
సాక్షి, అమరావతి: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వారు అస్మదీయులైనా.. తస్మదీయులైనా సరే అభినందించడం మంచి సంప్రదాయం. కానీ.. అస్మదీయుడివల్ల కాని పనిని తస్మదీయుడు పూర్తిచేసి చూపిస్తే దానిపై విషం చిమ్మడంలో తనకు ఎవరూ సాటిరారని రామోజీరావు మరోసారి నిరూపించుకున్నారు. టీడీపీ సర్కార్ హయాంలో గాలేరు–నగరి వరద కాలువలో అంతర్భాగమైన అవుకు రెండో సొరంగంలో ఫాల్ట్‌జోన్ (మట్టి పొరలు పెళుసుగా ఉండే ప్రాంతం)లో అప్పటి సీఎం చంద్రబాబు చేతులెత్తేస్తే.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ పనులను సీఎం వైఎస్ జగన్ పూర్తిచేయించారు. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు.
రెండు సొరంగాల ద్వారా అవుకు రిజర్వాయర్‌కు నీటిని తరలించి.. ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ) ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా రెండో సొరంగాన్ని ఈనెల 30న జాతికి అంకితం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. దీనివల్ల ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టు రైతులు, రాయలసీమ ప్రజల్లో సీఎం వైఎస్ జగన్‌కు ఆదరణ మరింత పెరగడాన్ని జీర్ణించుకోలేని రామోజీరావు యథావిధిగా పచ్చి అబద్ధాలు, అభూతకల్పనలను పోగేసి.. ‘సీఎం మెప్పు కోసం నీటి మళ్లింపు’ పేరుతో మంగళవారం ఈనాడులో ప్రభుత్వంపై విషంకక్కారు. ఇందులోని ప్రతి అక్షరంలో సీఎం జగన్‌పై అక్కసు తప్ప వీసమెత్తు నిజం కన్పించలేదు. అసలు నిజం ఏమిటంటే..
అప్పుడు బాకాలూది ఇప్పుడు శోకాలా..?
♦ దుర్భిక్ష రాయలసీమకు కృష్ణా జలాలను తరలించి సస్యశ్యామలం చేయడం కోసం శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 9 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆ క్రమంలో సీమ ప్రజల చిరకాల స్వప్నమైన గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు.
♦ ఎస్సార్బీసీ కాలువకు సమాంతరంగా గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ వరకూ 57.7 కిమీల పొడవున గాలేరు–నగరి వరద కాలువ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా అవుకు రిజర్వాయర్‌కు నీళ్లు చేరక ముందు సొరంగం తవ్వాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో 16 మీటర్ల వ్యాసం, 5.7 కిమీల పొడవుతో 20 వేల క్యూసెక్కులు తరలించేలా సొరంగం నిర్మాణ పనులు చేపట్టేందుకు రూ.570.86 కోట్లతో 2006, నవంబర్ 18న పరిపాలన అనుమతిచ్చారు. సొరంగం తవ్వే ప్రాంతంలో రాతి పొరలు బలహీనంగా ఉండటంవల్ల ఒక పెద్ద సొరంగం బదులు రెండు చిన్న సొరంగాలు తవ్వాలని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు సూచించారు. దీంతో 11 మీటర్ల వ్యాసం, 5.7 కిమీల పొడవుతో రెండు సొరంగాల తవ్వకం పనులు చేపట్టి.. 2009 నాటికే దాదాపుగా పూర్తిచేశారు. ఎడమ సొరంగంలో 350, కుడి సొరంగంలో 180 మీటర్ల పొడవున ఫాల్ట్‌జోన్‌లో పనులు మాత్రమే మిగిలాయి.
♦ ఈ పనులు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. చివరకు ఎడమ సొరంగంలోని ఫాల్ట్‌జోన్‌లో పనులు చేయకుండా.. వాటి స్థానంలో ఏడు మీటర్ల వ్యాసంతో 2 లూప్‌లు తవ్వి పదివేల క్యూసెక్కులు తరలించి.. గండికోటలో 4 టీఎంసీలు నిల్వచేసి, గాలేరు–నగరిని తానే పూర్తిచేసినట్లు అప్పటి సీఎం చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు. ఇందుకు రామోజీరావు బాకాలూదారు.
♦ అనంతరం.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. అవుకు రెండో సొరంగాన్ని పూర్తిచేయడం ద్వారా గాలేరు–నగరి వరద కాలువ డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులు తరలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరావాసం కల్పించి 2019లోనే పూర్తిస్థాయిలో అంటే 26.85 టీఎంసీలను నిల్వచేశారు. 2020, 2021, 2022లోనూ అదే స్థాయిలో నీటిని నిల్వచేశారు.
♦ ఫాల్ట్‌జోన్‌లో పోర్–పూలింగ్, అంబ్రెల్లా పైప్ రూఫ్ విధానం, పాలియురిథేన్ గ్రౌటింగ్ ద్వారా రెండో సొరంగాన్ని పూర్తిచేయవచ్చని నిపుణుల కమిటీ సూచించింది. ఆ మేరకు పనులు చేసేందుకు 2020, మార్చి 12న రూ.126 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతిచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫాల్ట్‌జోన్ పనులు పూర్తిచేసి.. 2023, జూన్ నాటికే అధికారులు రెండో సొరంగాన్ని పూర్తిచేశారు.
♦ దీంతో గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కుల తరలింపునకు మార్గం సుగమం చేశారు. దీన్ని ఈనెల 30న సీఎం జగన్ జాతికి అంకితం చేస్తుండటంతో రామోజీకి కంటి మీద కునుకు కరువై గుండెలు బాదుకుంటున్నారు.
♦ అవుకు రెండు సొరంగాలకు ఇప్పటిదాకా రూ.568 కోట్లు ఖర్చుచేస్తే.. అందులో మహానేత వైఎస్ వెచ్చించింది రూ.340 కోట్లు, సీఎం వైఎస్ జగన్ వ్యయం చేసింది రూ.146 కోట్లు.
♦ఇక వాతావరణ మార్పులవల్ల కృష్ణా నది నుంచి శ్రీశైలానికి వరద వచ్చే రోజులు తగ్గిన నేపథ్యంలో.. వరద వచ్చిన రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను సీఎం వైఎస్ జగన్ చేపట్టారు. అందులో భాగంగా అవుకు వద్ద మూడో సొరంగాన్ని చేపట్టారు. ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
నీటిని తరలిస్తే పంటలు దెబ్బతింటాయా?
అవుకు రెండో సొరంగాన్ని పూర్తిచేయడం ద్వారా గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం, మైలవరం రిజర్వాయర్లకు రోజుకు అదనంగా ఒక టీఎంసీని తరలించవచ్చు. రెండు సొరంగాల ద్వారా నీటిని మళ్లించడం ద్వారా 2.21 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతోపాటు 1.77 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. అలాగే, ఎస్సార్బీసీ కింద 1.5 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చు. దీంతో సీమ రైతుల్లో సీఎం వైఎస్ జగన్‌కు ఆదరణ మరింతగా పెరుగుతోంది. దీన్ని జీర్ణించుకోలేని రామోజీరావు ‘సీఎం మెప్పు కోసమే నీటి మళ్లింపు’ అంటూ కట్టుకథలు అల్లారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గోరకల్లు రిజర్వాయర్‌లో నిల్వచేసిన నీటిని రెండు టన్నెళ్ల ద్వారా అవుకు రిజర్వాయర్‌కు నీటిని తరలించను న్నారు. తద్వారా ఎస్సార్బీసీ ఆయకట్టు రైతులకు పంటల ప్రయోజనాలు అందుతాయి. కానీ, దానివల్ల పంటల ప్రయోజనాలు దెబ్బతింటాయని రామోజీ రాతలు రాయ డం హాస్యాస్పదం. ఇందులో రైతుల ప్రయోజనాలు తప్ప సీఎం మెప్పు కోసం అనే అంశం ఎక్కడ కనిపించింది రామోజీ!?
Comments
Please login to add a commentAdd a comment