వరికి.. ‘సిరి’సాటి 

Andhra Pradesh government Encouragement for legumes and small grain - Sakshi

బోర్ల కింద ఆరుతడి పంటల సాగు 

అపరాలు, చిరుధాన్యాలకు ప్రోత్సాహం 

నాలుగు సీజన్లలో 3 లక్షల ఎకరాల్లో పంటల మార్పిడి లక్ష్యం 

ప్రస్తుతం రబీలో 30,750 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు 

రూ.11.28 కోట్ల విలువైన ఇన్‌పుట్స్‌ సబ్సిడీపై పంపిణీ 

రూ.3 కోట్లతో 100 ప్రాసెసింగ్‌ యూనిట్లు  

సాక్షి, అమరావతి: మైదాన ప్రాంతాలతో పోల్చితే బోర్ల కింద వరి సాగు చేసేందుకు రైతన్నలకు వ్యయ ప్రయాసలు అధికం. సీజన్‌ ఏదైనప్పటికీ బోర్ల కింద వరినే ఆనవాయితీగా పండిస్తూ పెట్టుబడుల భారంతో నష్టపోతున్న అన్నదాతలను ఆరుతడి పంటల వైపు మళ్లించేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. 

గ్రామాల్లో విస్తృ్తత అవగాహన.. 
రాష్ట్రంలో సుమారు 12 లక్షల బోర్లు ఉండగా వాటి కింద 24.63 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 11.25 లక్షల ఎకరాల్లో సుమారు పది లక్షల మంది రైతులు దశాబ్దాలుగా వరినే నమ్ముకున్నారు. దశల వారీగా ఆరుతడి పంటల వైపు మళ్లించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుత రబీ సీజన్‌లో ప్రయోగాత్మకంగా బోర్ల కింద 615 క్లస్టర్ల పరిధిలో 30,750 ఎకరాల్లో వరికి బదులు అపరాలు, చిరుధాన్యాలు, నూనెగింజల పంటల సాగును ప్రోత్సహించేందుకు రూ.11.28 కోట్లతో కార్యాచరణ సిద్ధం చేశారు.

ఈ ఫలితాలను బట్టి రానున్న రెండేళ్లలో కనీసం 3 లక్షల ఎకరాల్లో రైతులను ఆరుతడి పంటల వైపు మళ్లించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ఆర్బీకేల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. బోర్ల కింద సాగు చేసే రైతులతో సమావేశాలు నిర్వహించి ఆరుతడి పంటల సాగుతో చేకూరే ప్రయోజనాలపై చైతన్యం చేస్తున్నారు. వీడియో సందేశాలను వాట్సాప్‌ గ్రూపుల ద్వారా పంపిస్తున్నారు. ఆర్బీకే సిబ్బందితో పాటు వలంటీర్లు రైతుల ఇళ్లకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. గ్రామ కూడళ్లలో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి అవగాహన పెంపొందిస్తున్నారు. 

రైతులకు ప్రోత్సాహకాలు 
బోర్ల కింద ఆరుతడి పంటలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను అందించనుంది. హెక్టార్‌కు రూ.15 వేల సబ్సిడీతో స్ప్రింకర్లు అందిస్తారు. వాటితో పాటు చిరుధాన్యాలకు రూ.6 వేలు, అపరాలకు రూ.9 వేలు, నూనెగింజలకు రూ.10 వేల విలువైన విత్తనాలు, విత్తన శుద్ధి కెమికల్స్, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలు ఆర్బీకేల ద్వారా అందజేస్తారు. రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన దాల్‌ ప్రాసెసింగ్‌ మిషన్లను 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్‌ ఇంట్రస్ట్‌ గ్రూప్స్‌(ఎఫ్‌ఐజీ)లకు అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు పండించే గ్రూపులకు 50 యూనిట్లు చొప్పున ఇస్తారు.  ఎకరం పొలంలో వరి పండించే నీటితో సుమారు 8 ఎకరాల్లో ఆరుతడి పంటలను  సాగు చేయవచ్చు. పైగా పెట్టుబడి కూడా సగానికి తగ్గిపోతుంది. బోర్ల కింద, ఆయకట్టు చివరి భూముల్లో వరికి బదులు పెసర, మినుము, ఉలవలు, జొన్న, వేరుశనగ వేసుకోవచ్చు. నేల స్వభావం, నీటి లభ్యత మేరకు పంటలను ఎంపిక చేసుకుని పండిస్తే మంచి దిగుబడులొస్తాయి.  

ఒత్తిడి లేకుండా అవగాహన 
రానున్న నాలుగు సీజన్లలో దశలవారీగా కనీసం 3 లక్షల ఎకరాల్లో పంటల మార్పిడి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రైతులపై ఒత్తిడి లేకుండా ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ పథకాలను అనుసంధానిస్తూ రాయితీలు అందిస్తున్నాం. 
– అరుణ్‌కుమార్,కమిషనర్, వ్యవసాయ శాఖ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top