గిరిపుత్రి.. అనంత దీప్తి 

Prohibition Excise Joint commissioner Nagalaxmi Special Story In Anantapur - Sakshi

దేశ వ్యాప్తంగా వివిధ హోదాల్లో స్థిరపడి పలువురికి ఆదర్శంగా నిలిచిన గిరిజన ముద్దుబిడ్డలను ఇటీవల మహిళా శిరోమణి అవార్డుతో ఇంటర్నేషనల్‌ హెల్త్‌ కేర్‌ ఆర్గనైజేషన్‌ సన్మానించింది. వీరిలో నాగలక్ష్మి ఒకరు. ఆమెతో పాటు జిల్లాకు చెందిన పలువురు గిరిజన ముద్దుబిడ్డ లను అఖిల భారత బంజారా సేవాసంఘ్‌ ఆదివారం సన్మానించనుంది. జిల్లా  గర్వించదగిన మహిళల్లో ఒకరైన సన్మాన గ్రహీత నాగలక్ష్మి ఆదర్శ జీవిత విశేషాలు ఆమె మాటల్లోనే..

సాక్షి, అనంతపురం‌: మాది పెనుకొండ మండలం అడదాకులపల్లి తండా. నాన్న రామానాయక్, తల్లి సక్కుబాయి. మేము ముగ్గురం సంతానం. అందరం ఆడపిల్లలమే. ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో వ్యవసాయ కూలీలుగా అమ్మ, నాన్న కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు. కూలి పనులు లేనప్పుడు కొండలపైకి వెళ్లి చీపురు పుల్లలు తీసుకొచ్చి వాటిని కట్టకట్టి అమ్ముకుని జీవించేవాళ్లం. వారిలా మేము కష్టపడకూడదని అమ్మ, నాన్న భావించి.. మమ్మల్ని బాగా చదివించాలని అనుకున్నారు.

ఏఐఐసీ చైర్‌పర్సన్‌ రోజా చేతుల మీదుగా సన్మానం అందుకుంటున్న నాగలక్ష్మి (ఫైల్‌)
అక్కడే ఉంటే ఆ పరిస్థితులు మమ్మల్ని కూలీలుగా ఎక్కడ మారుస్తాయోనని భయపడి అమ్మ మమ్మల్ని పిలుచుకుని ఒంటరిగా అనంతపురానికి చేరుకుంది. ఇక్కడ నాలుగిళ్లలో పాచిపనులు చేస్తూ జీవనం మొదలు పెట్టాం. ఆ తర్వాత ఇంటిలో గ్రైండర్‌ ఏర్పాటు చేసుకుని, అమ్మ స్వశక్తితో మమ్మల్ని చదివించసాగింది. మా ఉన్నతి కోసం అమ్మ పడిన కష్టం నేనెన్నటికీ మరువలేను.

కూలి పనులు చేశా.. 
మా అక్కచెల్లెళ్లలో నేనే పెద్దదాన్ని. మా అమ్మ కష్టమేమిటో చాలా దగ్గరగా చూసిన దాన్ని కూడా నేనే. ఇంటికి ఆసరాగా ఉంటుందని అమ్మతో పాటు కూలీ పనులకు నేను కూడా వెళ్లేదాన్ని. అయితే చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఏ మాత్రం తీరిక దొరికినా పుస్తకాలు ముందేసుకుని కూర్చొనేదాన్ని.

అనంతపురానికి వచ్చేసిన తర్వాత ఇక్కడి తొలుత అశోక్‌నగర్‌లోని నీలి షికారీ పాఠశాలలో, తర్వాత గిల్డ్‌ ఆఫ్‌ సర్వీసు పాఠశాలల్లో 7వ తరగతి వరకు చదువుకున్నా. ఇల్లు జరగడం కష్టంగా ఉండడం గమనించి, మదనపల్లిలోని సీఎస్‌ఐ మిషనరీ వారు అక్కడి హాస్టల్‌లో సీటు ఇచ్చారు. అక్కడే ఉంటూ పదో తరగతి పూర్తి చేశాను. తిరిగి ఇంటర్, డిగ్రీ ఇక్కడే అనంతపురంలోనే పూర్తి చేశాను. ఎంఏ., ఎంఫిల్‌ను సెంట్రల్‌ యూనివర్సిటీలో పూర్తి చేశా.

జీవిత గమ్యాన్ని మార్చిన చదువు 
చిన్నప్పటి నుంచి తండాలో పెరగడం వల్ల చాలా కష్టాలు, ఇబ్బందులు చూశా. నిరక్షరాస్యత, తాగుడు వల్ల ఎంతో మంది జీవితాలు నా కళ్ల ముందే నాశనమైపోతుంటే ఏడుపొచ్చేది. చిరుప్రాయంలోనే భర్తలను కోల్పోయి వితంతువులుగా మారిన తోటి ఈడువారిని చూసినప్పుడల్లా కన్నీళ్లు ఆగేవి కావు. ఈ సమస్యలకు పరిష్కారం చదువు ఒక్కటేనని భావించా. అలా నాన్న ప్రోత్సాహం, అమ్మ కష్టంతో ఉన్నత చదువులు అభ్యసించగలిగాను. ఆడపిల్ల అబల కాదు సబల అని నిరూపించే విషయంలో నా వరకు నా జీవితమే పెద్ద పాఠమైంది. అనుకోని విధంగా మా నాన్న చనిపోయిన తర్వాత నా చెల్లెళ్లు జీవితంలో స్థిరపడేలా చేయగలిగాను.

ఉద్యోగానికీ పోరాటమే..
ఉన్నత చదువులు ముగిసిన తర్వాత రెండేళ్ల పాటు మహిళా యూనివర్సిటీలో లెక్చరర్‌గా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశాను. అక్కడే ఉంటే నేను నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువ కాలేనని అనుకున్నా. దీంతో గ్రూప్స్‌కు సిద్ధమయ్యా. తొలిసారే 2001 ఆఖరులో జిల్లా ఉపాధి కల్పనాధికారిగా అవకాశం వచ్చింది. అయితే ఓ ఓసీ అమ్మాయి అందజేసిన తప్పుడు సరి్టఫికెట్‌ కారణంగా ఆ ఉద్యోగం కాస్తా నాకు దక్కకుండా పోయింది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. రెండేళ్ల పాటు విచారణ అనంతరం 2004లో నాకు అనుకూలంగా కోర్టు తీర్పునివ్వడంతో హైదరాబాద్‌లో ఉపాధి కల్పనాధికారిగా బాధ్యతలు తీసుకున్నా. అక్కడ ఓ రెన్నెల్ల పాటు పనిచేశా.

ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ జాయింట్‌ కమిషనర్‌ నాగలక్ష్మి 
నేను చేస్తున్న పని నాకు   తృప్తినివ్వలేదు. ఆ సమయంలోనే గ్రూప్స్‌ పోటీ పరీక్షల్లో విజయం సాధించి, శ్రీకాకుళంలో ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌గా విధుల్లో చేరా. 2009లో ఇదే శాఖలో విజయనగరం సూపరింటెండెంట్‌గా పనిచేశాను. 2012 నుంచి శ్రీకాకుళం, కడప జిల్లాల్లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశాను. ఈ ఏడాది జాయింట్‌ కమిషనర్‌గా పదోన్నతి పొందాను. నేను చెప్పేది ఒక్కటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని శ్రమిస్తే దాన్ని సులువుగా సాధించవచ్చు. ఇందుకు నేనే నిదర్శనం.

నేడు సత్కారం
దేశవ్యాప్తంగా  వివిధ హోదాలలో స్థిరపడిన గిరిజన ముద్దు బిడ్డలను ‘ఆల్‌ ఇండియా బంజరా సేవా సంఘ్‌’ అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించనున్నారు. స్థానిక రెండో రోడ్డులోని బంజారా భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు బాలానాయక్, రంగ్లానాయక్, అశ్వత్థనాయక్, శేఖర్‌ నాయక్‌ తెలిపారు. ఈ సత్కారాన్ని అందుకునేందుకు విజయవాడ నుంచి నాగలక్ష్మితో పాటు వేర్వేరు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో స్థిరపడిన గిరిజన ఉద్యోగులు 35 మంది రానున్నారు.

నా జీవితమే ఓ పాఠం 
చిన్నప్పటి నుంచి తండాలో పెరగడం వల్ల చాలా కష్టాలు, ఇబ్బందులు చూశా. నిరక్షరాస్యత, తాగుడు వల్ల ఎంతో మంది జీవితాలు నా కళ్ల ముందే నాశనమైపోతుంటే ఏడుపొచ్చేది. చిరుప్రాయంలోనే భర్తను కోల్పోయి వితంతువులుగా మారిన తోటి ఈడువారిని చూసినప్పుడల్లా కన్నీళ్లు ఆగేవి కావు. ఈ సమస్యలకు పరిష్కారం చదువు ఒక్కటేనని భావించా. అలా నాన్న ప్రోత్సాహం, అమ్మ కష్టంతో ఉన్నత చదువులు అభ్యసించగలిగాను. ఆడపిల్ల అబల కాదు సబల అని నిరూపించే విషయంలో నా వరకు నా జీవితమే పెద్ద పాఠమైంది. – నాగలక్ష్మి.టి.రమావత్, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ జాయింట్‌ కమిషనర్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top