ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు

Examinations in regional languages in higher education courses - Sakshi

ఆంగ్ల మాధ్యమం కోర్సులైనా విద్యార్థులు మాతృభాషలో పరీక్ష

అన్ని విశ్వవిద్యాలయాలకు యూజీసీ లేఖ

స్థానిక భాషలను ప్రోత్సహించడంలో భాగంగా కొత్త విధానం

ఉన్నత విద్యలో చేరికలు పెరుగుతాయని భావన

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా సంస్థల్లో వివిధ కోర్సులను ఇంగ్లిష్‌ మాధ్యమంలో బోధిస్తున్నప్పటికీ, పరీక్షలను విద్యార్థులు వారి మాతృభాషగా ఉన్న ప్రాంతీయ భాషలో రాసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అనుమతించింది. విద్యార్థులు కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నప్పటికీ, వారు పరీక్షలలో ప్రాంతీయ భాషను ఎంచుకొనేందుకు అవకాశవిువ్వాలని అన్ని సెంట్రల్‌ వర్సిటీలు సహా అన్ని విశ్వవిద్యాలయాలకు బుధవారం లేఖ రాసింది.

స్థానిక భాషల్లో ఉన్నత విద్యా కోర్సులను ప్రోత్సహించేందుకు, బోధనాభ్యసన ప్రక్రియల్లో విద్యార్థులు మరింత చురుగ్గా పాల్గొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ పేర్కొంది. ప్రొఫెషనల్, నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలన్న నూతన విద్యా విధానం మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పాఠ్య పుస్తకాలను స్థానిక భాషల్లో రూపొందించడం, ఇతర భాషల నుంచి ప్రామాణిక పుస్తకాలను బోధనలో వినియోగించడానికి ఈ విధానం ఉపకరిస్తుందని యూజీసీ అభిప్రాయపడింది.

స్థానిక భాషలకు పెరుగుతున్న ప్రాధాన్యత
వివిధ పోటీ పరీక్షల్లో, ఉద్యోగ రాత పరీక్షల్లో  ఉన్నత విద్యా కోర్సుల్లో స్థానిక భాషలకు అవకాశం కల్పించాలని వివిధ రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో యూజీసీ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) పరీక్షలను గతంలో హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో నిర్వహించేవారు.

తరువాత పశ్చిమబెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల నుంచి వారి ప్రాంతీయ భాషల్లో ఆ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో జేఈఈ పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ నిర్వహించే వివిధ పరీక్షలు, ఇతర ఉద్యోగ పరీక్షలను కూడా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఇదే తరహాలో వివిధ విశ్వవిద్యాలయాల్లోనూ వివిధ కోర్సుల్లో స్థానిక భాషల్లో పరీక్షలు రాసుకొనేలా యూజీసీ నిర్ణయం తీసుకుంది.

స్థానిక భాషలో పరీక్ష రాస్తే విద్యార్ధులు తాము నేర్చుకున్న అంశాలను సంపూర్ణంగా సమాధానాలుగా రాయగలుగుతారని, వారిలోని పరిజ్ఞానాన్ని మరింత లోతుగా మూల్యాంకనం చేసేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని యూజీసీ అభిప్రాయపడింది. ఉన్నత విద్యలో చేరికలను పెంచేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని వివరించింది. ప్రస్తుతం ఉన్నత విద్యలో గరిష్ట చేరికలు 27 శాతం కాగా, దీన్ని 2035 నాటికి 50 శాతానికి పెంచాలన్నది నూతన విద్యా విధానం లక్ష్యమని, దీనిని సాధించడానికి నూతన విధానం ఉపకరిస్తుందని పేర్కొంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top