Sakshi News home page

‘కోతల’ రాతలు ఇంకెన్నాళ్లు 

Published Thu, Apr 18 2024 6:16 AM

Jagan govt attracted more than Rs 35000 crores of foreign investment - Sakshi

బాబు గ్రాఫిక్స్‌ మాయ నుంచి బయటకు రాలేకపోతున్న రామోజీ 

రూ.35,000 కోట్లకుపైగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన జగన్‌ సర్కారు 

సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో అనంతపురానికి మైక్రోసాఫ్ట్‌ వచ్చేసింది. హైపర్‌లూప్‌ టెక్నాలజీతో గంటలో అమరావతి నుంచి విశాఖకు వెళ్లిపోవచ్చు. దుబాయ్‌కు చెందిన బీఆర్‌షెట్టి అమరావతిలో నిర్మించిన ఆసుపత్రుల్లో ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుతోంది... ‘ఇవన్నీ గ్రాఫిక్స్‌ రా’ అని ప్రజలు ఎప్పుడో తేల్చేసినా ఆయన కూలీ రామోజీ మాత్రం ఆ మాయాజాలం నుంచి బయటకు రావడం లేదు. అందుకే జగన్‌మోహన్‌ రెడ్డి సర్కార్‌లో విదేశీ పెట్టుబడులు వాస్తవ రూపంలో కనిపిస్తున్నా కళ్లకు గంతలు కట్టేసుకుని రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాలేదంటూ కొయ్‌ రాజా కొయ్‌ శీర్షికతో ఓ పుచ్చు కథనాన్ని ప్రచురించారు.

కోవిడ్‌ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ సంస్థలు తమ వ్యాపార విస్తరణ కార్యక్రమాలను తగ్గించుకున్నప్పటికీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలోనే కాదు వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముందుంది. గడిచిన ఐదేళ్ల కాలంలో రూ.35,000 కోట్లకుపైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. జపాన్‌కు చెందిన యకహోమా టైర్స్‌ అచ్యుపుతాపురం సెజ్‌లో సుమారు రూ.1929 కోట్లతో భారీ టైర్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించింది. జర్మనీకి చెందిన ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ సంస్థ పెప్పర్‌ మోషన్‌  చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద రూ.4,640 కోట్లతో యూనిట్‌ ఏర్పాటు చేస్తోంది.

యూరప్‌కు చెందిన పెట్రేగ్యాస్‌ కృష్ణపట్నం వద్ద రూ.600 కోట్లతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లోటింగ్‌ ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌ వారం రోజుల క్రితమే వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించింది. జపాన్‌కు చెందిన డైకిన్‌ రూ.2,600 కోట్లతో ఏసీ తయారీ యూనిట్‌ను తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ప్రారంభించింది. టోరే ఫార్మా అక్కడే రూ.1,000 కోట్ల పెట్టుబడులను వాస్తవరూపంలో తెచ్చింది. క్యాడ్‌బరీస్‌ చాక్లెట్స్‌ మాండలీజ్‌ రూ.1,600 కోట్లతో భారీగా విస్తరిస్తోంది. అదిదాస్‌ బ్రాండ్‌తో తయారయ్యే పాదరక్షల తయారీ సంస్థ  హిల్‌టాప్‌ సెజ్‌ పేరుతో రూ.800 కోట్లతో ఏర్పాటు చేస్తున్న యూనిట్‌ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.  

దావోస్‌లో పాలకూర పప్పు.. 
వాస్తవాలు ఇలా కళ్లకు కనబడుతుంటే.. విదేశీ పెట్టుబడుల కోసం రాష్ట్రం చాలా సమావేశాలు, డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌లు ఏర్పాటు చేసింది కానీ ఏం సాధించలేదంటూ ఈనాడు రాసేసింది. గత ప్రభుత్వంలో దావోస్‌ వెళ్లిన చంద్రబాబు పాలకూర పప్పు... బెండకాయ వేపుడు ప్రసంగం ఇప్పటికీ అంతర్జాతీయంగా కామెడీ పీస్‌గా ఉంది.

ఈ నెలలో టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ భారత్‌ పర్యటనకు వస్తున్నారు. ఆయనను ఏపీకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇక్కడ వనరులు అవకాశాలను వివరిస్తూ వార్తలు రాయాల్సింది పోయి.. నీచ రాజకీయాల బాబు కోసం స్థానిక యువత నోట్లో మట్టి కొట్టే విధంగా విషపురాతలు రాయడం తగునా? అని యువత ప్రశ్నిస్తోంది.  

Advertisement
Advertisement