు నెలలు పాటు పిల్లలతో గడిపి అవి ఎగిరేంత బలం రాగానే జనవరి నెల మధ్య నుంచి తమ ప్రాంతాలకు పయనమవుతుంటాయి.

ఈసారి ఏమైందో.. 
ఈ ఏడాది ఒక్కసారిగా పక్షులు మాయమైపోయాయి. తిరుగు ప్రయాణానికి ఇంకా సమయం ఉండగానే ఒక్కసారిగా గ్రామాన్ని వదిలిపోవడం స్థానికులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. వీటి రాకతో తొలకరి పనులు ప్రారంభించడం ఈ ప్రాంత రైతులకు అలవాటు. అలాంటిది పక్షులు హఠాత్తుగా మాయం కావడం శుభకరం కాదంటున్నారు. ఈ పక్షులు పురుడు పోసుకునేందుకు తమ ఇంటికి వచ్చిన ఆడపడుచుల్లా ఈ గ్రామస్తులు భావిస్తుంటారు. 

నివాసానికి అనువుగా లేనందునే.. 
పక్షులు వెళ్లిపోవడానికి ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవకపోవడం ఒక కారణమైతే, పక్షులు గుడ్లు పెట్టేందుకు సరైన చెట్లు లేకపోవడం మరోకారణమని స్థానికులు భావిస్తున్నారు. గతంలో వరుసగా వచ్చిన తుఫాన్ల ధాటికి చెట్లు నేలకొరగడంతో కొత్త మొక్కలు నాటేందుకు స్థలం లేకపోవడంతో అటవీశాఖాధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. వర్షాలు పుష్కలంగా కురిస్తే వాగులు, వంకలు నిండి పక్షులకు ఆహారంగా వరిచేలల్లో నత్తలు, పురుగులు, చేపలు, కప్పలు తింటూ జీవిస్తుంటాయి. అయితే ఈ ఏడాది అవి ఉండేందుకు అనువైన వాతావరణం లేని కారణంగా వేగంగా స్వదేశాలకు పయనమైపోయాయని స్థానికులు చెబుతున్నారు.    

అపురూపంగా చూసుకున్నాం 
ఈ పక్షుల్ని మా ఊర్లో ఎవరినీ కొట్టనివ్వరు. అపురూపంగా చూసుకుంటాం. ఈ ఏడాది పక్షులకు వాతావరణం అంతగా అనుకూలంగా లేకుండాపోయింది. మోస్తరు వర్షాలు కురవకపోవడంతో అంతంత మాత్రంగా పంటలు పండటం, పక్షులకు ఆహారమైన పురుగులు, కీటకాలు లేకపోవడంతోనే పక్షులు నెల రోజులు ముందుగా వెళ్లిపోయాయి.  
– దక్కత నూకయ్యరెడ్డి, గ్రామపెద్ద, తేలుకుంచి

మొక్కలు నాటించలేదు.. 
అటవీశాఖ అధికారులు ఏడాదికోమారు గ్రామంలో సమావేశం పెట్టి చేతులు దులుపుకుంటున్నారే తప్పా పక్షులను పర్యవేక్షించే చర్యలు చేపట్టడం లేదు. స్థానిక ఎమ్మేల్యే బెందాళం అశోక్‌ మా గ్రామాన్ని దత్తత తీసుకున్నా పక్షులు నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మొక్కలు నాటించలేకపోయారు.  
– పాల ధర్మరాజురెడ్డి, యువజన సభ్యుడు, తేలుకుంచి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top