మద్దతు ధర ఇవ్వాల్సిందే

CM YS Jaganmohan Reddy Review On Agricultural Products Procurement - Sakshi

పంటలు సాగు చేసిన ఏ ఒక్క రైతూ నష్టపోకూడదు

ఇందుకు రూ.3,300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి

ఈ ఖరీఫ్‌లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సన్నద్ధతపై సమీక్షలో సీఎం జగన్‌

పంటల విషయాల్లో రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత జాయింట్‌ కలెక్టర్లదే

వాల్యూ యాడెడ్, ప్రాసెసింగ్‌ ద్వారా రైతులకు మరింత మేలు

ఆర్‌బీకేల వద్ద కనీస మద్దతు ధర వివరాలు.. రోజువారీ కార్యాచరణ

వీలైనంత త్వరగా ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధి చేయాలి

ఈ ఖరీఫ్‌లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొరత లేకపోవడంతో, వ్యవసాయ ఉత్పత్తులు కూడా గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో ఏ ఒక్క రైతు నష్ట పోకుండా చూడాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పండించే పంటలకు కనీస గిట్టుబాటు ధర తప్పకుండా కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న తరహా ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఏ సమస్యలు రాకూడదని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సన్నద్ధతపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్‌లో దాదాపు 93.61 లక్షల టన్నుల ఉత్పత్తి (వివిధ పంటలు) జరుగుతుందని అంచనా కాగా, 62 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.
ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సన్నద్ధతపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

అన్ని విధాలా సహాయకారిగా ఆర్‌బీకేలు
► పంటల ఈ–క్రాపింగ్‌తో పాటు, రైతుల పేర్లు నమోదు, ధాన్యం సేకరణపై సమాచారం.. ఇతరత్రా ఏదైనా సరే, ఆర్‌బీకేల (రైతు భరోసా కేంద్రాలు) స్థాయిలోనే జరగాలి. ప్రతి ఆర్‌బీకే వద్ద  పంటల కనీస గిట్టుబాటు ధరల (ఎమ్మెస్పీ) పట్టికను ఒక పెద్ద ఫ్లెక్సీ ద్వారా ప్రదర్శించాలి. గ్రామాల్లో రైతులకు ఆర్‌బీకేలు అన్ని విధాలుగా పూర్తి సహాయకారిగా ఉండాలి. 
► ఏ పంట వేస్తే బాగుంటుంది? ఎంత ఆదాయం వస్తుంది? ఆర్‌బీకేల ద్వారా ఏ పంటలు సేకరిస్తామన్నది రైతులకు ముందుగానే చెప్పాలి. ఆ తర్వాత కచ్చితంగా ధరలు వచ్చేలా చూడాలి. సాగు నీటి సరఫరాను దృష్టిలో ఉంచుకుని, రైతులకు అవగాహన కల్పించాలి. ఇది జరగకపోతే జేసీలదే బాధ్యత. 
► స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలను ఇందులో భాగస్వామ్యులను చేయాలి. ఈ దిశగా ఇప్పటికే సలహా  కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి.

ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌
► ప్రతి పంట ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానం కావాలి. అప్పుడే ఆ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. బయటి మార్కెటింగ్‌లోనూ అవకాశం కల్పించాలి. 
► బహిరంగ మార్కెట్‌లో పంటల కొనుగోలుదారుల (వ్యాపారుల) వివరాల డేటాను ఈ మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఆర్‌బీకేకు అనుసంధానం చేయాలి.  
► ఎఫ్‌ఏక్యూ (ఫెయిర్‌ యావరేజ్‌ క్వాలిటీ) కంటే తక్కువ నాణ్యతతో సేకరించే బియ్యాన్ని (నూకలు) రవ్వ, పిండి తదితర అవసరాలకు వినియోగించుకునే విషయం పరిశీలించాలి. పంటల ఉత్పత్తి సేకరణకు సంబంధించి ఎస్‌ఓపీ ఖరారు చేయాలి.

పత్తి కొనుగోళ్లు.. మార్కెటింగ్‌ 
► వీలైనంత వరకు ఎక్కువగా పత్తి కొనుగోలు చేయాలి. గత ప్రభుత్వ హయాంలో పత్తి కొనుగోళ్లలో అవినీతి చోటు చేసుకుంది. ఇప్పుడు ఎక్కడా అలాంటి వాటికి తావుండకూడదు.
► మార్కెటింగ్‌ విభాగం (మార్క్‌ఫెడ్‌) గ్రామాల్లో రైతుల నుంచి 30 శాతం ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో పాటు, మిగిలిన 70 శాతం ఉత్పత్తులు కూడా అమ్ముడుపోయేలా చూడాలి.  

పది రకాల పంటల సేకరణ
► ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల రిజిస్ట్రేషన్, సేకరణ, పేమెంట్లు మొత్తం ప్రక్రియ “సీఎం యాప్‌’ (కాంప్రహెన్సివ్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైజ్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌–సీఎం ఏపీపీ) ద్వారా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 
► ఆర్‌బీకేల వద్ద ముందుగానే రైతుల పేర్లు నమోదు చేసుకుని.. మొక్కజొన్న, సజ్జలు, జొన్నలు, రాగులు, చిరు ధాన్యాలు, వేరుశనగ, పత్తి, కందులు, పెసర్లు, మినుముల వంటి మొత్తం 10 రకా«ల పంటల సేకరణకు సిద్దమవుతున్నామని చెప్పారు. మొత్తం 3 వేల కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు.
► ఈ సమీక్షలో మంత్రులు కురసాల కన్నబాబు, కొడాలి నాని, వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్‌ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న, పౌర సరఫరాల కమిషనర్‌ కోన శశిధర్, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

ఈ ఖరీఫ్‌లో దాదాపు రూ.3,300 కోట్ల మేర వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ మేరకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు (వాల్యూ యాడెడ్‌), ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి చర్యల ద్వారా రైతులకు మరింత మేలు చేయాలి. 

2019–20 రబీ సీజన్‌లో కందులు, శనగలు, మొక్కజొన్న, జొన్న, పసుపు, ఉల్లిపాయలు, అరటి పండ్లు, బత్తాయిలు, టమాటా, పొగాకు తదితర వ్యవసాయ ఉత్పత్తులను దాదాపు రూ.3,200 కోట్లతో కొనుగోలు చేశాం. రైతులకు అన్ని విధాలా అండగా నిలిచాం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top