సీతా'సోకు' చిలుకలు

Butterfly makes us feast with beauties - Sakshi

సాక్షి, అమరావతి: సీతాకోక చిలుకకు చీరలెందుకు.. అంటూ సప్తవర్ణ శోభితమైన వాటి అందాన్ని ఓ సినీకవి ఎంతో రమణీయంగా వర్ణించినట్లే పచ్చదనం పర్చుకున్న ఈ ప్రకృతి కూడా ఎన్నో అందాలతో మనకు కనువిందు చేస్తుంది. ఇందులో రకరకాల వృక్ష సంపదే కాదు.. అనేక రకాల కీటకాలూ మనల్ని అలరిస్తాయి.. ఎంతో మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి సీతాకోక చిలుకలు. ఓ పువ్వు మీద నుంచి ఇంకో పువ్వు మీదకు.. ఓ కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు.. వయ్యారంగా రెక్కలూపుకుంటూ ఎగిరే ఈ సీతాకోకలు సర్వమానవాళికీ ఆహార భద్రత కలిగిస్తాయి. పర్యావరణంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ జాతిలో ఇప్పుడు కొత్తగా నాలుగు రకాలు చేరాయి. అది కూడా ఎక్కడో కాదు.. మన ఏపీలోనే. ఆ వివరాలు..

రుతుపవనాలు పర్యావరణంలో కొన్ని అందమైన మార్పులు తీసుకొస్తాయి. పెరుగుతున్న పచ్చదనం, వికసిస్తున్న పువ్వులు, కొత్త వృక్ష సంపద.. వాటి చుట్టూ అనేక రకాల పురుగుల మనుగడ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రకృతిలో జరిగే ఈ అందమైన మార్పులు, కీటకాల మనుగడను ప్రకృతి ప్రేమికులు నిశితంగా పరిశీలిస్తారు. వారి అన్వేషణలో (నేచర్‌ వాక్స్‌) ఇటీవల రాష్ట్రంలో నాలుగు కొత్త సీతాకోక చిలుక జాతులు రికార్డయ్యాయి. చిత్తూరు జిల్లా తిరుమలలో ఫ్లంబియస్‌ సిల్వర్‌లైన్, నారో బ్యాండెడ్‌ బ్లూ బాటిల్‌ జాతి సీతాకోక చిలుకలను కనుగొన్నారు.

విశాఖపట్నం ఏజెన్సీలోని కొయ్యూరు ప్రాంతంలో లాంగ్‌ బ్యాండెడ్‌ సిల్వర్‌లైన్, డార్క్‌ పైరాట్‌ జాతులను గుర్తించారు. ఈ నాలుగు జాతుల సీతాకోక చిలుకలు ఇంతవరకు మన రాష్ట్రంలో రికార్డు కాలేదు. విజయవాడ నేచర్‌ క్లబ్‌కి నేతృత్వం వహిస్తున్న రాజేష్‌ వర్మ దాసి, రాజశేఖర్‌ బండి బృందం ఇటీవల నిర్వహించిన నేచర్‌ వాక్స్‌లో తొలిసారిగా వాటిని తమ కెమెరాల్లో బంధించారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అరుదైన ఆర్కిడ్‌ టిట్‌ జాతి సీతాకోక చిలుక కూడా రికార్డయింది. ఇది గతంలో రికార్డయినా చాలా అరుదైనది. ప్రకృతి ప్రేమికుడు జిమ్మీ కార్టర్‌ దీన్ని రికార్డు చేశారు. ఈ ఆర్కిడ్‌ టిట్‌ సీతాకోక చిలుక 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం షెడ్యూల్‌–1 పరిధిలోకి వస్తుంది. దీని ప్రకారం..  పులులను సంరక్షిస్తున్నట్లే ఈ జాతి సీతాకోక చిలుకల్ని సంరక్షించాల్సి వుంది. అందుకే పర్యావరణంలో వీటికి అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతున్నారు. 

170 సీతాకోక చిలుక జాతులు, 200 చిమ్మట జాతులు 
సీతాకోక చిలుకలు, చిమ్మటలు (పురుగు సీతాకోక చిలుకలు), తేనెటీగలు, కందిరీగల వంటి కీటకాలు ముఖ్యమైన పరాగ సంపర్క జీవులు.  ఇవి అనేక ఆహార పంటలను పరాగ సంపర్కం చేయడం ద్వారా మానవాళికి ఆహార భద్రతను కల్పిస్తున్నాయి. మన దేశంలో వెయ్యి కంటే ఎక్కువ జాతుల సీతాకోక చిలుకలు, 10 వేల జాతుల చిమ్మటలు ఉన్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 170కి పైగా సీతాకోకచిలుక జాతులు, 200కి పైగా చిమ్మటలు రికార్డయ్యాయి. వీటి జీవిత కాలం ఎంతంటే.. కొన్ని రకాలు కేవలం 15 రోజులు మాత్రమే జీవిస్తే.. మరికొన్ని 12 నెలల వరకూ బతుకుతాయి. 

నేచర్‌ వాక్స్‌తో కొత్త విషయాలు 
ఐఐఎస్‌ఈఆర్‌ (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌), తిరుపతి విభాగం తరచూ నేచర్‌ వాక్స్‌ నిర్వహిస్తుంది. ఈ వాక్స్‌లో అనేక కొత్త సీతాకోక చిలుకలు, ఇతర కీటకాలను రికార్డు చేస్తున్నాం. ప్రకృతి, జీవ వైవిధ్యానికి సంబంధించి ఎన్నో కొత్త విషయాలు వీటి ద్వారా తెలుస్తాయి.  సెప్టెంబర్‌ నెలను బిగ్‌ బటర్‌ఫ్లై మంత్‌గా పిలుస్తారు. వలంటీర్లు వారి చుట్టూ ఉన్న సీతాకోక చిలుక జాతులను రికార్డ్‌ చేసి సిటిజన్‌ సైన్స్‌ పోర్టల్స్‌లో పంచుకుంటారు. మన దేశంలో ఈ సమాచారాన్ని ifoundbutterflies,indiabiodiversityportal, moths of india and inaturalist వంటి వెబ్‌సైట్‌లలో సమర్పిస్తారు. ప్రకృతి ప్రేమికులు ఎవరైనా జీవవైవిధ్య పరిరక్షణకు ఈ పనిచేయవచ్చు. 
– రాజశేఖర్‌ బండి, సిటిజన్‌ సైన్స్‌ కో–ఆర్డినేటర్, ఐఐఎస్‌ఈఆర్, తిరుపతి 

గొప్ప జీవ వైవిధ్యం ఏపీ సొంతం
రాష్ట్రంలో చాలా గొప్ప జీవ వైవిధ్యం ఉంది. దురదృష్టవశాత్తు అది తగినంతగా నమోదుకాలేదు. దైనందిన జీవితంలో మన చుట్టూ కనిపించే జీవవైవిధ్యం, జీవులను రికార్డు చేసి డాక్యుమెంట్‌ చేయడం చాలా ముఖ్యం. వాటి ఆవాసాల విధ్వంసం, వాతావరణ మార్పులు, పురుగు మందులు అధిక వినియోగం వంటి అనేక అంశాలు కొన్ని పరాగ సంపర్క జాతుల్ని కనుమరుగయ్యేలా చేస్తున్నాయి. అందుకే వాటి సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా జీవవైవిధ్యం పరిరక్షణ కోసం ప్రణాళికను రూపొందించే అవకాశం ఉంటుంది. ఇటీవల మేం చేపట్టిన నేచర్‌ వాక్స్‌లో నాలుగు సీతాకోక చిలుక జాతులను కొత్తగా మన దగ్గర రికార్డు చేశాం. 
– రాజేష్‌ వర్మ దాసి, విజయవాడ నేచర్‌ క్లబ్‌ నిర్వాహకుడు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top