భద్రంగుండేనా..! | increased heart disease in india | Sakshi
Sakshi News home page

భద్రంగుండేనా..!

May 5 2026 5:16 AM | Updated on May 5 2026 5:16 AM

increased heart disease in india

దేశంలోని మొత్తం అనారోగ్య సమస్యల్లో హృద్రోగ వాటానే అధికం 

వెయ్యి మందిలో 152 మందికి అనారోగ్య సమస్యలు

సమస్యల్లో 25.6 శాతం వాటాతో మొదటి స్థానంలో గుండె జబ్బులు 

30 నుంచి 44 ఏళ్ల వారిలో 15.3 శాతం, 45 నుంచి 59 ఏళ్ల వారిలో 30 శాతం వాటా  

నేషనల్‌ శాంపిల్‌ సర్వే – 80లో వెల్లడి

సాక్షి, అమరావతి: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో ప్రజల్లో రోజురోజుకు అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుండె జబ్బుల ముప్పు మరింత తీవ్రతరం అవుతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో సంభవించే గుండె జబ్బులు ఇప్పుడు పాఠశాల విద్యార్థులు, యువకుల్లోనూ అధికం అవుతున్నాయి. 2022–23లో దేశంలోని ప్రతి వెయ్యి మందిలో 131 మంది అనారోగ్య సమస్యలతో సతమతం అవుతుండగా 2025 నాటికి ఆ సంఖ్య 152కు పెరిగింది. మొత్తం రోగాల్లో గుండె జబ్బుల వాటానే అధికం. ఈ అంశం ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నేషనల్‌ శాంపిల్‌ సర్వే(ఎన్‌ఎస్‌ఎస్‌)–80వ నివేదికలో వెల్లడైంది. 2025 జనవరి–డిసెంబర్‌ మధ్య దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం నమోదవుతున్న మొత్తం వ్యాధుల్లో 25.6 శాతం వాటాతో గుండె జబ్బులే ప్రథమ స్థానంలో ఉన్నాయి.  

ఏడేళ్లలో మూడు రెట్లు పెరుగుదల 
దేశంలోని 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో గుండె జబ్బులు ముప్పే అధికంగా ఉంది. వృద్ధుల్లో నమోదవుతున్న మొత్తం జబ్బుల్లో హృద్రోగ సమస్యల వాటా 37.8 శాతం ఉంది. ఇక 15 నుంచి 44 ఏళ్ల యువత, మధ్యవయసు్కల్లో మధుమేహం, థైరాయిడ్, ఊబకాయం వంటి మెటబాలిక్, ఇన్‌ఫెక్షన్ల అనంతరం గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉందని స్పష్టమైంది. 30 నుంచి 44 ఏళ్ల వారిలో 15.3 శాతం వాటాతో గుండె సమస్యలు మూడో స్థానంలో ఉన్నాయి. 45–59 ఏళ్ల వారిలో 30.1 శాతంతో రెండో ప్రధాన అనారోగ్య సమస్యగా కనిపిస్తోంది.

2017–18లో చేపట్టిన ఎన్‌ఎస్‌ఎస్‌ సమయంలో ప్రతి లక్ష మందిలో 1333 మంది గుండె సమస్యలతో బాధపడుతున్నట్టుగా వెల్లడించగా, 2025 నాటికి వారి సంఖ్య 3,891కు పెరిగింది. ఈ లెక్కన పరిశీలిస్తే గుండె జబ్బుల సమస్యలు ఏడేళ్లలో మూడు రెట్లు పెరిగినట్టు తేటతెల్లమవుతోంది.  ఇంత వేగంగా సమస్య పెరగడమంటే ఇది సైలెంట్‌ ఎపిడెమిక్‌  అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అంటు వ్యాధుల కంటే వేగంగా జీవనశైలి వ్యాధులు వ్యాపిస్తున్నాయని, ఇది దేశానికి పెద్ద ఆరోగ్య సవాలని స్పష్టం చేస్తున్నారు. గుండె జబ్బుల బారినపడకుండా ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement