ప్రకృతి సేద్యంలో ‘ఆచార్య’ | NG Ranga Varsity Prepared for Nature farming Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ప్రకృతి సేద్యంలో ‘ఆచార్య’

Published Sun, May 8 2022 5:30 AM | Last Updated on Sun, May 8 2022 8:20 AM

NG Ranga Varsity Prepared for Nature farming Andhra Pradesh - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయం(ఏపీసీఎన్‌ఎఫ్‌)లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న రైతు సాధికార సంస్థ(ఆర్‌.వై.ఎస్‌.ఎస్‌.) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది నుంచి ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించనుంది. ఈ ఖరీఫ్‌ నుంచి రాష్ట్రంలోని ఆరు వ్యవసాయ పర్యావరణ జోన్లలోని వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో ఆర్‌.వై.ఎస్‌.ఎస్‌. సూచించిన రీతిలో ప్రకృతి వ్యవసాయం చేపట్టనున్నారు.

‘అనంత’లో పర్యటన 
ఎంపిక చేసిన ప్రకృతి వ్యవసాయదారుల క్షేత్రాల్లో సాగు తీరుతెన్నులను నిరంతరం పరిశీలిస్తూ ఖర్చు, ఆదాయం, ఇతరత్రా ప్రయోజనాలపై ఆర్‌.వై.ఎస్‌.ఎస్‌.తో కలిసి కచ్చితమైన గణాంకాలను నమోదు చేసేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సన్నద్ధమవుతోంది. ఈ సన్నాహాల్లో భాగంగా వర్సిటీ పరిశోధనా సంచాలకులు డా. ప్రశాంతి, 6 జోన్లలోని వ్యవసాయ పరిశోధనా స్థానాలకు చెందిన పది మంది శాస్త్రవేత్తలు, పలువురు రైతులు శుక్ర, శనివారాల్లో అనంతపురం జిల్లాలో పర్యటించి వర్షాధార భూముల్లో అనుసరిస్తున్న వినూత్న ప్రకృతి సేద్య పద్ధతులను పరిశీలించారు. సాధారణంగా 20 ఎం.ఎం. వర్షం కురిసిన తర్వాతే విత్తనం విత్తుకోవటం పరిపాటి.

అయితే పంట వ్యర్థాలను ఆచ్ఛాదనగా వేసి వర్షాలకు ముందే విత్తనం వేయటం (ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోయింగ్‌–పీఎండీఎస్‌), 365 రోజులూ పొలంలో బహుళ పంటలు సాగు చేయటం అనే వినూత్న పద్ధతులను అనంతపురం జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం గత మూడేళ్లుగా పలువురు రైతులతో అనుసరింపజేస్తోంది. అనంతపురం డీపీఎం లక్ష్మణ్‌నాయక్‌ ఈ పద్ధతులను వర్సిటీ బృందానికి వివరించారు. ఇప్పటికే ఈ పద్ధతులను అనుసరిస్తున్న రైతుల వర్షాధార వ్యవసాయ క్షేత్రాలకు తీసుకువెళ్లి చూపించారు. మండుటెండల్లోనూ రక్షక తడుల సహాయంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఏడాది పొడవునా బహుళ పంటలు పండిస్తుండటాన్ని వర్సిటీ బృందం పరిశీలించింది. 
 విత్తనాలు వేసిన తర్వాత శనగ పొట్టును ఆచ్ఛాదనగా పోస్తున్న దృశ్యం 

ఎకరానికి రూ.50 వేల ఆదాయం
రైతు దంపతులు స్వయంగా పనులు చేస్తారు కాబట్టి వారి కష్టం, రక్షక తడులకు పోనూ  ఎకరానికి రూ. 50 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని ఎన్జీరంగా వర్సిటీ పరిశోధనా సంచాలకులు డా. ప్రశాంతి ‘సాక్షి’కి తెలిపారు. వ్యవసాయ పంటలకన్నా ఉద్యాన పంటలే రైతులకు ఈ పద్ధతుల్లో లాభదాయకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు.

ఈ ఏడాది నుంచి పీఎండీఎస్, 365 రోజులు పంటలు పండించే పద్ధతులను ఆర్‌.వై.ఎస్‌.ఎస్‌. సూచించిన పద్ధతుల్లో వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో కూడా సాగు చేసి ఫలితాలను క్రోడీకరిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎంపిక చేసిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలలో సాగు తీరును, ఖర్చు, పంట దిగుబడులను కూడా పరిశీలించి గణాంకాలను రూపొందిస్తామని తెలిపారు. పీఎండీఎస్‌ పద్ధతిలో నవధాన్యాల సాగును ప్రకృతి వ్యవసాయ విభాగం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకేల ద్వారా రైతులకు సూచిస్తోంది. 

పీఎండీఎస్‌ అంటే?
ప్రధాన పంట సాగుకు ముందు భూమిని సారవంతం చేయటానికి 25 రకాల విత్తనాలను సాగు చేస్తారు. ఈ విత్తనాలకు బంకమట్టి, ఘనజీవామృతం, బూడిద, ద్రవ జీవామృతంతో లేపనం చేసి గుళికల మాదిరిగా తయారు చేస్తారు. ఈ విత్తన గుళికలను ఎండాకాలంలో పొడి దుక్కిలోనే వర్షానికి ముందే విత్తుతారు. ఈ గుళికలు కొద్దిపాటి వర్షానికే మొలుస్తాయి.

పూత దశ (45–50 రోజులకు)లో ఈ పంటను కోసి పొలంలోనే ఆచ్ఛాదనగా వేస్తారు లేదా పశువుల మేతగా ఉపయోగిస్తారు. భూమిని సారవంతం చేయటానికి పండించే ఈ పంటను నవధాన్య పంట అని కూడా అంటారు. ఈ పంటను కోయటానికి ముందే ఖరీఫ్‌లో ప్రధాన పంటగా సాగు చేయదలచిన పంట విత్తనాలను పై విధంగా గుళికలుగా చేసి విత్తుకొని ఆ తర్వాత ఈ పంటను కోస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement