బాబ్బాబు.. మాకు రివర్షన్‌ ఇవ్వండి | Representation Submitted by Promoted Panchayat Secretaries | Sakshi
Sakshi News home page

బాబ్బాబు.. మాకు రివర్షన్‌ ఇవ్వండి

May 8 2026 6:00 AM | Updated on May 8 2026 6:00 AM

Representation Submitted by Promoted Panchayat Secretaries

అనంతపురం జిల్లాలో పంచాయతీ కార్యదర్శులకు జారీ చేసిన రివర్షన్‌ ఆర్డర్‌ కాపీ

 పదోన్నతులు పొందిన పంచాయతీ కార్యదర్శుల వినతి

అనంతపురం జిల్లాలో ఇప్పటికే  16 మంది రివర్షన్‌ 

పలు జిల్లాల్లో పరిశీలనలో ఉన్న మరిన్ని అర్జీలు

చంద్రబాబు సర్కార్‌ తీవ్ర వేధింపుల నేపథ్యం 

పని ఒత్తిడితో సతమతమవుతున్న ఉద్యోగులు

సాక్షి, అమరావతి: ఏ ఉద్యోగి అయినా పదోన్నతి ఎప్పుడు వస్తుందా..? అని ఎదురు చూస్తుంటాడు. అయితే రాష్ట్రంలో పదోన్నతి పొందిన పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి మరోలా ఉంది. ‘ఈ ప్రమోషన్‌ మాకొద్దు బాబోయ్‌... రివర్షన్‌ ఇచ్చేయండి’ అని వారు ప్రభుత్వానికి వినతులు సమర్పించే పరిస్థితి చంద్రబాబు సర్కార్‌లో దాపురించింది. సర్వేలుసహా పలు రకాల విధులను ప్రభుత్వం ఉద్యోగులకు అప్పగిస్తోంది. ఈ అసమంజసమైన విధులను తాము నిర్వర్తించలేకపోతున్నామని పదోన్నతి పొందిన పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. 

అనంతపురం జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో డిజిటల్‌ అసిస్టెంట్లు (గ్రేడ్‌ –6)గా పని చేస్తూ చిన్న గ్రామ పంచాయతీల్లో  గ్రేడ్‌ –5 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి పొందిన 16 మంది.. ఆ పదోన్నతి వద్దంటూ ఉన్నతాధికారులకు అర్జీలు పెట్టుకున్నారు.   ఆయా ఉద్యోగులే స్వచ్ఛందంగా పదోన్నతులు వదులుకునేందుకు ముందుకు రావడంతో ఇచ్చిన పదోన్నతులను రద్దు చేసి, వారిని పాత క్యాడర్‌లోనే నియమిస్తూ జిల్లా అధికారులు గత నెల 30న ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇలాంటి  ఇంకా పరిశీలనలో ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

పదోన్నతులే వద్దనుకునే పనులు..
ఎప్పటికప్పుడు రకరకాల సర్వేలకు తోడు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ అభిప్రాయ సేకరణ పేరిట సంబంధం లేని అంశాల్లోనూ పంచాయతీ కార్యదర్శులను బాధ్యులను చేస్తున్నారు.  

పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి రోజు ఆరు గంటలకల్లా ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో విధులకు హాజరు కావడంతో పాటు అందుకు సంబంధించిన ఫోటోను ప్రత్యేక యాప్‌ నమోదు చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారు.  దీంతో పంచాయతీ కార్యదర్శులు రోజు తెల్లవారుతూనే  విధుల్లో పాల్గొనాల్సిన పరిస్థితి వస్తోంది.  చలి, వర్షం, చీకటితో సంబంధం లేకుండా ఉదయం ఆరు గంటలకల్లా విధుల్లో పాల్గొనేందుకు వెళుతూ పలుచోట్ల ఉద్యోగులు ప్రమాదాల బారిన పడాల్సి వస్తోంది.  

సర్వేలు , ఇతరేతర పనుల పేరిట పంచాయతీ కార్యదర్శులు ప్రతి రోజూ 12 గంటలు పనిచేయాల్సి వచ్చినా.. అవసరమైనప్పుడు సెలవులు కూడా 
తీసుకునే పరిస్థితి ఉండడం లేదు.   
ఇటీవల గ్రామాల్లో ఇంటి పన్నులు వసూళ్ల ప్రక్రియలో రోజుకు రూ. 20 కోట్లు పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ టార్గెట్లనూ జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులకే అప్పగిస్తున్నారు.  టార్గెట్లను చేరకుంటే షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో పలుచోట్ల కొన్ని రోజులు పంచాయతీ కార్యదర్శులు  సొంత డబ్బునూ వెచ్చించినట్లు ఉద్యోగ సంఘల నేతలు పేర్కొంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement