
గొడుగుపేట శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం భూములపై హైకోర్టు నిలదీత
వాణిజ్య కార్యకలాపాల కోసం అనుమతించేదే లేదు
అలాంటి ప్రతిపాదనల విషయంలో ముందుకెళ్లొద్దు
35 ఎకరాల భూమిలో వేసిన గ్రావెల్‌ను తొలగించండి
వ్యవసాయ భూమిని యథాపూర్వ స్థితికి తీసుకురండి
దేవుడి భూమిని ధార్మిక కార్యక్రమాలకే వాడాలి
ఇతర అవసరాలకు కేటాయించే అధికారం కలెక్టర్‌కు లేదు
దేవుడి ఆస్తికి న్యాయస్థానాలు శాశ్వత సంరక్షకులు
గోల్ఫ్‌కోర్స్ ఏర్పాటుపై ఎలాంటి చర్యలు చేపట్టొద్దు
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ఆదేశం
‘‘దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూములను వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయదలచిన 35 ఎకరాలను వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగించే ప్రతిపాదనల విషయంలో ముందుకెళ్లొద్దు’’ ‘‘ధారి్మక, ఆధ్యాతి్మక కార్యకలాపాలకు తప్ప దేవస్థానం భూములను ఇతర ఏ అవసరాలకు కేటాయించే అధికారం జిల్లా కలెక్టర్‌కు లేదు. దేవుడి ఆస్తికి న్యాయస్థానాలు శాశ్వత సంరక్షకులు. ఆలయ ఆస్తులను కోర్టులు ఎల్లప్పుడూ పరిరక్షిస్తుంటాయి’’ – రాష్ట్ర హైకోర్టు
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఉన్న మచిలీపట్నం గొడుగుపేట శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన 40 ఎకరాల భూమి విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. 35 ఎకరాల్లో ‘విజయవాడ ఉత్సవ్’ పేరుతో శాశ్వత ప్రాతిపదికన వార్షిక ఎగ్జిబిషన్, 5 ఎకరాల్లో గోల్ఫ్ కోర్సు ఏర్పాటుపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో వేర్వేరుగా దాఖలైన రెండు కేసులను న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ విచారించారు.
ఎగ్జిబిషన్, గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదిస్తూ భూమి కేటాయించాలని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఈ ఏడాది జూలై 22న రాసిన లేఖ విషయంలో ముందుకు వెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఎగ్జిబిషన్ కోసం భూమిని చదును చేసేందుకు పోసిన గ్రావెల్‌ను తొలగించాలని, అంతేగాక ఆ భూమిని వ్యవసాయానికి అనుగుణంగా పూర్వస్థితికి తీసుకురావాలని నిర్దేశించారు. 35 ఎకరాలు వ్యవసాయ భూమి అని, వాణిజ్య కార్యకలాపాలకు వాడకూడదని తేల్చి చెప్పారు. మొత్తం వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబరు 6కు వాయిదా వేశారు.
» శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 40 ఎకరాలను ఎగ్జిబిషన్, గోల్ఫ్ కోర్సుకు కేటాయించాలంటూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి కలెక్టర్ రాసిన లేఖను సవాల్ చేస్తూ మచిలీపటా్ననికి చెందిన బూరగడ్డ సుజయ్‌కుమార్, మరో ఇద్దరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరి తరఫున న్యాయవాది జేవీ ఫణిదత్ వాదనలు వినిపించారు.
దేవస్థానానికి చెందిన వ్యవసాయ భూమిని ఎగ్జిబిషన్ కోసం ఇవ్వడానికి వీల్లేదన్నారు. ఆ భూమిలో ప్రస్తుతం పంటలు సాగు చేస్తున్నారని... అందుకు సంబంధించిన ఫొటోలను కోర్టు ముందు ఉంచారు. పచ్చని పంట పొలాల్లో ఎగ్జిబిషన్ కోసం మైనింగ్ వ్యర్థాలను నింపి చదును చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఆ భూమి ఎప్పటికీ వ్యవసాయానికి పనికి రాకుండా పోతుందని పేర్కొన్నారు. భూమిని లీజుకివ్వడంలో ఎలాంటి వేలం నిర్వహించలేదన్నారు.
» రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, అది వ్యవసాయ భూమి కాదని అన్నారు. గతంలోనే వ్యవసాయేతర భూమిగా మార్చారని, వాణిజ్య కార్యకలాపాలకు కేటాయించవచ్చని తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు రూ.45 లక్షలు చెల్లించారని, వాటిని దేవస్థానం అభివృద్ధికి వెచి్చస్తామని చెప్పారు. ఎగ్జిబిషన్ కేవలం 56 రోజులే ఉంటుందన్నారు. ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదని.. ఇదేమీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని తెలిపారు.
కేవలం ప్రతిపాదనే.. నిర్ణయం తీసుకోలేదు
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, గోల్ఫ్ కోర్స్ కేవలం ప్రతిపాదన మాత్రమేనన్నారు. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి దేవస్థానం భూములను ధార్మికేతర కార్యకలాపాలకు కేటాయించే అధికారం జిల్లా కలెక్టర్‌కు లేదని తేల్చి చెప్పారు. గోల్ఫ్‌కోర్స్ ఏర్పాటుకు సంబంధించిన తదుపరి చర్యలేవీ తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఆ అధికారం కలెక్టర్‌కు లేదు
ఇదే దేవస్థానం భూమిలో గోల్ఫ్‌కోర్స్ ఏర్పాటు చేయడంపైనా న్యాయమూర్తి స్పష్టమైన ఉత్తర్వులిచ్చారు. ‘‘దేవుడి భూమిలో గోల్ఫ్ కోర్స్‌కు సంబంధించి తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టవద్దు. దేవుడి ఆస్తులను కేవలం ఆధ్యాత్మిక, ధార్మిక, మతపర కార్యకలాపాలకే ఉపయోగించాల్సి ఉంటుంది’’ అని స్పష్టం చేస్తూ జస్టిస్ నూనెపల్లి హరినాథ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
గొల్లపూడిలోని 5 ఎకరాలలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై తీవ్రంగా స్పందించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబరు 16కి వాయిదా వేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదిస్తూ... చట్ట ప్రకారం దేవస్థానానికి చెందిన భూములను ధార్మిక, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు తప్ప మరే ఇతర కార్యకలాపాలకు ఉపయోగించడానికి వీల్లేదన్నారు.
కానీ, 5 ఎకరాల దేవస్థానం భూమిలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఇది వాణిజ్య కార్యకలాపాల కిందకు వస్తుందని, దేవస్థానం భూముల్లో ఇలా చేయడానికి చట్టం ఒప్పుకోదని, ప్రభుత్వానికి ఆ అధికారం లేదని అన్నారు. ఈ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు చాలా స్పష్టంగా ఉన్నట్లు చెప్పారు. దేవస్థానం భూముల విషయంలో జోక్యం చేసుకునే అధికారం జిల్లా కలెక్టర్‌కు లేదని తెలిపారు.