
వ్యాధులతో టమాఠా..
ఆత్మకూరు: టమాట రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడం, ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలతో బాసటగా నిలవాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం వెరసి నష్టాలే మిగులుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రైతులు టమాట పంట సాగు చేశారు. అధికారిక లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల వరకు పంట సాగైంది. జిల్లాలోని కళ్యాణదుర్గం, ఆత్మకూరు, శెట్టూరు, కంబదూరు, రాయదుర్గం మండలాల్లో అధికంగా టమాట సాగులోకి వచ్చింది.
వ్యాధులతో అతలాకుతలం..
టమాట పంటను రైతులు ప్రత్యేక శ్రద్ధతో కాపాడుకుంటారు. ఒక ఎకరా భూమిలో పంట సాగుకు రూ.50 వేలకు పైగా ఖర్చు వస్తోంది. నార, భూమి చదును, ఎరువులు, మందులు తదితరాలకు రైతులు ఈ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. నార పెట్టిన 70 రోజుల్లో పంట కోతకు వస్తుంది. రెండు నెలల క్రితం సాగు చేసిన పంటను ప్రస్తుతం కోయాల్సి ఉంది. అయితే, పంటలపై వ్యాధుల పంజా విసరడంతో ఆశించిన దిగుబడి కానరావడం లేదు. చెట్లకు పురుగు పట్టి కాయలపై మచ్చలు వస్తుండటంతో చాలా వరకూ కాయలు వృథాగా పోతున్నాయి. ఈ క్రమంలో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సాధారణంగా టమాట సీజన్ మొదట్లో అధిక ధరలు లభించేవి. కానీ, ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు.
సాయం కరువు..
రైతులకు ప్రభుత్వం నుంచి కూడా పైసా సాయం అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇంత వరకు ‘అన్నదాత సుఖీభవ’ కింఈ పంట పెట్టుబడికి కనీస సాయం చేయలేదు. దీంతో బయట అప్పులు చేసి పంటలను సాగు చేసుకుంటున్నారు. ఎంతో శ్రమకోర్చి సాగు చేసిన పంట చివరికి నష్టాలే మిగులుస్తుండతంతో అన్నదాతల ఆవేదన అంతా ఇంతా కాదు. దీనికితోడు అధికారుల నుంచి కూడా భరోసా కరువవడంతో బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఎప్పటికప్పుడు పంట పొలాల్లో పర్యటించి సలహాలు సూచనలు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.
రోగాల బారిన టమాట పంట
అధిక భాగం కాయలకు మచ్చలు
పెరికి రోడ్డుపక్కన పడేస్తున్న రైతులు
ప్రభుత్వ సాయమూ కరువవడంతో
అన్నదాతలు నష్టాలపాలు
ప్రభుత్వం ఆదుకోవాలి
రెండు ఎకరాల్లో టమాట పంటను సాగు చేశా. రూ. లక్ష ఖర్చు వచ్చింది. ఈ ఏడాది టమాట ధరలు అనుకున్న స్థాయిలో లేవు. ప్రభుత్వం కనీస మద్దతు ధరతో టమాటను కొనుగోలు చేయాలి. అధికారులు రైతులకు సలహాలు సూచనలిస్తే బాగుంటుంది. – బసవరాజు,
దొడగట్ట గ్రామం, కళ్యాణదుర్గం మండలం
పెట్టుబడి కూడా వస్తుందో లేదో?
నాలుగు ఎకరాల్లో టమాట పంటను సాగు చేశా. ఇప్పటికే రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. పంట దిగుబడి అనుకున్న స్థాయిలో లేదు. టమాట కాయలకు కూడా పూర్తిగా మచ్చలు వచ్చాయి. కనీసం పెట్టుబడి కూడా వస్తుందో లేదో అని ఆందోళనగా ఉంది.
– కందుల పుల్లారెడ్డి, రైతు, ఆత్మకూరు

వ్యాధులతో టమాఠా..

వ్యాధులతో టమాఠా..

వ్యాధులతో టమాఠా..