గుట్టను తొలచి.. గుడిగా మలిచి!

Largest Anjaneya Idol In South India Is Located In Anantapur District - Sakshi

దక్షిణ భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంజనేయుని విగ్రహం 

30 కి.మీ నుంచి దర్శనమిచ్చే అభయాంజనేయుడు

దిన దినాభివృద్ధి చెందుతున్న మౌనగిరి క్షేత్రం 

ఒకప్పుడు అది కారడవి.. ఎటు చూసినా పెద్ద పెద్ద గుట్టలు.. బండరాళ్లే దర్శనమిచ్చేవి. అటు వైపు ఎవరూ కన్నెత్తి చూసేవారు కూడా కాదు.. ఇదంతా గతం. గుట్టను తొలచారు.. గుడిగా మలచడంతో ఇప్పుడా ప్రాంతం ఆధ్యాత్మికతను సంతరించుకుంది.  

రాప్తాడు: రాప్తాడు మండలంలోని 44వ జాతీయ రహదారి సమీపంలోని హంపాపురం గుట్టలో వెలసిన మౌనగిరి క్షేత్రం  (మౌనగిరి బ్రహ్మ పీఠం) నిరంతరం జై శ్రీరాం.. జై ఆంజనేయ నినాదాలతో మార్మోగుతోంది. 39 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహం నేనున్నానంటూ భక్తులకు అభయమిచ్చేలా దర్శనమిస్తోంది. ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

విరిగిపోయిన విగ్రహం.. 
విశ్రాంత ఉపాధ్యాయుడు ఈశ్వరయ్యస్వామి, ఆయన సతీమణి ప్రధానోపాధ్యాయులురాలు వేదవతి వాళ్లకు వచ్చిన సంపాదనతో 1999 సంవత్సరంలో 14 ఎకరాల విస్తీర్ణంలో మౌనగిరి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎకరా విస్తీర్ణంలో అభయాంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే 2008లో రూ.50 లక్షల వ్యయంతో 27 అడుగుల ఆంజనేయస్వామి భారీ విగ్రహం తయారు చేయించారు. దీనిని మౌనగిరి క్షేత్రంలో ప్రతిష్టిస్తుండగా ప్రమాదవశాత్తూ విగ్రహం కిందపడి విరిగిపోయింది. ఫలితంగా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది మౌనగిరి క్షేత్రం. ఆంజనేయస్వామి భారీ విగ్రహం ముక్కలు కాగానే కార్యక్రమ కార్యనిర్వాహకులు మౌనగిరి క్షేత్రం పీఠాధిపతి ఈశ్వరయ్య స్వామితో పాటు విగ్రహ ప్రతిష్టకు వచ్చిన అశేష భక్త జనం ఆందోళన చెందారు.

దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద విగ్రహం 
దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 39 అడుగుల ఎత్తు, ఐదు అడుగుల మందం, 12 అడుగుల వెడల్పు, 225 టన్నుల బరువు ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని తయారు చేసేందుకు కర్ణాటకలోని కొయిరా గ్రామం నుంచి ప్రత్యేక రాయిని తెప్పించారు. తమిళనాడులోని మహాబలిపురం నుంచి విశేషానుభవం ఉన్న పలువురు శిల్పులు ఏడాది పాటు నిరంతరం శ్రమించి ఆంజనేయుని విగ్రహాన్ని మలిచారు. దాదాపుగా రూ. 9 కోట్లు వెచ్చించి 39 అడుగుల అభయాంజనేయస్వామి స్వామి విగ్రహ ప్రతిష్టతో పాటు చుట్టూ ఆలయాన్ని నిర్మించారు. అలాగే సీతారాములు, దక్షిణమూర్తి, వినాయకుడు, మహాలక్ష్మి, మృత్యుంజయుడు విగ్రహలతో పాటు ఆలయాలు నిర్మించారు. అలాగే ఆంజనేయస్వామి పాదాల కింద పీఠాన్ని కోలార్‌ జిల్లా శిలారుపట్నం నుంచి తెప్పించారు. గతంలో గుట్ట ఎక్కాలంటే భక్తులు సగం కొండ ఎక్కడానికే తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం భక్తులు కొండ పైకి ఎక్కడానికి మెట్లు, వాహనాలు వెళ్లేందుకు మట్టి రోడ్డు కూడా ఏర్పాటు చేశారు.

వంద మందికి ఆశ్రయం.. 
కొండపై విశాలమైన ప్రదేశంలో మొక్కలు నాటి పచ్చదనం పెంచారు. దాదాపుగా 100 మంది అనాధ వృద్ధులను చేరదీసి వారికి కొండపైనే ఆశ్రయం కల్పిస్తున్నారు. అలాగే గోశాలను ఏర్పాటు చేసి మూగ ప్రాణులను సంరక్షిస్తున్నారు. మంగళ, శని, ఆదివారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అలాగే భక్తులకు వీరబ్రహ్మం బోధనలు, తత్వాన్ని, కాలజ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. ప్రతి ఏటా నవంబర్‌లో అభయాంజనేయస్వామి జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు.

అతి పెద్ద ధ్వజ స్తంభాలు..  
మౌనగిరి క్షేత్రంలో ఏ పని చేసినా భిన్నంగా ఉండాలనే ఈశ్వరయ్యస్వామి మూడు దివ్య జ్యోతులు ఎప్పుడూ వెలిగేలా ధ్వజ స్తంభాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మూడు గుట్టలపై 33 అడుగులు ఎత్తున్న ధ్వజ స్తంభాల్లో రామకోటి, శివ, బ్రహ్మ శివ జ్యోతులను వెలిగించారు. జిల్లాలోనే ఏడున్నర అడుగుల అతిపెద్ద వినాయక విగ్రహం ఇక్కడే ఉండటం విశేషం.

పర్యటక క్షేత్రంగా .. 
రాప్తాడు మండలంలోని హంపాపురం గుట్టలో వెలసిన మౌనగిరి క్షేత్రాన్ని దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ దివ్య క్షేత్రం, పర్యటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ప్రతిష్టించిన 39 అడుగుల అభయాంజనేయ స్వామి భారీ విగ్రహం ఖ్యాతి గడించనుంది. 30 కిలో మీటర్ల వరకు అభయాంజనేయస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు.

భక్తుల సహకారంతో మరింత అభివృద్ధి
ప్రజల్లో భక్తిభవాన్ని పెంపొందించేందుకే ఇక్కడ కొండపై 39 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. మన రాష్ట్రంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. భక్తులు, దాతల సహకారంతో మౌనగిరి క్షేత్రాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వసతి గృహాలు, ఆలయానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉంది.
– ఈశ్వరయ్య స్వామి, మౌనగిరి క్షేత్రం  వ్యవస్థాపకులు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top