ఏ సీజన్‌ పంట నష్ట పరిహారం ఆ సీజన్‌లోనే 

CM Jagan Launches YSR Rythu bharosa Second Phase Instalment - Sakshi

1.66 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.135.73 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ 

రెండో ఏడాది రెండో విడత వైఎస్సార్‌ రైతు భరోసా సొమ్ము విడుదల సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌

అక్టోబర్‌లో పంట నష్టపోయిన రైతులకు నవంబర్‌లోగా పరిహారం

50.47 లక్షల రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము రూ.1,115 కోట్లు జమ

1.02 లక్షలకు పైగా గిరిజన, కౌలు రైతులకు దాదాపు రూ.118 కోట్లు 

దేశ చరిత్రలో ఎక్కడా ఏటా రైతుకు రూ.13,500 ఇచ్చిన దాఖలాలు లేవు

ఏ గ్రామానికి వెళ్లినా రైతుకు భద్రత కనిపిస్తోంది

ఆర్‌బీకేల ద్వారా అన్నదాతలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మాం. రైతులను అన్ని రకాలుగా ఆదుకునేలా అడుగులు ముందుకు వేస్తున్నాం. దేశ చరిత్రలో ఎక్కడా కూడా రైతుకు ఏటా రూ.13,500 ఇచ్చిన దాఖలాలు లేవు. అది మన రాష్ట్రంలో మాత్రమే ఉంది. నిజంగా కొన్ని పథకాలు చాలా సంతోషాన్ని ఇస్తాయి.

రైతుల కోసం ఎన్నెన్నో మంచి పనులు చేస్తున్నాం. ఇవన్నీ చూసి ఓర్చుకోలేని కొందరు.. ఈ నెల 16న వర్షాలు ముగిసినా, 10 రోజుల తర్వాత ట్రాక్టర్‌కు పూలు కట్టి మరీ పర్యటిస్తున్నారు. దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి మంచిగా వర్షాలు కురిశాయి. అన్ని ప్రాజెక్టులు నిండాయి. ఇప్పుడు ఇస్తున్న ఆర్థిక సహాయం, సాగు నీటి వసతితో రైతుల పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తున్నాను. 

సాక్షి, అమరావతి : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఈ ఖరీఫ్‌ సీజన్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇదే సీజన్‌లో ఇస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లోనే పంట నష్టపరిహారం చెల్లించామని గర్వంగా చెబుతున్నామన్నారు. అక్టోబర్‌ నెలలో వరదలు, భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నవంబర్‌లోగా పరిహారం ఇస్తామని ప్రకటించారు. ‘వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌’ కింద రెండో ఏడాది రెండో విడత చెల్లింపులను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి 50.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.1,115 కోట్లు జమ చేశారు. అలాగే రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఖరీఫ్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే సీజన్‌లో చెల్లిస్తూ.. 1.66 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.135.73 కోట్లు జమ చేశారు. కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ హక్కు పత్రాలు పొంది సాగుకు సిద్ధమైన రైతులకు కూడా రైతు భరోసా-పీఎం కిసాన్‌  పథకాన్ని వర్తింప చేశారు. ఆ మేరకు ఈ ఏడాది రెండు విడతలకూ కలిపి రూ.11,500 చొప్పున 1.02 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో దాదాపు రూ.118 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వివిధ జిల్లాల్లోని రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ.. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేసే అవకాశం దేవుడు తనకిచ్చారన్నారు. ఇవాళ వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం ద్వారా అర కోటికి పైగా రైతులకు దాదాపు రూ.6,800 కోట్లు సహాయంగా అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల ఇళ్లుంటే, వాటిలో 50 లక్షల ఇళ్లకు.. అంటే మూడో వంతు ఇళ్లకు మేలు కలిగేలా పెట్టుబడి సహాయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వీరందరికీ మూడు విడతల్లో ఏటా రూ.13,500 పెట్టుబడి సహాయం చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇవాళ రెండో ఏడాది రెండో విడత చెల్లిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

గత ఏడాది.. ఇప్పుడు..

  • మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలుత 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,173 కోట్లు గత ఏడాది ఇచ్చాం. ఈ ఏడాది 50.47 లక్షల కుటుంబాలకు సహాయం చేస్తున్నాం. గిరిజన రైతులకు కూడా ఈ ఏడాది సహాయం అందిస్తున్నాం. 
  • మే నెలలో రూ.7,500 చొప్పున దాదాపు రూ.3,713 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు అక్టోబర్‌లోపే రూ.4 వేలు చెల్లిస్తున్నాం. మళ్లీ సంక్రాంతి సందర్భంగా జనవరిలో రూ.2 వేలు ఇస్తాం.
  • మే నెలలో దాదాపు 49.45 లక్షల మంది భూ యజమానులతో పాటు, ధ్రువీకరించిన అటవీ భూముల సాగుదారులు 41 వేల మందికి సహాయం అందించాం. 
  • మొన్న ఆగస్టులో రూ.980 కోట్లు, ఇప్పుడు మరో 4 వేల రూపాయల చొప్పున రూ.1,115 కోట్లు.. రెండూ కలిపితే దాదాపు రూ.2 వేల కోట్లు ఇస్తున్నాం.  

అర్హతే ప్రామాణికం

  • వివక్ష, అవినీతి లేకుండా, కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా పూర్తిగా శాచురేషన్‌ పద్ధతిలో చెప్పిన మాట ప్రకారం ప్రతి పథకం అమలు చేస్తున్నాం. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. ఈ మొత్తం వారి పాత బకాయిలు, అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా ఉండే వ్యవస్థను తీసుకురాగలిగాం.
  • దేశ చరిత్రలోనే మన రాష్ట్రంలో అందుతున్న ఈ సహాయంతో రైతులకు మెరుగైన భద్రత, ఉపాధి లభిస్తోంది. రైతు భరోసా కింద ఏటా రూ.13,500ను రైతులకే కాకుండా, కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన గిరిజన రైతులకు, అసైన్డ్‌ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా ఇస్తున్నాం. 

 
చెప్పిన మాట కంటే మిన్నగా..

  • ప్రతి రైతుకు ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.50 వేలు ఇస్తామని ఎన్నికల వాగ్దానంగా చెప్పాం. కానీ ఇవాళ ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.67,500 ఇస్తున్నామని సగర్వంగా చెబుతున్నా.
  • అర హెక్టారులోపు భూమి ఉన్న 50 శాతం రైతులకు ఈ మొత్తం దాదాపు 80 శాతం పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. 
  • ఈ ఏడాది, ఈ సీజన్‌లో వర్షాలు, వరదల వల్ల జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నష్టపోయిన దాదాపు 1.66 లక్షల మంది రైతులకు రూ.135.73 కోట్లు పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) ఇస్తున్నాం. అక్టోబర్‌లో నష్టానికి సంబంధించి లెక్కలు సేకరిస్తున్నారు. అవి పూర్తి కాగానే నవంబర్‌ లోపే వాటిని చెల్లిస్తాం.  

గత ప్రభుత్వ హయాంలో..
గతంలో ఏనాడూ అదే (సేమ్‌) సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. 2014లో ఖరీఫ్‌ పంటకు నష్టం జరిగితే, 2017 జనవరి వరకు పరిహారం ఇవ్వలేదు. 2015 ఖరీఫ్‌లో నష్టం జరిగితే, 2016 నవంబర్‌లో పరిహారం ఇచ్చారు. 2016 ఖరీఫ్‌లో నష్టం జరిగితే 2017 జూన్‌లో, 2017 రబీలో నష్టం జరిగితే 2018 ఆగస్టులో పరిహారం ఇచ్చారు. చివరకు 2018లో జరిగిన నష్టానికి పరిహారం పూర్తిగా ఎగ్గొట్టారు.
 
రైతు భరోసా కేంద్రాలతో అండగా నిలిచాం

  • విత్తనం వేయడం మొదలు, పంట అమ్మే వరకు రైతులకు సహాయం చేసేందుకు, వారు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో 10,641 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేశాం.
  • నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరాతో పాటు, వారికి సూచనలు, సలహాలు చివరకు పంట అమ్మడంలోనూ సహకారం అందిస్తున్నాం. అవసరమైతే పంటల కొనుగోలు కూడా చేస్తున్నాం. 
  • ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ప్రతి ఆర్బీకే పరిధిలో వరి కోత యంత్రాలు (ప్యాడీ హార్వెస్టర్లు) అందుబాటులో ఉంచుతాం.
  • ప్రతి నియోజకవర్గంలో రైతులకు ఉచితంగా వైఎస్సార్‌ జలకళ ద్వారా బోరు బావుల తవ్వకంతో పాటు పేద రైతులకు మోటార్లను కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తాం. 

 గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు 

  • గత ప్రభుత్వం రైతుల ఉచిత విద్యుత్‌కు సంబం«ధించి 14 నెలలకు గానూ రూ.8,655 కోట్లు బకాయి పెట్టింది. రైతుల కోసం చిరునవ్వుతో ఆ బకాయిలు చెల్లించాం. 
  • ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు తీర్చాం. విత్తనాల సబ్సిడీ రూ.384 కోట్లు బకాయిలు కట్టాం.
  • రైతులకు వడ్డీ లేని రుణాల కింద 2014 నుంచి రూ.1,046 కోట్లు బకాయి పెడితే, అన్నింటినీ ఈ ప్రభుత్వం చెల్లించింది.

రైతుల మేలు కోసం ఎన్నెన్నో..

  • వ్యవసాయానికి పగలే నాణ్యమైన విద్యుత్‌ 9 గంటలు ఇవ్వాలంటే, ఫీడర్లు ఆ స్థాయిలో లేవని తేలింది. కేవలం 58 శాతం ఫీడర్లలోనే ఆ కెపాసిటీ ఉందంటే, రూ.1,700 కోట్లు ఖర్చు చేసి, 90 శాతం ఫీడర్ల సామర్థ్యం పెంచాం. దీంతో ఇవాళ పగలే నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నాం. రబీ నాటికి మిగతా ఫీడర్ల కింద మార్పు చేస్తాం.
  • రూ.లక్ష వరకు పంట రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద  ప్రభుత్వమే వడ్డీ కడుతోంది.
  • రైతులు కేవలం ఒక్క రూపాయి కడితే చాలు, ప్రభుత్వమే మిగతా బీమా ప్రీమియమ్‌ చెల్లిస్తుంది. 
  • 2019 ఖరీఫ్‌కు సంబంధించి, రైతుల వాటా ప్రీమియమ్‌ రూ.506 కోట్లు, ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన మరో రూ.524 కోట్లు.. మొత్తంగా రూ.1,030 కోట్ల బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తోంది.
  • 13 జిల్లా స్థాయి అగ్రి ల్యాబ్‌లు, 147 నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో నాణ్యత పరీక్షించాకే రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా జరుగుతోంది. 
  • 2019-20లో దాదాపు రూ.15 వేల కోట్లతో వరి ధాన్యం కొనుగోలు చేశాం. కోవిడ్‌ సమయంలో రైతులకు అండగా ఉంటూ.. మొక్కజొన్న, సజ్జ, ఉల్లి, పొగాకు, పసుపు వంటి పంటలు కొనుగోలు చేశాం. గత ఏడాది మొత్తంగా రూ.3,200 కోట్లతో పంటలు కొనుగోలు చేశాం. మరో రూ.666 కోట్లతో పత్తి కొనుగోళ్లు జరిపాం.
  • ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ కమిషనర్‌ కె.కన్నబాబు, ఉద్యానవన కమిషనర్‌ చిరంజీవి చౌదరి, సీనియర్‌ అధికారులు, రైతులు పాల్గొన్నారు. 

చరిత్ర సృష్టిస్తున్నారు: మంత్రి కన్నబాబు
ఇది చరిత్రాత్మక రోజు. ఈ పథకంలో తొలుత 46 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం కల్పించగా, ఇప్పుడు 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు పెట్టుబడి సహాయం చేస్తున్నాం. ఇది కేవలం మీకు (వైఎస్‌ జగన్‌) మాత్రమే సా«ధ్యమైంది. కరోనా సమయంలోనూ ఏదీ ఆపడం లేదు. ఈ ఖరీఫ్‌కు సంబంధించి ఇదే సీజన్‌లోనే ఇన్‌పుట్‌ సబ్సిడీని కేవలం మీరు మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్రంలో హరిత విప్లవం సాధిస్తున్నారు. గతంలో కనీసం రెండేళ్లకు కానీ ఆ మొత్తం ఇచ్చే వారు కారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top