
మొదలైన విత్తన కార్తెలు
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ పంచాంగం ప్రకారం శుక్రవారం మృగశిర కార్తె ముగిసింది. శనివారం ‘ఆరుద్ర’ ప్రవేశించనుంది. ఆరుద్ర కార్తె అనగానే రైతుల మోములు వికసిస్తాయి. మనపూర్వీకుల నుంచి ఈ కార్తెతో రైతులకు చాలా అవినాభావ సంబంధం ఉంది. మంచి వర్షాలు పడి ఈ కార్తెలో విత్తనం పడితే తప్పనిసరిగా పంట పండుతుందని రైతుల విశ్వాసం. ముంగారు విత్తన కార్తెలు ఆరుద్రతో మొదలై పుష్యమితో ముగుస్తాయి. ప్రధానంగా శనివారం మొదలు కానున్న ఆరుద్ర జూలై 6న ముగుస్తుంది. జూలై 6 నుంచి 20 వరకు పునర్వసు కార్తె ఉంటుంది. జూలై 20 నుంచి ఆగస్టు 3 వరకు పుష్యమి కార్తె ఉంటుంది. ఈ మూడు కార్తెలు ఖరీఫ్ పంటలు వేసుకునేందుకు అదనుగా భావిస్తారు. అందులోనూ ఆరుద్ర, పునర్వసులో విత్తుకునేందుకు రైతులు మొగ్గు చూపుతారు. ఈ రెండు కార్తెలు విత్తుకు మంచి అదనుగా భావిస్తారు. ఒక వేళ వర్షాలు ఆలస్యమైతే పుష్యమిలో విత్తుకుంటారని చెబుతున్నారు. ఆ తర్వాత వేరుశనగ, కంది, ఆముదం, పత్తి లాంటి ప్రధాన పంటలు వేసుకోకపోవడం మంచిదని గట్టిగా చెబుతారు. శాస్త్రవేత్తలు కూడా జూన్ 15 నుంచి జూలై 15 వరకు మంచి అదనుగా ప్రకటించారు. వర్షాలు ఆలస్యమైతే జూలై ఆఖరు వరకు చెబుతారు. ఆగస్టులో ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమనేది తెలిసిన విషయమే. రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టే ఏరువాక పౌర్ణమి కూడా శుక్రవారం ముగిసింది. వ్యవసాయశాఖ ఎక్కడా ఏరువాక పౌర్ణమి నిర్వహించకపోవడం గమనార్హం.
ఖరీఫ్ సాగు 3.46 లక్షల హెక్టార్లు అంచనా
ఈ ఏడాది మే రెండో పక్షంలో ముందస్తుగా తొలకరి వర్షాలు బాగా కురిశాయి. ఆ తర్వాత ఈ నెల 2న ప్రవేశించిన ‘నైరుతి’ రుతుపవనాలు ప్రభావంతో చూపడంతో 15వ తేదీ వరకు జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడ్డాయి. దీంతో కొందరు రైతులు ఏరువాక ముందస్తుగానే మొదలు పెట్టారు. తీరా ఇపుడు మంచి అదను కావడంతో పూర్తి స్థాయిలో సాగుకు సన్నద్ధంగా ఉన్నారు. అక్కడక్కడ విత్తు కార్యక్రమాలు కొనసాగిస్తున్నా... ఇపుడు మరోసారి మంచి వర్షం పడాలని కోరుకుంటున్నారు. ఇంకా సమయం ఉన్నందున వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు చెబుతుండటంతో ఈ ఖరీఫ్‌లో 3.46 లక్షల హెక్టార్లలో సాగు కావొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందులో వేరుశనగ 2 లక్షల హెక్టార్లుగా అంచనా వేశారు.
● జూన్ నెల సాధారణ వర్షపాతం 61 మి.మీ కాగా జూన్ 15 నాటికే ఏకంగా 140 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత తేలికపాటికే పరిమితమైంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఖరీఫ్ నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. అందులో జూన్‌లో 61 మి.మీ, జూలైలో 63.9 మి.మీ, ఆగస్టులో 83.8 మి.మీ, సెప్టెంబర్‌లో 110.9 మి.మీ వర్షపాతం నమోదైతే ఖరీఫ్‌కు ఢోకా ఉండదని అంచనా వేస్తున్నారు.
జూలై ఆఖరు వరకు విత్తుకు అదను