పోలవరానికి నిధులు విడుదల చేయండి | CM YS Jagan Wrote Letter to PM Modi Over Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరానికి నిధులు విడుదల చేయండి

Nov 1 2020 2:47 AM | Updated on Nov 1 2020 4:57 PM

CM YS Jagan Wrote Letter to PM Modi Over Polavaram Project - Sakshi

పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.17,656.82 కోట్లు ఖర్చు చేశాం. ఇప్పుడు నిధులు విడుదల చేయకుంటే ఎలా? ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలిపోతుంది. ఇది జాతీయ ప్రాజెక్టు. సవరించిన అంచనా వ్యయం ఆమోదం విషయంలో జాప్యం చేస్తే.. అంచనా వ్యయం మరింత పెరుగుతుంది. ఇది జాతీయ ప్రయోజనాలకు మంచిది కాదు.

సాక్షి, అమరావతి: ‘పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రెండవ సవరించిన అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ (ఆర్‌సీసీ) ఆమోదించింది. ఇందులో భూసేకరణ, సహాయ పునరావాస (ఆర్‌ఆర్‌) ప్యాకేజీ వ్యయం రూ.28,191.03 కోట్లు. ఈ నేపథ్యంలో 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు నీటి పారుదల విభాగం వ్యయాన్ని రూ.20,398.1 కోట్లకు పరిమితం చేయడమంటే జాతీయ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014ను ఉల్లంఘించినట్లే. ఈ వ్యవహారంలో తక్షణమే మీరు జోక్యం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ), ఆర్‌సీసీ ఆమోదించిన మేరకు రెండో సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర జల్‌ శక్తి, ఆర్థిక శాఖలను పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌) జారీ చేసేలా దిశానిర్దేశం చేయండి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నీటి పారుదల విభాగం వ్యయాన్ని 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లుగా ఆమోదిస్తేనే రూ.2,234.77 కోట్లు విడుదల చేస్తామని అక్టోబర్‌ 12న కేంద్ర ఆర్థిక శాఖ షరతు విధిస్తూ కేంద్ర జల్‌ శక్తి శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో 2017–18 ధరల ప్రకారం నిధులు విడుదల చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ అక్టోబర్‌ 28న లేఖ రాశారు. ఆ లేఖలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే
– విభజన చట్టంలో సెక్షన్‌–90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. పర్యావరణ, అటవీ, సహాయ పునరావాస ప్యాకేజీ వంటి అన్ని అనుమతులు తెచ్చి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది.
– దీనిపై 2014 ఏప్రిల్‌ 29న చర్చించిన కేంద్ర మంత్రి మండలి.. 2014 ఏప్రిల్‌ 1 వరకు పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,135.87 కోట్లను రాష్ట్ర వాటాగా పరిగణిస్తూ ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన కల్పన పథకం) మార్గదర్శకాలను సవరించింది. 
– 2010–11 ధరల ప్రకారం ప్రస్తుత అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లని.. భూసేకరణ చట్టం–2013 అమల్లోకి రావడం, కాలయాపన వల్ల అంచనా వ్యయం పెరుగుతుందని తేల్చింది. ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఎంత వ్యయమైతే అంత మొత్తాన్ని గ్రాంట్ల రూపంలో కేంద్రం ఏర్పాటు చేసే సంస్థకు విడుదల చేయాలని తీర్మానం చేసింది. 
– ఈ తీర్మానం మేరకే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్పీవీ)గా పీపీఏను ఏర్పాటు చేస్తూ 2014 మే 28న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీన్ని బట్టి.. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ప్రాజెక్టు పనులను మాత్రమే కేంద్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నది స్పష్టమవుతోంది.
 
