ఏప్రిల్ ఒకటి నుంచి తరగతులు
మండు వేసవిలో వచ్చేందుకు ఇష్టపడని విద్యార్థులు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యా సంవత్సరం ఎటువంటి ప్రణాళికా లేకుండా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. అదేరోజు రెండో ఏడాది విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. కేవలం నెల కూడా గడవకుండానే.. ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమవుతుంది. అన్ని స్థాయిల తరగతులు అదే తేదీన ప్రారంభమవుతాయి. కానీ ఇంటర్మీడియెట్ తరగతులు ఏప్రిల్ ఒకటి నుంచి మండు వేసవిలో ప్రారంభమవుతున్నాయి.
మార్చి 24వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ఐపీఈ–2026) జరిగాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే తరగతులు నిర్వహించడం, అదీ 100 శాతం హాజరు ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో జూనియర్ లెక్చరర్లు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో జూనియర్ కాలేజీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు కలిపి 801 ఉన్నాయి. హైసూ్కల్ ప్లస్‌లు 502, ప్రైవేట్ కాలేజీలు 181 ఉన్నాయి.
2025–26 నుంచి నేర్వని పాఠాలు
తొలిసారి 2025–26 విద్యా సంవత్సరంలో ఏప్రిల్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభించారు. ఒక పక్క జవాబు పత్రాల మూల్యాంకనం జరగడం.. ఇంకోపక్క అడ్మిషన్లతో లెక్చరర్లు తలమునకలై ఉన్నా... అవేమీ పట్టించుకోకుండా క్లాసులు కూడా చెప్పాలని ఆదేశించారు.
లెక్చరర్లు ఎంత ప్రయత్నించినా విద్యార్థుల హాజరు మాత్రం 10 శాతం దాటలేదు. ఈ ఏడాది గతేడాది చేసిన ప్రయత్నం విఫలమవడంతో 2026–27 విద్యా సంవత్సరంలో ఈ ఏడాది ఏప్రిల్ తరగతులను రద్దు చేసి జూన్ 12న రెగ్యులర్ విద్యా సంవత్సరంతో ప్రారంభించాలని అధికారులు చేసిన ప్రతిపాదనలను విద్యాశాఖ మంత్రి కార్యాలయం పట్టించుకోలేదని తెలిసింది.
అయోమయం.. గందరగోళం
ఇంటర్ విద్యలో కొత్తగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశపెట్టి 2025–26 విద్యా సంవత్సరంలో మొదటి ఏడాదికి అమలు చేశారు. 2026–27 విద్యా సంవత్సరంలో రెండో ఏడాది విద్యార్థులకు కొత్త సిలబస్ అందుబాటులోకి వస్తుంది. అయితే, సిలబస్ ఎలా ఉంటుందో, పాఠాలు ఎలా బోధించాలో ఇప్పటి వరకు లెక్చరర్లకు శిక్షణ ఇవ్వలేదు. రెండో ఏడాది విద్యార్థులకు కొత్త సిలబస్‌తో పాఠ్య పుస్తకాలు ఇంకా అందుబాటులోకీ రాలేదు.
ఒకటో తేదీనే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో స్టూడెంట్ కిట్లు అందే పరిస్థితి లేదు. ఇప్పటి దాకా ఏ జిల్లాకూ పుస్తకాలు చేరలేదు. ఏప్రిల్ 14 వరకు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతుంది. అందువల్ల ఆ కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించరు.
ఈ ఏడాది ఇంటర్ మొదటి ఏడాదిలో 5,31,275 మంది విద్యార్థులకు గాను 5,21,266 మంది పరీక్షలు రాశారు. వీరంతా రెండో ఏడాదిలోకి ప్రవేశిస్తారు. అయితే, వీరిలో ఎంత మంది ఉత్తీర్ణులు అవుతారో.. ఎంత మంది సప్లిమెంటరీకి సిద్ధమవుతారో తెలియని పరిస్థితి. మరోపక్క ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని ప్రభుత్వమే ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచే తరగతులు ఏమిటనేది పెద్ద ప్రశ్న.


