నలుగురి దుర్మరణం
శ్రీకాళహస్తి రూరల్: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోల్‌కతాకు చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆస్తమా చికిత్స చేయించుకునేందుకు కోల్‌కతా నుంచి బెంగళూరుకు అంబులెన్స్‌లో బయలుదేరిన వారు తిరుపతి–పూతలపట్టు రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు శ్రీకాళహస్తి పోలీసులు వెల్లడించారు. కోల్‌కతాకు చెందిన బ్రజ డోలాయ్ (48) ఆస్తమాతో బాధపడుతున్నాడు.
వైద్యుల సూచన మేరకు బెంగళూరులో చికిత్స కోసం ఈనెల 2న బ్రజ డోలాయ్‌తోపాటు భార్య టగారి డోలాయ్ (35), అంబులెన్స్ డ్రైవర్ రితేష్ (24), అతని సోదరుడు జతిన్ డోలాయ్ (63), మరో మహిళ ధగోడిస్ (45), మరో డ్రైవర్ రాకేష్ పండిట్ (29) బయలుదేరారు. సోమవారం శ్రీకాళహస్తికి చేరుకున్న వీరి అంబులెన్స్ డ్రైవర్ నిద్రమత్తులో వేగంగా లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బ్రజ డోలాయ్, భార్య టగారి డోలాయ్, జతిన్ డోలాయ్, రితేష్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ధగోడిస్ (45), అంబులెన్స్ డ్రైవర్ రాకేష్ పండిట్ (29) శ్రీకాళహస్తి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కోల్‌కతాలోని బంధువులకు సమాచారం అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