టీడీపీ ప్రభుత్వం వైఫల్యం వల్లే..
– మొదటి పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2005–06 ధరల ప్రకారం రూ.10,151.04 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించింది. ప్రాజెక్టు తొలి సవరించిన అంచనా వ్యయం 2010–11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లుగా 2011 జనవరి 21న సీడబ్ల్యూసీ టీఏసీ నిర్ధారించింది. 
– 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.28,919.95 కోట్లుగా ఆర్‌సీసీ ప్రతిపాదించింది. వీటిని బట్టి జాప్యమయ్యేకొద్దీ అంచనా వ్యయం పెరుగుతోందని స్పష్టమవుతోంది. రాష్ట్ర వాటా ఇప్పటికే ఖర్చు చేసిందని 2014 మే 26న కేంద్ర కేబినెట్‌ అంగీకరించింది. 
– ప్రాజెక్టును వంద శాతం వ్యయంతో పూర్తి చేయడానికి పీపీఏను ఏర్పాటు చేస్తూ 2014 మే 28న కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కానీ.. తొలి సవరించిన అంచనా వ్యయం అంటే రూ.16,010.45 కోట్లకు 2017 మే 8న కేంద్ర జల వనరుల శాఖ షరతుతో కూడిన ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇచ్చింది. 
– 2016 సెప్టెంబర్‌ 30న కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు 2014 ఏప్రిల్‌ 1 నాటికి నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని, అంతకంటే అంచనా వ్యయం పెరిగితే.. పెరిగిన అంచనా వ్యయాన్ని ఏపీ ప్రభుత్వమే భరించాలని షరతు విధించింది. ఇది కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను ఉల్లంఘించడమే. ఈ అంశాన్ని అప్పట్లో కేంద్రానికి వివరించడంలో అప్పటి ఏపీ ప్రభుత్వం విఫలమైంది.

కేంద్ర జల్‌ శక్తి శాఖ ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇవ్వాలి
– 2010–11 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇచ్చాక.. 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను రూ.57,297.42 కోట్లతో 2018  జనవరి 2న పీపీఏ కోరిన మేరకు ఈఎన్‌సీ పంపారు.
– 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి, నిర్వాసితులకు పరిహారం, పునరావాసం చెల్లించాల్సి రావడం.. కాలయాపన, డిజైన్‌లు మారడం, ధరల పెరుగుదల వల్ల అంచనా వ్యయం పెరిగిందని ఈఎన్‌సీ పేర్కొన్నారు. వీటిని పరిశీలించిన టీఏసీ.. పోలవరం ప్రాజెక్టు రెండో సవరించిన అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లుగా ఆమోదిస్తూ 2019 ఫిబ్రవరి 18న కేంద్రానికి నివేదిక ఇచ్చింది. 
– వీటిని పరిశీలించిన ఆర్‌సీసీ.. రెండో సవరించిన అంచనా వ్యయాన్ని రూ.47,617.74 కోట్లుగా 2020 జూన్‌ 3న ఖరారు చేసింది. దీనికి ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇచ్చే అధికారాన్ని కేంద్ర జల్‌ శక్తి శాఖకు నీతి అయోగ్‌ అప్పగించింది. ఈ మేరకు కేంద్ర జల్‌ శక్తి శాఖ ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 

నీటి సరఫరా వ్యయం తొలగిస్తారా.. 
– ప్రత్యేక ప్యాకేజీ అమల్లోకి వచ్చే వరకు 2016 సెప్టెంబర్‌ 30 వరకు పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్‌ ద్వారానే గ్రాంట్‌ రూపంలో కేంద్రం నిధులను విడుదల చేసేది. కానీ.. ప్రత్యేక ప్యాకేజీ అమల్లోకి వచ్చాక నాబార్డు నుంచి ఎల్‌ఐటీఎఫ్‌ (దీర్ఘకాలిక నీటి పారుదల నిధి) ద్వారా పీపీఏ ద్వారా రీయింబర్స్‌ చేస్తోంది. 
– విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టుపై రూ.12,520.91 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో రూ.8,507.26 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేయగా, మిగతా రూ.4,013.65 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించి పంపిన ప్రతిపాదనల మేరకు రూ.2,234.77 కోట్లను రీయింబర్స్‌ చేయడానికి షరతు విధించడమంటే నీటి పారుదల విభాగం నుంచి నీటి సరఫరా వ్యయాన్ని తొలగించడమే. ఇది సీడబ్ల్యూసీ నిబంధనలకు విరుద్ధం. రెండో సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించి, నిధులు విడుదల చేసి, ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement