
సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను ఏమాత్రం పట్టించుకోకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను జారీ చేయడంపై అధికార యంత్రాంగంలో విస్మయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలను మించి పెద్ద సంఖ్యలో పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాల్సి ఉందని గుర్తు చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ పరిస్థితి ఏమిటి? తగినన్ని బ్యాలెట్ బాక్స్‌లు ఉన్నాయా? పోలింగ్ సిబ్బంది సంఖ్య తదితరాల గురించి ఏమాత్రం వాకబు చేయకుండా కరోనా వ్యాక్సినేషన్‌కు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఏదో తరుముకొస్తున్నట్లుగా ఎన్నికలు జరపాలనే నిర్ణయం తీసుకోవడం పట్ల అంతా విస్తుపోతున్నారు. ఇలా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలతో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ హయాంలో పట్టించుకోకుండా...
వాస్తవానికి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ల పదవీ కాలం టీడీపీ హయాంలోనే 2018 ఆగస్టులోనే ముగిసినా అప్పుడు కూడా ఎస్‌ఈసీగా ఉన్న నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను జరపలేదు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా హఠాత్తుగా ఈ సమయంలో షెడ్యూల్ జారీ చేయడం సరికాదని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అధికార యంత్రాంగం అంతా తలమునకలై ఉన్నందున ఎన్నికలు ఇప్పుడు సాధ్యం కాదని ఉన్నతాధికారుల బృందం తెలియచేసినా మొండి వైఖరి అనుసరించడాన్ని బట్టి నిమ్మగడ్డ నిష్పాక్షికతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని, నిపుణులు పేర్కొంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు మించి..
రాష్ట్రవ్యాప్తంగా 13,371 గ్రామ పంచాయతీలకు సర్పంచి ఎన్నికలతో పాటు 1,34,099 వార్డు పదవులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే దాదాపు లక్షన్నర పదవులకు ఎన్నికలు జరపాలి. ఒక్కో పదవికి ముగ్గురు చొప్పున పోటీలో ఉన్నా తక్కువలో తక్కువ నాలుగున్నర లక్షల మంది బరిలో ఉంటారు. అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా 43 వేల పోలింగ్ కేంద్రాలలోనే జరుగుతాయని, పంచాయతీ ఎన్నికలు మాత్రం దాదాపు 1.34 లక్షల పోలింగ్ బూత్‌లలో జరపాల్సి ఉంటుంది. ఇంత పెద్ద స్థాయిలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలంటే అందుకు తగ్గ ఏర్పాట్లు జరిగాయో లేదో తొలుత పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇవేమీ పట్టించుకోకుండానే నిమ్మగడ్డ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు.
అర్థాంతరంగా ఆపినవి వదిలేసి కొత్త పంచాయితీ
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు గత ఏడాది మార్చిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ల ఉపసంహరణ కూడా ముగిసింది. పట్టణ, నగర వార్డు సభ్యులకు మరో నోటిఫికేషన్ విడుదల చేసి వాటి నామినేషన్ల ప్రక్రియనూ పూర్తి చేశారు. ఆ తరుణంలో ఎన్నికల మధ్యలో అర్థాంతరంగా వాయిదా వేశారు. దాదాపు 50 వేల మంది ఆయా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. మధ్యలో ఆగిపోయిన ఆ ఎన్నికలను పూర్తిగా పక్కనపెట్టి ఇప్పుడు కొత్తగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను నిమ్మగడ్డ ప్రకటించారు. ఇలా ఒక ఎన్నికలను మధ్యలో నిలిపివేసి మరో ఎన్నికలను చేపట్టాలని ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవడం ఇంతవరకు దేశంలో ఎక్కడా జరగలేదని పేర్కొంటున్నారు.